విక్టరీ అంత ఈజీ కాదటగా…!!!

శశిధరూర్…. వివాదాస్పద రాజకీయ వేత్త. కేంద్రమంత్రిగా పనిచేసినా ఆయనకు కాంట్రవర్సీ లీడర్ గానే పేరుంది. అయితే హ్యాట్రిక్ కొట్టేందుకు శశిధరూర్ మరోసారి బరిలోకి దిగారు. కేరళలోని తిరువనంతపురం [more]

Update: 2019-04-29 16:30 GMT

శశిధరూర్…. వివాదాస్పద రాజకీయ వేత్త. కేంద్రమంత్రిగా పనిచేసినా ఆయనకు కాంట్రవర్సీ లీడర్ గానే పేరుంది. అయితే హ్యాట్రిక్ కొట్టేందుకు శశిధరూర్ మరోసారి బరిలోకి దిగారు. కేరళలోని తిరువనంతపురం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన శశిధరూర్ కు ఇక్కడ బీజేపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశముందంటున్నారు. శబరిమల ఆలయ ప్రవేశం వివాదంతో ఇక్కడ బీజేపీ బాగా పుంజుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. శశిధరూర్ 2009, 2014 ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించారు. ప్రస్తుతం పోలింగ్ ముగిసింది.

మెజారిటీ తగ్గి….

2009 ఎన్నికలలో శశిధరూర్ దాదాపు లక్ష ఓట్లు మెజారిటీ సాధించగా, 2014 ఎన్నికలకు వచ్చే సరికి ఆ మెజారిటీ పూర్తిగా పడిపోయింది. గత ఎన్నికల్లో శశిధరూర్ మెజారటీ కేవలం పదిహేను వేలు మాత్రమే. దీంతో శశిధరూర్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటారా? లేదా? అన్నదానిపై జోరుగా చర్చలు జరగుతున్నాయి. రాహుల్ గాంధీ వయనాడ్ లో పోటీ చేస్తుండటంతో కొంత అనుకూలత వస్తుందని శశిధరూర్ భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత, రాహుల్ ప్రధాని కావాలన్న ఆకాంక్ష కేరళలో బలంగా ఉందన్నది శశిధరూర్ నమ్మకం.

సర్వశక్తులూ ఒడ్డుతున్న కమలం…

అయితే భారతీయ జనతా పార్టీ ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు సర్వశక్తులనూ ఒడ్డింది. తిరువనంతపురం లోక్ సభ అభ్యర్థిగా కుమ్మనం రాజశేఖర్ ను బరిలోకి దించింది. ప్రధానంగా బీజేపీ శబరిమల ఆలయ వివాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పును కేరళ ప్రభుత్వం అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ, హిందూధార్మిక సంస్థలతో కలసి పెద్దయెత్తున ఆందోళన చేపట్టింది. శబరిమల వివాదాన్ని తనకు అనుకూలంగా మలచుకోవడంలో బీజేపీ ఒకరకంగా సక్సెస్ అయిందనే చెప్పాలి. హిందూ ఓటు బ్యాంకును ఏకంచేసేందుకు శబరిమల ఉపయోగపడిందన్నది బీజేపీ నాయకత్వం విశ్వాసంగా ఉంది. సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా కేరళలో తరలి వచ్చిన ప్రజలే ఇందుకు నిదర్శనమని చెబుతోంది.

శబరిమల ఆలయ వివాదమే….

అందుకే తిరువనంతపురం లోక్ సభ ను సులువుగా కైవసం చేసుకోవచ్చని తొలి నుంచి బీజేపీ పావులు కదుపుతోంది. ఇక్కడ అభ్యర్థి గెలుపుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటి వరకూ కేరళలో ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా కమలం పార్టీ కైవసం చేసుకోలేదు. ఈసారి ఖచ్చితంగా 20 స్థానాల్లో 14 నియోజకవర్గాల్లో బీజేపీ తన అభ్యర్థులను బరిలోకి దించింది. మిగిలిన వాటిని మిత్రపక్షాలకు వదిలేసింది. ఈ 14 నియోజకవర్గాల్లో తిరువనంతపురంను ప్రత్యేకంగా తీసుకున్న బీజేపీ కేంద్ర నాయకత్వం తొలినుంచి దూకుడుగానే ఉంది. మరోవైపు ఎల్డీఎఫ్ అభ్యర్థిగా మాజీ మంత్రి దివాకరన్ పోటీ చేస్తున్నారు. ఇది కూడా తమకు లాభమేనని బీజేపీ చెబుతోంది. మొత్తం మీద శశిధరూర్ కు ఈ ఎన్నికల్లో నెగ్గడం అంత ఈజీ కాదన్నది విశ్లేషకుల అంచనా.

Tags:    

Similar News