శశికళ అవసరం అంత ఉందా?

తమిళనాడులో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అన్నాడీఎంకే, డీఎంకే ల మధ్య పోటీ తీవ్రమయింది. రజనీకాంత్ రాజకీయాల నుంచి తప్పుకోవడంతో ప్రధాన పోటీ ఈ రెండు కూటముల మధ్యనే [more]

Update: 2021-01-24 16:30 GMT

తమిళనాడులో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అన్నాడీఎంకే, డీఎంకే ల మధ్య పోటీ తీవ్రమయింది. రజనీకాంత్ రాజకీయాల నుంచి తప్పుకోవడంతో ప్రధాన పోటీ ఈ రెండు కూటముల మధ్యనే ఉంది. అయితే బీజేపీ మాత్రం అన్నాడీఎంకే కూటమిలో సంతృప్తికరంగా లేదంటున్నారు. అన్నాడీఎంకేను అధికారంలోకి తెచ్చే సత్తా పళనిస్వామి, పన్నీర్ సెల్వంలకు లేదని, వారు నాయకత్వం వహిస్తే డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమన్న విశ్లేషణలు బలంగా విన్పిస్తున్నాయి.

చిన్నమ్మ వస్తేనే?

ఈ నేపథ్యంలో శశికళపైనే అందరి చూపు పడింది. అన్నాడీఎంకేకు శశికళ నాయకత్వం వహిస్తే కొంత మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జయలలిత లేని లోటును శశికళ ఒక్కరు మాత్రమే పూడ్చగలరని అంటున్నారు. శశికళ కొద్ది రోజుల్లోనే పరప్పణ అగ్రహార జైలు నుంచి విడుదల కానున్నారు. ఆమె విడుదలయిన వెంటనే చర్చలు జరపాలని అన్నాడీఎంకే లోని ముఖ్యనేతలు కూడా భావిస్తున్నారు.

డీఎంకేను ఓడించాలంటే…?

శశికళ అన్నాడీఎంకే కు నేతృత్వం వహిస్తే ఉపయోగకరంగా ఉంటుందని విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. డీఎంకే ను ఓడించాలంటే అన్నాడీఎంకే శశికళను చేర్చుకోవాలని తమిళ వీక్లీ న్యూస్ మ్యాగ్ జైన్ తుగ్లక్ ఎడిటర్ గురుమూర్తి అన్నారు. శశికళ సహకారంతోనే విపక్ష డీఎంకేను నిలువరించగలరని ఆయన అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

వీరిద్దరూ అంగీకరించకున్నా….

ఇది అందరూ అంటున్న మాటే. అయితే అన్నాడీఎంకే ప్రస్తుతం నేతృత్వం వహిస్తున్న పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు మాత్రం ఇందుకు అంగీకరించరు. శశికళ వస్తే తాము పార్టీలో నామమాత్రమవుతామన్నది వారి భయం. అందుకే శశికళ జైలు నుంచి విడుదలయ్యే రోజునే మెరీనా బీచ్ లో అమ్మ స్మారక మందిరాన్ని ప్రారంభించనున్నారు. అయితే బీజేపీ ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కనీసం దినకరన్ పార్టీతో పొత్తు పెట్టుకునే దిశగానైనా బీజేపీ ప్రయత్నం చేస్తుందన్న టాక్ తమిళనాడులో విననపడుతుంది.

Tags:    

Similar News