చిన్నమ వైపు ఎవరూ చూడటం లేదెందుకో?

అనుకున్నట్లుగానే శశికళ జైలు నుంచి విడుదలయ్యారు. శశికళకు భారీ స్వాగతం లభించింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినా శశికళ వైపు ఎవరూ చూడటం లేదు. శశికళ జైలు [more]

Update: 2021-03-11 18:29 GMT

అనుకున్నట్లుగానే శశికళ జైలు నుంచి విడుదలయ్యారు. శశికళకు భారీ స్వాగతం లభించింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినా శశికళ వైపు ఎవరూ చూడటం లేదు. శశికళ జైలు నుంచి విడుదల అయిన వెంటనే భారీగా అన్నాడీఎంకే నుంచి పెద్దయెత్తున తరలి వస్తారని భావించారు. దీంతో న్యాయపరంగా మాత్రమే కాకుండా, పార్టీలోనూ తన వర్గం పెరిగే అవకాశముందని శశికళ అంచనా వేశారు.

అంచనాలకు భిన్నంగా….?

కానీ శశికళ అంచనాలకు భిన్నంగా జరిగింది. శశికళ విడుదలయిన ఇన్ని రోజులైనా అన్నాడీఎంకే నుంచి ఒక్కరూ ఆమె వైపు తొంగి చూడలేదు. జయలలిత జీవించి ఉన్నప్పుడు శశికళతో సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలు సయితం మొహం చాటేశారు. శశికళ ప్రధాన కార్యదర్శిగా పదవి చేపట్టినప్పుడు కూడా పక్కన ఉండి హడావిడి చేసిన నేతలు నేడు అటువైపు చూడటం లేదు. దీంతో శశికళ పెట్టుకున్న ఆశలు నెరవేరలేదనే చెప్పాలి.

దినకరన్ కారణంగానే…?

దీనికి ప్రధానకారణం అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం టీటీవీ దినకరన్ వల్లనేని అంటున్నారు. అన్నాడీఎంకే నేతలకు రావాలని ఉన్నా దినకరన్ పెత్తనాన్ని వారు సహించలేక పోతున్నారు. గతంలోనూ దినకరన్ ను నమ్మి ఆ వర్గంలోకి వచ్చిన ఎమ్మెల్యేల పరిస్థితి తర్వాత ఏమైందో తెలిసిందే కదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. అన్ని రకాలుగా ఆదుకుంటామని వారికి నాడు హామీ ఇచ్చిన దినకరన్ తర్వాత పట్టించుకోలేదు. దీంతో శశికళ శిబిరంలో చేరేందుకు దినకరన్ కారణంగానే ఎవరూ ఆసక్తి చూపడం లేదంటున్నారు.

అసంతప్తి వ్యక్తం చేసిన శశికళ….

శశికళ కూడా దీనిపై సన్నిహతుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో శశికళ తన సత్తాను నిరూపించుకునేందుకు మూడో కూటమికి ప్రయత్నిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. కమల్ హాసన్ నేతృత్వంలో తృతీయ కూటమి ఏర్పాటుకు శశికళ వెనక ఉండి సహకరిస్తున్నారంటున్నారు. మొత్తం మీద శశికళ తాను జైలు నుంచి రాగానే పోలో మంటూ తాను నమ్మిన నేతలు, తనకు అనుకూలంగా ఉన్న నేతలు వస్తారన్న పెట్టుకున్న ఆశలు అడియాసలే అయ్యాయి.

Tags:    

Similar News