పగ్గాలు వదిలేశారు. ఇదే ఉత్సవ్ భారత్

భారత దేశంలో ప్రాణాలకు విలువ లేదు. మత విశ్వాసాలు, భావోద్వేగాలు, రాజకీయాలు రాజ్యం చేస్తుంటాయి. పర్వదినాల్లో ఉత్సవ మూర్తులను ఊరేగిస్తుంటారు. ఆ దేవుళ్లు కేవలం సందర్శనకు మాత్రమే [more]

Update: 2021-04-16 16:30 GMT

భారత దేశంలో ప్రాణాలకు విలువ లేదు. మత విశ్వాసాలు, భావోద్వేగాలు, రాజకీయాలు రాజ్యం చేస్తుంటాయి. పర్వదినాల్లో ఉత్సవ మూర్తులను ఊరేగిస్తుంటారు. ఆ దేవుళ్లు కేవలం సందర్శనకు మాత్రమే తప్ప వరాలు ఇవ్వరనేది ప్రతీతి. దేశంలో చట్టాలు అదే విధంగా ఉత్సవ విగ్రహంగా మారిపోతున్నాయి. ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నాయకులు అధికారం కోసం పడే ఆరాటంలో, చేసే పోరాటంలో అర శాతమైనా ప్రజలకోసం వెచ్చించడం లేదు. ఆలోచించడం లేదు. ఫలితంగానే రెండు లక్షల చేరువలో రోజువారీ కరోనా కేసులు, వెయ్యి కి దరిదాపుల్లో మరణాలకు చేరిపోయాం. ఇదంతా ప్రభుత్వం నియంత్రణ పగ్గాలు వదిలేసిన పాపమే. అమెరికా వంటి పాశ్చాత్య దేశాల తరహాలో భారత ప్రజలు క్రమశిక్షణ కలిగిన పౌరులు కాదు. తొలి నుంచి రాజకీయ వ్యవస్థ వారిని ఆ విధంగా తయారు చేసింది. చట్టం, నిర్బంధం ఉన్నప్పుడు మాత్రమే వారు కొంతమేరకు అదుపులో ఉంటారు. ఉత్సవాలు, ఎన్నికలు, సభలు, సమావేశాలు, వేడుకలకు ప్రభుత్వాలు పచ్చ జెండా ఊపడంతోనే దేశంలో మరోసారి కరోనా విజృంభణకు అవకాశం ఏర్పడింది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటామన్న చందంగా ఇప్పటికీ ప్రభుత్వాలు బ్రేకులు వేసేందుకు సిద్దం కావడం లేదు. ఉత్సవాలు, ప్రజాసమూహాలు గుమికూడే వేడుకలు, ఎన్నికల వంటి అంశాల్లో యథేచ్ఛగా స్వేచ్ఛనిస్తున్నారు. తమకు కావాల్సింది ఓట్లే తప్ప ప్రజల ప్రాణాలు కాదని నాయకులు తమ చేతలతో తేల్చి చెప్పేస్తున్నారు. తాము ప్రాధాన్యమిచ్చేది మత పరమైన సెంటిమెంట్లకే తప్ప ప్రజారోగ్యానికి కాదనీ నిరూపిస్తున్నారు.

ఉత్పాతం ముంచుకొచ్చినా..?

బారత్ లో గడచిన ఏడాది రెండు నెలలకు పైగా కొనసాగిన లాక్ డౌన్లతో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయిపోయింది. దిగువ మధ్యతరగతి ప్రజలు పేదరికంలోకి జారిపోయారు. ప్రభుత్వం చాలా కఠినంగా నియంత్రించేందుకు చర్యలు తీసుకుంది. ఉపాధి కోల్పోతున్నా ప్రజలు సహకరించారు. ప్రజల ఆదాయం , జీవన భృతి పక్కనపెట్టిన సర్కారులు తమ ఆదాయానికి మొదటిపీట వేసుకున్నాయి. నియంత్రణలు సడలించిన తొలిరంగాల్లో మద్యం విక్రయాలకు అనుమతులిచ్చాయి. కరోనా కట్టడిపై ప్రభుత్వాల చిత్తశుద్ధి ఆనాడే వెల్లడైంది. తాజాగా కూడా రెండో విడత కరోనా విజృంభిస్తుంటే పాఠశాలలపై ఆంక్షలు పెడుతున్నారు. మద్యం షాపులు, బార్లను యథేచ్ఛగా నడుపుతున్నారు. ఉత్తరాఖండ్ వంటి చోట్ల కుంభమేళాలకు అనుమతిచ్చేశారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన లక్షలాది మందికి వ్యాధి సోకే ప్రమాదం ఏర్పడింది. వారంతా కరోనా రాయబారులుగా మళ్లీ దేశ వ్యాప్తంగా ఈ రోగాన్ని పంపిణీ చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతమున్న విపత్కర పరిస్థితులలో ఏ కారణాలతో అనుమతినిచ్చారో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి. దేశంలో ఇంకా ఒక శాతం ప్రజలకు కూడా టీకాలు వేయలేదు. రెండో విడత కరోనా పెరుగుతోంది. అయినా లక్షల ప్రజలు ఒక చోట గుమికూడి సామూహిక స్నానాలకు దిగుతున్నారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని మించిన బాధ్యతారాహిత్యం మరొకటి ఉండదు. ప్రపంచంలో ఎక్కడా లేని వింత ఇది. వ్యాధిని అదుపు చేసే చర్యలు అంతంతమాత్రం. టీకాలు తగినన్ని లేవు. సామూహిక టీకా కార్యక్రమం పూర్తయ్యేందుకు రెండు సంవత్సరాలు పడుతుందని అంచనా. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో దేశ నవనాడులు కుంగిపోయేలా ఉత్పాతాల వంటి ఉత్సవాలను ప్రోత్సహించడమేమిటో ఎవరికీ అర్థం కాదు.

