భేటీకి పరమార్థమిదేనా?

ప్రధాని మోదీ, సీనియర్ నేత శరద్ పవార్ తాజా భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాజకీయంగా భిన్న ధృవాలైన ఇద్దరు నేతలు ఏ విషయంపై [more]

Update: 2021-07-26 16:30 GMT

ప్రధాని మోదీ, సీనియర్ నేత శరద్ పవార్ తాజా భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాజకీయంగా భిన్న ధృవాలైన ఇద్దరు నేతలు ఏ విషయంపై చర్చించి ఉంటారన్న అంశంపై ఎవరికి తోచిన రీతిలో వారు ఊహాగానాలు చేస్తున్నారు. శరద్ పవార్ తెర వెనక ఉండి నడిపించే మహారాష్ర్టలోని మహావికాస్ అగఢీ సంకీర్ణ సర్కారు ఇటీవల కాలంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దాని మనుగడకు సంబంధించి మరాటా దిగ్గజం మోదీని కలసి ఉంటారన్న అంచనాలు ఉన్నాయి. పైకి కాదన్నప్పటికీ వచ్చే ఏడాది జరిగే రాష్ర్టపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పవార్ పేరు బలంగా వినపడుతోంది. అసలు విపక్షాల నేతగా ప్రధాని పదవికి సైతం ఆయన పేరుపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ప్రధాని, శరద్ పవార్ భేటీపై ఆసక్తి కలగడం సహజం.

ప్రత్యేక కారణం…?

విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇద్దరు నేతల భేటీకి ప్రత్యేకమైన కారణం ఉంది. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో ప్రధాని కొత్తగా సహకారశాఖ ను ఏర్పాటు చేసి, దానికి సారథిగా తనకు కుడి భుజమైన హోంమంత్రి అమిత్ షా ను నియమించారు. పైకి ఎన్ని చెప్పినప్పటికీ సహకార రంగ ంలో పాతుకుపోయిన కొన్ని ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడానికే కొత్త మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశారన్నది చేదునిజం. మహారాష్ర్ట రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి రాష్ర్ట సహకార చక్కెర లాబీయింగ్ కు ఉంది. రాష్ర్టంలో చక్కెర కర్మాగారాలపైశరద్ పవార్ పార్టీ అయిన ఎన్సీపీకి పట్టుంది. దీనిని అడ్డం పెట్టుకుని ఆ పార్టీ నాయకులు బాగా లబ్ధి పొందారు. రుణాలు తీసుకుని చెల్లించలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి శరద్ పవార్ మేనల్లుడు, ఉప ముఖ్యమంత్రి అయిన అజిత్ పవార్ సమీప బంధువులపై కేసులు నమోదయ్యాయి. తాజాగా బకాయిల చెల్లింపునకు సంబంధించి ఎన్సీపీ నేతలపై ఒత్తిడులు అధికమవుతున్న నేపథ్యంలో ప్రధానితో పవార్ భేటీపై సహజంగానే ఆసక్తి కలుగు
తుంది.

సయోధ్యకేనా…?

తాజాగా ఎన్సీపీ నాయకుడు, మొన్నటిదాకా హోంమంత్రిగా పనిచేసిన అనిల్ దేశ్ ముఖ్, ఆ పార్టీకి చెందిన మరో నాయకుడు ఏక్ నాథ్ ఖడ్సేలపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అధికార భాజపాతో అనవసరంగా గొడవలకు దిగితే రాజకీయంగా నష్టపోతామన్న అభిప్రాయం ఎన్సీపీ వర్గాల్లో ఉంది. అందుకే సయోధ్య కుదుర్చుకునే చర్యల్లో భాగంగా శరద్ పవార్ చొరవ తీసుకుని ప్రధానితో భేటీ అయ్యారన్న విశ్లేషణలు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మూడుసార్లు ముఖ్యమంత్రిగా, పీవీ హయాంలో రక్షణమంత్రిగా, మన్మోహన్ వద్ద వ్యవసాయమంత్రిగా, కీలకమైన బీసీసీఐ ఛైర్మన్ గా, లోక్ సభలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన శరద్ పవార్ కు రాజకీయ పరమైన సిద్ధాంతాలు, విధానాల బాదరబందీ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు.

ఏ బాదరబందీ లేదు…..

పరిస్థితులను బట్టి రాజకీయంగా ముందుకు సాగడమే ఆయనకు తెలుసు. అందుకే 34ఏళ్ల పిన్న వయసులో 1978లో రాష్ట్రానికి శరద్ పవార్ ముఖ్యమంత్రి కాగలిగారు. 50ఏళ్ల వయసులో 1991లో రాజీవ్ గాంధీ హత్యానంతరం ప్రధాని పదవికి పీవీతో పోటీపడ్డారు. అవకాశాలను ఉపయోగించుకుని వేగంగా ముందుకు వెళ్లడమన్నది పవార్ కు వెన్నతో పెట్టిన విద్య. అదే సమయంలో పరిస్థితులు సానుకూలంగా లేనప్పుడు వెనక్కు తగ్గడమూ ఈ మరాఠా నేతకు తెలిసినంతగా మరో నేతకు తెలియదు. అందుకే ఎనిమిది పదుల వయసులోనూ పట్టుమని 20 మంది ఎంపీలు లేనప్పటికీ ఈ బారామతి నేత హస్తిన రాజకీ ల్లో నేటికీ క్రియాశీలకంగా ఉన్నారు. కాలం కలసివస్తే 2024లో ప్రధాని అవుతానని శరద్ పవార్ కలలు కంటున్నారు.

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News