గుర్తుందా ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన… ?

కాలం ఎంత వేగంగా సాగుతుంది అనడానికి విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటన ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. సరిగ్గా ఏడాది క్రితం 2020 మే 7న ఈ దారుణం [more]

Update: 2021-05-08 00:30 GMT

కాలం ఎంత వేగంగా సాగుతుంది అనడానికి విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటన ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. సరిగ్గా ఏడాది క్రితం 2020 మే 7న ఈ దారుణం జరిగింది. ఆ రోజు తెల్లవారుజాము ఎందరో జీవితాలను తెల్లారేలా చేసింది. అతి ప్రమాదకరమైన రసాయన పదార్ధం స్టైరిన్ మోనోమర్ ఒక్కసారిగా లీక్ అయి ఎంతో మంది ఉసురు తీసింది. ఇరవై మంది దాకా ఈ ఘటనలో చనిపోతే వందలాది మంది గాయాల పాలు అయ్యారు. వారంతా ఇప్పటికీ ఆ బాధలను భరిస్తూనే ఉన్నారు. నాడు ముఖ్యమంత్రిగా జగన్ విశాఖ వచ్చి భారీ ఆర్ధిక సాయమే ఇచ్చారు. కానీ ఈ సమస్య మాత్రం క్యాలండర్ గిర్రున తిరిగినా కూడా అలాగే ఉంది.

చుట్టూ విషమే…?

ఎల్జీ పాలిమర్స్ ఏసీలు, ఫ్రిజ్ లు తయారు చేస్తుంది. వాటి తయారీలో వినియోగించే ముడి సరుకుగా స్టైరిన్ ఉంటుంది. దీన్ని 20 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే నిల్వ చేయాలి. అది ఎక్కువైతే దారుణాలే జరుగుతాయి. అలాగే సరైన ప్రమాణాలు పాటించకపోయినా ముప్పే. దీని వల్ల ఇప్పటికి విశాఖలోని గోపాలపట్నం వద్ద ఉన్న అయిదారు గ్రామాల ప్రజలు కోలుకోలేకుండా ఉన్నారు. వారికి శాశ్వతమైన అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే గుండెకు, ఇతర శరీర భాగాలకు సంబంధించిన సమస్యలు ఇప్పటికీ అధికంగా ఉన్నాయి. ఇక నాడు ఈ విష వాయువుతో పచ్చని చెట్లు రంగు మారాయి. ఏడాది గడచినా రుతువులు మారినా అలాగే ఉన్నాయి.

హామీలేమయ్యాయి…?

అతి ప్రమాదకరమైన ఎల్జీ పాలిమర్సర్ విష వాయువు తాలూకా అవశేషాలు శరీరంలో చేరి దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాని కోసం వారిని కనిపెట్టుకుని పూర్తిగా ఖరీదైన వైద్య చికిత్స అందేలా చర్యలు చేపట్టాలని కూడా ప్రభుత్వానికి నాడు సూచించారు. దానికి ప్రభుత్వ పెద్దలు సరేనని చెప్పారు. ప్రమాద ప్రాంతంలోనే మల్టీ స్పెషల్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. అలాగే అందరికీ హెల్త్ కార్డులు అన్నారు. కొన్నాళ్ళు టెంపరరీగా చిన్నపాటి ఆరోగ్య శిబిరం నడిపారు. ఇపుడు మాత్రం అవేమీ లేవు. ఇక హెల్త్ కార్డులు ఎక్కడా చెల్లని పరిస్థితి. ఇలా బాధలు మనసులో, గాయాలు శరీరంలో నింపుకుని ఆరు గ్రామాల ప్రజలు తమ ఖర్మ అనుకుని భరిస్తున్నారు.

న్యాయం చేయాలి….

పాలకుల తప్పిదాల వల్ల జరిగిన ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటకు బాధ్యత వహించి బాధితులకు పూర్తి న్యాయం చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం చెప్పినట్లుగా సంపూర్ణ వైద్య సదుపాయాలను కల్పించాలని, జీవితకాలం ఉచితంగా వారిని అవిదక్కాలని కూడా కోరుతున్నారు. మరో వైపు మెల్లగా ఎల్జీ పాలిమార్స్ అక్కడ తన కార్యకలాపాలు మొదలుపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని వాటిని అసలు అనుమతించరాదని కూడా అంటున్నారు. ఏడాది క్రితం ఎంతో ఆవేదన చెంది జగన్ బాధితులకు వరాలు ఇచ్చారు. ఇపుడు అదే ఎమోషన్ తో తగిన విధంగా వారిని ఆదుకోవాలని, అన్ని హామీలూ పూర్తిగా నెరవేర్చాలని కోరుతున్నారు. ఇక విపక్షాలు అయితే గుర్తుందా ఎల్జీ పాలిమర్స్ దారుణం జగన్ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Tags:    

Similar News