ఏ రాయి అయితేనేం…?

ప్రజల్లో ప్రజాస్వామ్యం అంటే విపరీతమైన గౌరవం ఏమీ లేదు. తమకు వచ్చే సంక్షేమ పథకాలు, తమ ఓట్లకు వచ్చే నోట్లపైన శ్రద్ధ పెరిగింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పథకాలు, పాలన తీరులో పెద్దగా మార్పులు లేవు. పథకాల పేరిట నిధులను పంచి పెట్టడమే . ప్రపంచం కనివినీ ఎరుగని రోగంతో బాధ పడుతున్నప్పుడు ఎన్నికల వంటి వాటిని వాయిదా వేస్తే కొంపలేమీ అంటుకుపోవు. అవసరమైతే రాష్ట్రపతి పాలనలో పెట్టవచ్చు. లేదంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రులుగా ప్రస్తుతమున్న పాలక వర్గాన్ని కొంతకాలం కొనసాగించవచ్చు. నూతన పథకాలతో ప్రజలకు వల వేయకుండా నిరోధించవచ్చు. పార్లమెంటు ఈ విపత్కాలంలో అవసరమైన చట్టం చేసి ఎన్నికల వంటి సామూహిక ఉపద్రవ ఘట్టాల నుంచి దేశానికి ఒక ఏడాదిపాటు వెసులుబాటు కల్పించవచ్చు. వాటన్నిటినీ వదిలేసి లక్షలాది మంది ప్రజలతో ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. నిజానికి ఈ ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి జరుగుతున్నట్లుగా కనిపించడం లేదు. పరోక్షంగా ప్రజల ప్రాణాలను అభద్రతలో నెట్టేసేందుకు పార్టీల కుట్రగా కనిపిస్తోంది. దేశంలో హెల్త్ ఎమర్జన్సీ వాతావరణం నెలకొని ఉంది. ప్రాణాలు కాపాడుకుంటేనే ప్రజాస్వామ్యం. ప్రాణాలకంటే విలువైనది ఏమీ ఉండదు. ప్రజాస్వామ్యాన్ని కొనసాగించడానికి ప్రత్యామ్నాయ పద్ధతులూ మనవద్ద ఉన్నాయి. వాటిని వినియోగించకుండా ముప్పు తెచ్చిపెట్టాయి ప్రభుత్వాలు,. ఎన్నికల సంఘాలు. స్థానిక ఎన్నికలు, శాసనసభల ఎన్నికలు, ఉప ఎన్నికలు అంటూ గడచిన రెండు నెలలుగా దేశంలో చాలా రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం కరోనా వైరస్ ను మించి వ్యాపించి పోయింది.

భయాందోళనల్లో సామాన్యుడు…

దేశంలో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వారి భయం కరోనా పెరిగిపోతుందేమోనని కాదు. సంచలన, అనూహ్య నిర్ణయాలు తీసుకోవడంలో ప్రదాని మోడీ రికార్డే వేరు. కేసులు, మరణాల సంఖ్యను సాకుగా చూపి మళ్లీ దేశంలో లాక్ డౌన్ విధిస్తారేమోననేది వారి భయం. గతంలో లాక్ డౌన్ విధించి కరోనాను కట్టడి చేశామని ప్రభుత్వాలు జబ్బలు చరుచుకున్నాయి. కానీ ఆకలిదప్పులతో ఎన్ని వేలమంది ప్రాణాలు కోల్పోయారో లెక్కలేదు. ఉపాధి లేక అప్పుల ఊబిలో తల ఎత్తుకోలేక ఎంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారో లెక్కలు లేవు. యూనివర్శల్ వాక్సినేషన్ పై శ్రద్ధపెట్టాల్సిన ప్రభుత్వాలు ఎన్నికలలో బిజీ అయిపోతున్నాయి. కరోనా కట్టడి తూతూ మంత్రంగా సాగుతోంది. కరోనా కట్టడి నిధి 35 వేల కోట్లు కేంద్ర ఖాతాలోనే మూలుగుతోంది. పెట్రోలు, డీజెల్ పై విధించిన అదనపు పన్నులూ సర్కారీ ఆదాయాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచుతున్నాయి. కానీ రోజువారీ కష్టపడి ఉపాధి పొందేవాడి కడుపు మాత్రం ఖాళీగా ఉంది. చేసిన అప్పులు తీర్చలేక వెతలు పడుతున్నాడు. ఈ స్థితిలో కరోనా పెరిగిందని మరోసారి లాక్ డౌన్ విధిస్తే వారి బ్రతుకు దుర్భరమే. కుంభమేళాలు, ఎన్నికల ఉత్సవాలు, మధ్య విక్రయాలతో బారత్ ను పరిపుష్టం చేయడం మానుకుంటే కరోనా విజ్రుంభణ కొంతవరకూ తగ్గే అవకాశం ఉంటుంది. అక్కడ మాత్రం ప్రభుత్వాలు స్వేచ్ఛ కల్పించి , లాక్ డౌన్ ల రూపంలో సామాన్యుడి కడుపుపై కొట్టే చర్యలు తీసుకోవద్దని యావత్ భారతావని కోరుకుంటోంది.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News