శశిధరూర్ కు ఇక కొబ్బరి పీచే మిగులుతుందా?

త్వరలో కేరళ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో కేరళకు చెందిన శశిధరూర్ పార్టీ పరంగా చిక్కుల్లో పడ్డారు. సీనియర్ నేతలు లేఖ రాయడానికి ప్రధాన కారణం శశిధరూర్ [more]

Update: 2020-08-26 16:30 GMT

త్వరలో కేరళ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో కేరళకు చెందిన శశిధరూర్ పార్టీ పరంగా చిక్కుల్లో పడ్డారు. సీనియర్ నేతలు లేఖ రాయడానికి ప్రధాన కారణం శశిధరూర్ అని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. గత కొద్దిరోజులుగా శశిధరూర్ కాంగ్రెస్ పార్టీని బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తికాలపు నాయకత్వం కావాలని సీడబ్ల్యూసీ సమావేశానికి వారం రోజుల ముందు నుంచే శశిధరూర్ డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ నాయకత్వ బాధ్యత స్వీకరణకు అంగీకరించకపోతే కొత్త నేతను ఎన్నుకోవాలని కూడా శశిధరూర్ డిమాండ్ చేశారు.

లేఖ ఆలోచనలకు…..

నిజానికి మార్చినెలలో నే లేఖ ఆలోచనకు శశిధరూర్ నివాసంలో బీజం పడినట్లు చెబుతున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో శశిధరూర్ తన నివాసంలో కాంగ్రెస్ నేతలకు విందు ఇచ్చారు. ఈ సమావేశానికి నలభై మంది వరకూ కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరయ్యారు. పార్టీ భవిష‌్యత్, నాయకత్వ సమస్యపై కూలంకషంగా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. సోనియాగాంధీ అనారోగ్యంతో ఉండటం, రాహుల్ పదవీ చేపట్టనని భీష్మించుకుని కూర్చోవడం వంటి వాటిపై పూర్తి స్థాయిలో చర్చించినట్లు చెబుతున్నారు.

మరో పవర్ సెంటర్ కోసం….

ఈ చర్చల్లో భాగంగానే సోనియా గాంధీకి లేఖ రాయాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. అయితే ఇందులో కొంత మంది లేఖ రాసే విషయంపై వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు కూడా అంటున్నారు. అయితే కొందరు సీనియర్ నేతలు ఈ లేఖను రూపొందించే బాధ్యతను శశిధరూర్ పై పెట్టారు. దీంతో ఆయన లేఖను రూపొందించగా 23 మంది మాత్రమే సంతకం చేశారు. విందుకు హాజరైన 17 మంది మాత్రం సంతకం చేయడానికి నిరాకరించారు. ఈ లేఖ ఇప్పడు కాంగ్రెస్ పార్టీలో కల్లోలం సృష్టించింది. మరో పవర్ సెంటర్ ను ఏర్పాటు చేయడానికే సీనియర్లు లేఖ రాశారని అధిష్టానం అభిప్రాయంగా ఉంది.

ఇబ్బందుల్లో పడినట్లేనట…..

దీంతో లేఖ రాయడానికి ప్రధాన కారణమైన శశిధరూర్ ఇబ్బందుల్లో పడ్డారని పార్టీ వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. కేరళకు చెందిన శశిధరూర్ లేఖలో కీలక పాత్ర పోషించడంతో రానున్న కేరళ ఎన్నికల్లో ఆయనను పక్కన పెడతారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. నిజానికి కేరళలో రాహుల్ గాంధీ కూడా మొన్నటి ఎన్నికల్లో గెలిచారు. కేరళ నుంచి ఆయనకు ఫీడ్ బ్యాక్ ఎప్పటికప్పుడు వస్తుంది. సోనియా అధ్యక్ష పదవికి అంగీకరించకపోతే శశిధరూర్ తాను ఆ పదవిని చేపట్టాలనుకున్నారు. ఆయన పేరు కూడా బాగా విన్పించింది. కానీ ఈ లేఖతో పార్టీలో శశిధరూర్ ఇమేజ్ డ్యామేజ్ అయిందని చెప్పాలి.

Tags:    

Similar News