చిన్నమ్మకు కష్టమేనా?

జయలలితకు అత్యంత ఆప్తురాలు శశికళ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఏమాత్రం కన్పించడం లేదు. జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ పరప్పణ అగ్రహార జైలులో శిక్ష [more]

Update: 2019-10-05 16:30 GMT

జయలలితకు అత్యంత ఆప్తురాలు శశికళ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఏమాత్రం కన్పించడం లేదు. జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. శశికళ సత్ప్రవర్తన కారణంగా ఈ ఏడాది చివరకు జైలు నుంచి విడుదలవుతారని భావిస్తున్నారు. పూర్తి శిక్షాకాలం మరో ఏడాది ఉన్నప్పటికీ శశికళ ను ఈ ఏడాది చివరకు విడుదల చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

చిన్నమ్మ రాకకోసం….

శశికళ రాకకోసం ఇటు దినకరన్ పార్టీకి చెందిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేతలతో పాటు అన్నాడీఎంకేలో సీనియర్ నేతలు కూడా ఎదురు చూస్తున్నారు. 2021 ఎన్నికల నాటికి శశికళ తిరిగి పాత ఇమేజ్ ను పొందగలదదని భావిస్తున్నారు. అక్రమంగా జైలులో ఉంచారని ఇప్పటికే శశికళపై సానుభూతి పవనాలు వీస్తున్నాయని దీనకరన్ వర్గీయులు చెబుతున్నారు. స్టాలిన్, పళనిస్వామి నాయకత్వాన్ని ప్రజలు విశ్వసించడం లేదని చెబుతున్నారు.

ఏదో ఒక చిక్కులు…..

కానీ శశికళను బయటకు తీసుకువద్దామనుకున్నప్పుడల్లా ఏదో ఒక అవాంతరాలు ఎదురవుతున్నాయి. గతంలో ఆమె భర్త నటరాజన్ కు ఆరోగ్యం బాగాలేకపోవడంతో చిన్నమ్మ పెరోల్ పై బయటకు వచ్చారు. పెరోల్ పై బయటకు వచ్చిన చిన్నమ్మ పొలిటికల్ చర్చలు జరిపారన్న వార్తలు బయటకు పొక్కడంతో ఆమె పెరోల్ ను న్యాయస్థానం అప్పట్లో రద్దు చేసింది. ఇక తాజాగా దినకరన్ వర్గీయులు ఈ ఏడాది డిసెంబరు నాటికి చిన్నమ్మను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ ఏడాది చివరి నాటికి…..

ఈసారి కూడా చిన్నమ్మపై ఆరోపణలు వచ్చాయి. శశికళను సత్ప్రవర్తన మీద బయటకు తీసుకురావడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. శశికళకు పరప్పణ అగ్రహార జైలులో అన్ని సౌకర్యాలు సమకూరుతున్నట్లు ఆర్టీఐ ద్వారా బయట పెట్టారు. లగ్జరీ సేవలు చిన్నమ్మ పొందుతున్నారని, ఆమెను రోజుకు ఏడుమంది వరకూ జైలులో కలుస్తున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా బయటపెట్టారు. దీంతోచిన్నమ్మ సత్ప్రవర్తనపైన బయటకు వచ్చే అవకాశాలు సన్నగిల్లాయని చెబుతున్నారు. దినకరన్ పార్టీ నేతలు మాత్రం శశికళ బయటకు రాకుండా కొందరు చేస్తున్న కుట్రలో భాగమే ఈ ఆరోపణలని కొట్టిపారేస్తున్నారు. మొత్తం మీద శశికళ ఈ ఏడాది చివరకు బయటకు రావడంతో కొంత అనుమానంగానే కన్పిస్తుంది.

Tags:    

Similar News