ఏపీలో పవన్, బీజేపీ పరుగో పరుగు

ఏపీ రాజకీయాల్లో ఓ వైపు జగన్ బలంగా ఉన్నారు. ఎంత బలంగా అంటే రాజకీయ మైదానాన్ని 80 శాతం పైగా ఆయనే ఆక్రమించేశారు. ఇక మిగిలింది. 20 [more]

Update: 2019-06-25 10:30 GMT

ఏపీ రాజకీయాల్లో ఓ వైపు జగన్ బలంగా ఉన్నారు. ఎంత బలంగా అంటే రాజకీయ మైదానాన్ని 80 శాతం పైగా ఆయనే ఆక్రమించేశారు. ఇక మిగిలింది. 20 శాతం మాత్రమే. ఆ ఇరవై శాతంలో టీడీపీ ఉంది. అయినా సరే రాజకీయ శూన్యత ఉందని ఇతర పార్టీలతో సైతం రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఈ కారణంగానే ఆ శూన్యతను భర్తీ చేయాలనుకుంటున్నారు. బీజేపీ ఈ విషయంలో ఎక్కువ ఉత్సాహం కనబరుస్తోంది. ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఏంటి అంటే కేంద్రంలో అధికారంలో ఉండడం, నరేంద్ర మోడీ ఇమేజ్, పార్టికి కమిటెడ్ గా ఉన్న క్యాడర్. మరో వైపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్, ఏపీలో టీడీపీ బలహీనపడడం కూడా బీజేపీకి కలసివస్తోంది. ఒకపుడు కేంద్రంతో పాటు దాదాపుగా అన్ని రాష్ట్రాలను పాలించిన కాంగ్రెస్ నమూనాని మళ్ళీ తెరమీదకు తీసుకురావాలని బీజేపీ ప్రయత్నం. అందుకోసం తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ గట్టి పట్టుదల మీద ఉంది.

ఆపరేషన్ ఆకర్ష్ :

ఇప్పటికిపుడు జనంలోకి వెళ్ళి ఎమ్మెల్యేలు, ఎంపీలు తెచ్చుకోవడం అంటే కష్టసాధ్యమైన పని. దానికి బదులుగా ఇన్స్టంట్ గా ఇతర పార్టీల నుంచి నాయకులను తెచ్చుకుంటే పని సులువు అవుతుంది. పైగా తమ పార్టీ పట్ల బోలెడు ఆదరణ ఉందని చెప్పుకోవడానికి వీలు అవుతుంది. దాంతో కమలనాధులు టీడీపీని చీల్చే పనిలో బిజీగా ఉన్నారు. తొలి విడతలో రాజ్యసభ కు చెందిన నలుగురు ఎంపీలను లాగేసి టీడీపీకి షాక్ ఇచ్చారు. ఇపుడు లోక్ సభ ఎంపీలతో పాటు, ఏపీలో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, బలమైన నాయకుల మీద బీజేపీ చూపు పడింది. మెల్లగా నయానో భయానో వారిని చేర్చుకుంటే ఏపీలో కమలానికి ఎదురు ఉండదని ఆ పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. ఏదో విధంగా టీడీపీని ఏపీలో ఖాళీ చేయించగలిగితే ఆ ప్లేస్ లోకి దూరిపోవచ్చునన్నది ఎత్తుగడగా ఉంది.

ఆలస్యంగా మెలుకొన్న పవన్ :

సహజంగా అధికారంలో ఉన్న పార్టీ వైపు ఎమ్మెల్యేలు ర్యాలీ అవుతారు. అక్కడ చేరేందుకు సిధ్ధపడతారు. అయితే జగన్ తీసుకున్న కీలకమైన నిర్ణయం మూలంగా ఫిరాయింపులు వైసీపీ వైపు వెళ్ళకుండా ఆగిపోయాయి. దాంతో బీజేపీ మంచి దూకుడు మీద ఉంది. ఇక మరో పార్టీగా జనసేన కూడా తాజా ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లుగా పోటీకి దిగింది. ఒకవేళ వైసీపీ కాదు అనుకుంటే జనసేన వైపుగా ఎమ్మెల్యేలు ఫిరాయించాలి. కానీ అది జరగడంలేదు. పైగా ఏపీ అసెంబ్లీలో ఒక్క సభ్యుడు కూడా లేని బీజేపీ వైపు టీడీపీ నేతలు మొగ్గు చూపుతున్నారు. మరి ఇక్కడే పవన్ చాలా ఆలోచించుకోవాల్సిఉంది. తన పార్టీ లో ఉన్న రావెల కిషోర్ బాబు సైతం బీజేపీ బాట పట్టారు. మరో కీలక నేత ఆకుల సత్యనారాయణ కూడా వీడిపోయే దారిలో ఉన్నారు. ఈ నేపధ్యంలో పవన్ వైపు చూసే వారు లేకపోవడం జనసేన భవిష్యత్తుని సూచిస్తోంది. దానికి కారణం జనసేనకు సరైన పార్టీ నిర్మాణం లేకపోవడం, పవన్ సైతం చంచల మనస్తత్వంతో రాజకీయాలు చేయడం. ఎట్టకేలకు పవన్ ఇపుడు మేలుకొన్నారు. పార్టీ నిర్మాణంపైన ద్రుష్టి పెట్టారు.

బలపడే చాన్స్ ఎవరిది :

ఇలా ఓ వైపు బీజేపీ దూకుడు మీద ఉంటే పవన్ కూడా తానూ వెనక్కు తగ్గనని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ఇద్దరిలో ఎవరికి ఏపీలో చాన్స్ ఉంది అన్న ప్రశ్న వచ్చినపుడు కచ్చితంగా బీజేపీకి అవకాశం ఉందని చెప్పాలి. ఏపీలో బలమైన కమ్మ సామాజిక వర్గం చూపు బీజేపీ మీదనే ఉంది. ఆ వర్గానికి నిన్నటి వరకూ టీడీపీ నీడను ఇచ్చింది. ఇపుడు ఆ చోటుని బీజేపీలో వెతుక్కుంటున్నారు. ఓ విధంగా నలభయ్యేళ్ల పాలనానుభవం ఉన్న కమ్మ సామాజికవర్గం రాజకీయాలను తనకు అనుకూలంగా డ్రైవ్ చేసుకోగలదు. అలా చూసినపుడు ఒకవేళ టీడీపీ బాగా బలహీనపడితే వైసీపీకి పోటీగా బీజేపీ యే అవుతుంది. జనసేన విషయానికి వస్తే కేవలం కాపుల ఓట్లు, ఒకటి రెండు జిల్లాలనే నమ్ముకుని రాజకీయం చేస్తూ వచ్చింది. ఇపుడైనా అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు సరిచూసుకుని రాజకీయం గట్టిగా చేస్తానని పవన్ నమ్మకం ఇస్తే ఆయనకు కూడా కొంత చోటు ఉంటుంది కానీ ఈ పరుగులో ప్రస్తుతానికి మాత్రం బీజేపీదే పై చేయిలా ఉంది.

Tags:    

Similar News