సీల్డ్ కవర్లో ఎవరి పేరు...???

Update: 2018-11-30 16:30 GMT

అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లు బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాలే. తెలంగాణలో ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ అధికారంలో ఉంది. మిజోరాంలో హస్తం పార్టీ గెద్దెను ఏలుతోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలో బీజేపీ విజయం సాధిస్తే మళ్లీ పాతనాయకులు శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధర రాజే, రమణ్ సింగ్ లు ముఖ్యమంత్రులు అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. మిజోరాంలో హస్తం పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి లాల్ తన్హ్ వాలా నే అధికార పగ్గాలు చేపడతారు. పదేళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఆయనను మార్చే సాహసం హస్తం పార్టీ చేయదు. కానీ అదృష్ట వశాత్తూ మిగిలిన నాలుగు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, తెలంగాణాల్లో కాంగ్రెస్ గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న ప్రశ్నకు సమాధానం దొరకడం చాలా కష్టం. అది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతుంది. కాంగ్రెస్ సంస్కృతి తెలిసిన వారికి ఈ విష‍యం చిరపరిచితమే.

ఢిల్లీ నుంచే ఆదేశాలు.....

హస్తం పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థుల ప్రకటన ప్రహసన ప్రాయంగా ఉంటుంది. ఈ విషయం ఒక పట్టాన తేలదు. చివరి నిమిషం వరకూ ఉత్కంఠే. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థుల ప్రకటన హస్తం పార్టీ చరిత్రలో అరుదు. ఎన్నికల అనంతరం కూడా ఇదే పరిస్థిితి ఉంటుంది. సానుకూల ఫలితాలు వస్తే ముందుగా శాసనసభ పక్ష సమావేశం జరుగుతుంది. ఢిల్లీ నుంచి అధిష్టానం పెద్దలు వాలిపోతారు. నిర్ణయ బాధ్యతను అధినేతకే వదిలేస్తూ శాసనసభ పక్షం చేత ఏకవాక్య తీర్మానం చేయిస్తారు. దీనితో సీన్ ఢిల్లీకి మారుతుంది. ఇక అక్కడ నుంచి రాజకీయం మొదలవుతుంది. పైరవీలు ప్రారంభమవుతాయి. సాధారణంగా విపక్షంగా ఉన్న కాంగ్రెస్ విజయం సాధిస్తే పీసీసీ అధ్యక్షులే ముఖ్యమంత్రి పదవి రేసులో ముందుండాలి. లేనట్లయితే శాసనసభ పక్ష నాయకులు తెరపైకి వస్తుంటారు. ఇంతవరకు ఇబ్బంది ఏమీలేదు. కానీ ఒక్కోసారి ఊరూపేరులేని నాయకులు, కనీసం శానసనభ్యులు కూడా కానివారి పేర్లు తెరపైకి వస్తుంటాయి. చివరికి అధిష్టానం వద్ద అత్యధిక మార్కులు పొందిన నాయకుడి పేరు సీల్డ్ కవర్ లో దిగుమతి అవుతుంది. అతనే ముఖ్యమంత్రి అవుతాడు.

వీరి మధ్యే పోటీ.....

తాజా అసెంబ్లీ ఎన్నికల అనంతరం కూడా అదే పరిస్థితి ఏర్పడనుంది. ఇప్పటి వరకూ ఒక్క రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి అభ్యర్ధుల పేర్లను అధిష్టానం ప్రకటించలేదు. తెరపైకి నాయకుల పేర్లు స్పష్టంగా వస్తున్నప్పటికీ అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎవరివైపూ మొగ్గు చూపడం లేదు. ఎలాంటి సందేశాలను పంపడం లేదు. ఉదాహరణకు మధ్యప్రదేశ్ ను తీసుకుంటే....అక్కడ పీసీసీ చీఫ్ కమల్ నాధ్, యువనాయకుడు జ్యోతిరాదిత్య సింధియా పేర్లు తెరపైకి వస్తున్నాయి. వారిలో ఎవరిపట్ల ఆసక్తిని అధిష్టానం ఉద్దేశ్యపూర్వకంగా చూపడం లేదు. ఇద్దరి మధ్య సమదూరాన్ని పాటిస్తూ జాగ్రత్త పడుతుంది. రాజస్థాన్ లోనూ ఇదే పరిస్థితి. యువనాయకుడు, పీసీీసీ చీఫ్ సచిన్ పైలట్, కురువృద్ధుడు, రెండుసార్లు ముఖ్యమంత్రి గా పనిచేసిన అశోక్ గెహ్లాట్ మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం గట్టి పోటీ ఉంది. వారిద్దరూ అక్కడ అసెంబ్లీకి కూడా పోటీ చేస్తున్నారు. సర్దార్ పుర నుంచి గెహ్లాట్, టోంక్ స్థానం నుంచి పైలట్ పోటీ పడుతున్నారు. ఇద్దరు నాయకులు అధినేత రాహుల్ కు ఆంతరింగికులే. ఈ ఎడారి రాష్ట్రంలో హస్తం పార్టీ విజయం తథ్యమని అన్నీ సర్వేలు చెబుతున్నాయి. అయినా ముఖ్యమంత్రి పదవిపై అధిష్టానం మౌనం వీడటం లేదు. ఏ ఒక్కరినీ ప్రోత్సహించినట్లు కనపడటం లేదు. ఇద్దరూ కలసి పని చేయాలని మాత్రం చెబుతోంది.

ఈ రెండు చోట్ల కూడా.....

ఛత్తీస్ ఘడ్ లోనూ ఇదే పరిస్థితి . పదిహేనేళ్లుగా రాష్ట్రంలో పార్టీ అధికారానికి దూరంగా ఉంది. పీసీసీ అధ్యక్షుడు భూపేష్ బగెల్, సీనియర్ నేతలు చరణ‌్ దాస్ మహంతి, టీఎస్ సింగ్ దేవ్ లు సీఎం అభ్యర్థులుగా తెరపైకి వచ్చారు. పీసీసీ చీఫ్ భూపేష్ బగేల్ పఠన్ నుంచి , సీఎల్పీ నాయకుడు, రాజకుటుంబానికి చెందిన టీఎస్ సింగ్ దేవ్ అంబికాపూర్ నుంచి , మాజీ కేంద్రమంత్రి మహంతా సకిత్ నుంచి పోటీ చేశారు. వీరిలో ఎవరికీ ఎలాంటి సంకేతాలను అధిష్టానం పంపలేదు. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు జానారెడ్డి ప్రధాన పోటీదారులు. మరికొందరి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇక్కడా అధిష్టానం గుంభనంగా ఉంటోంది. ముందే ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటిస్తే ఒకరినొకరు ఓడించుకుంటారని, అంతిమంగా పార్టీకి నష్టం వాటిల్లుతుందన్నది హైకమాండ్ ఆలోచన. కానీ అసలు ప్రకటించకపోవడం వల్ల కూడా నష్టం ఉంది. ఎవరూ బాధ్యత తీసుకోరు. ఫలితంగా నాయకుడు లేని నావ అవుతుంది. అది ఎటుపోతుందో తెలియదు. కాంగ్రెస్ సంస్కృతిని బీజేపీ కూడా వంటబట్టించుకుంది. గత ఏడాది యూపీ ఎన్నికల్లో సీఎం పేరు ప్రకటించలేదు. చివరకు ఎంపీగా ఉన్న యోగి ఆదిత్యనాధ్ ను సీఎంను చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. జాతీయ పార్టీల వ్యూహం అలాగే ఉంటుంది కాబోలు....!!!

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News