అన్యదా భావించకండి…. తప్పులుంటే మన్నించండి

“మీ క్షేమమే మేం కోరుతున్నాం. పార్టీని వచ్చే ఎన్నికలకు సన్నద్ధం చేయడమే మా ఉద్దేశ్యం. పార్టీ నాయకత్వాన్ని మేం ప్రశ్నించలేదు. ఉన్న పరిస్థితిని మాత్రమే గుర్తు చేశాం. [more]

Update: 2020-08-26 17:30 GMT

“మీ క్షేమమే మేం కోరుతున్నాం. పార్టీని వచ్చే ఎన్నికలకు సన్నద్ధం చేయడమే మా ఉద్దేశ్యం. పార్టీ నాయకత్వాన్ని మేం ప్రశ్నించలేదు. ఉన్న పరిస్థితిని మాత్రమే గుర్తు చేశాం. సోనియా గాంధీ నాయకత్వంలోనే పనిచేయాలని కోరుకుంటున్నాం.” అని కాంగ్రెస్ సీనియర్ నేతలు దారికొచ్చినట్లే కనపడుతుంది. సోనియాగాంధీకి కాంగ్రెస్ సీనియర్ నేతలు 23 మంది లేఖలు రాయడంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే.

సీన్ రివర్స్ కావడంతో…..

రాహుల్ గాంధీతో పాటు సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ కూడా లేఖను తప్పుపట్టారు. సీనియర్ల వ్యవహారశైలి సరిగా లేదని భావించారు. మరోవైపు మన్మోహన్ సింగ్, ఆంటోని వంటి నేతలు కూడా సీనియర్ నేతలు రాసిన లేఖను ఖండించారు. అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని థిక్కరించడమేనని అన్నారు. మరో పవర్ సెంటర్ ను పార్టీలో ఏర్పాటు చేయడానికి జరిగిన ప్రయత్నంలో భాగమేనన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది.

కిక్కు దిగడంతో….

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలకు కిక్కు దిగింది. దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ చూరును పట్టుకుని వేళ్లాడిన నేతలు ఈ వయసులో మరో పార్టీకి వెళ్లలేరు. తమను నాయకులుగా ఎదగనిచ్చిన కాంగ్రెస్ ను వదులకోలేరు. అందుకే వారు లేఖపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోనియాను స్వయంగా కలుసుకుని వివరణ ఇవ్వాలను కున్న గులాంనబీ ఆజాద్ వంటి నేతలకు టెన్ జన్ పథ్ నుంచి అపాయింట్ మెంట్ లభించలేదు.

పార్టీని వీడేవాళ్లెవ్వరూ లేరని……

దీంతో తాము అమాయకులమని, ఏమీ ఎరగమని మీడియా పరంగా వివరణ ఇస్తున్నారు. త్వరలోనే లేఖలో ఉన్న ప్రాముఖ్యతను గుర్తిస్తారని ముకుల్ వాస్నిక్ వంటి నేతలు అంటున్నారు. ఇది పదవికి సంబంధించిన విషయం కాదని, దేశానికి సంబంధించిందని కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ ట్వీట్ చేశారు. వచ్చే ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడమే మా ముందన్న లక్ష్యమని సీనియర్ కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ వ్యాఖ్యానించారు. ఇలా అన్యధా శరణం నాస్తి అంటూ సోనియా శరణజొస్తున్నారు. తాము ఎవరికీ పార్టీని వీడే ఆలోచన లేదని పదే పదే చెబుతున్నారు.

Tags:    

Similar News