పవార్ పాచికలు..?

శరద్ పవార్ కాకలు తీరిన రాజకీయ వేత్త. ఎప్పుడు ఏం చేస్తాడనేది ఎవరికీ అంతుచిక్కదు. అంతిమంగా తాను అనుకున్నది సాధిస్తుంటాడు. దాదాపు దేశంలోని అన్ని పార్టీలతోనూ ఆయనకు [more]

Update: 2021-07-19 16:30 GMT

శరద్ పవార్ కాకలు తీరిన రాజకీయ వేత్త. ఎప్పుడు ఏం చేస్తాడనేది ఎవరికీ అంతుచిక్కదు. అంతిమంగా తాను అనుకున్నది సాధిస్తుంటాడు. దాదాపు దేశంలోని అన్ని పార్టీలతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఉత్తర ,దక్షిణ ధృవాలుగా భావించే బీజేపీ, కాంగ్రెసు పెద్దలతోనూ గట్టి బంధమే ఉంది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసి సుదీర్ఘమంతనాలు జరిపారు. ప్రతిపక్షాలన్నీ కలిసి కట్టుగా బీజేపీకి ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేస్తున్న వేళ ఈ అకాల సమావేశం అందర్నీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. ఇదేమంత పెద్ద అంశం కాదంటూ ఎన్సీపీ తోసిపుచ్చడానికి ప్రయత్నించింది. కానీ రాజకీయ పార్టీలు మాత్రం అనుమానాస్పదంగానే చూస్తున్నాయి. ప్రధాని, శరద్ పవార్ ల సమావేశంలో అంతర్గతంగా ఏం జరిగిందనే దానిపై వారిద్దరూ తప్ప మరొకరు చెప్పలేరు. ఆంతరంగికంగా ముఖాముఖి సాగిన సమావేశమది. అయితే సందర్భాన్ని బట్టి రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. శరద్ పవార్ రాజకీయ ఎత్తుగడలు తెలిసిన వారు దేనినీ కొట్టి పారేయడం లేదు. ఏదైనా జరగవచ్చనే చెబుతున్నారు.

చిక్కడు.. దొరకడు..

శరద్ పవార్ ఎత్తుగడలు రాజకీయ ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తాయి. మాయల మరాఠీ అనే పదం తెలుగులో ఎక్కువగా వాడుకలో ఉంది. అదే అర్థంలో తీసుకుంటే పవార్ ను రాజకీయ మరాఠీ గా చెప్పువచ్చు. మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రే అధికారంలో ఉన్నప్పటికీ భాగస్వామ్య పక్షం తరఫున శరద్ పవార్ చక్రం తిప్పుతున్నారు. కీలక శాఖలన్నీ తన పార్టీ పరం చేసుకున్నారు. శివసేనలో అంతర్గతంగా ఎన్సీపీపై అసంతృప్తి నెలకొంది. కానీ అధికారం కోల్పోవడం ఇష్టం లేక సర్దుకుపోతున్నారు. శివసేన, బీజేపీల మధ్య విభేదాలు వచ్చినపుడు ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ను శరద్ పవార్ స్వయంగా బీజేపీ చెంతకు పంపించారనే వాదన సైతం ఉంది. కానీ చాలా తెలివిగా తనకేం సంబంధం లేదన్నట్లుగా వ్యూహం నడిపారు. అయితే బీజేపీ రాష్ట్రంలో బలపడితే భవిష్యత్తులో ఎన్సీపీకి కూడా మనుగడ ఉండదని గ్రహించి మళ్లీ సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు పావులు కదిపారు. శివసేన, కాంగ్రెసులతో జట్టుకట్టారు. అజిత్ పవార్ కు ఉపముఖ్యమంత్రి పదవి ఇప్పించారు. ఇవన్నీ శరద్ పవార్ ఆడే రాజకీయ చదరంగంలో ఎత్తుగడలే. సందర్బాన్ని బట్టి తగ్గడం, అవసరాన్ని బట్టి తిరుగుబాటు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. 1998లో సోనియాతో విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టుకున్నారు. మళ్లీ అదే కాంగ్రెసుతో సుదీర్ఘ రాజకీయ భాగస్వామ్యం నడుపుతున్నారు. ఎన్ని రకాలుగా పావులు కదుపుతున్నా పవార్ కు వ్యక్తిగత రాజకీయ ఆకాంక్ష మాత్రం నెరవేరడం లేదు.

పీఎంతో ప్రయివేటు టాక్…

బీజేపీకి కూడా శరద్ పవార్ పొడ గిట్టని పార్టీ కాదు. చీటికీమాటికీ తోక జాడిస్తున్న శివసేనను దూరంగా పెట్టేందుకు ఎన్సీపీని అక్కున చేర్చుకోవాలని గతంలో ప్రయత్నించింది. అజిత్ పవార్ కమలం పార్టీ కౌగిట్లోకి వచ్చి చేరారు. అయితే శరద్ పవార్ తనకు రాజకీయంగా బీజేపీతో కలవడం వల్ల లాభం లేదనే అంచనాతో దూరం పాటిస్తూ వస్తున్నారు. బీజేపీతో గరిష్ట ప్రయోజనం వస్తుందని బావిస్తే కచ్చితంగా ఆయన కూడా చేతులు కలపడానికి సిద్ధమే. ప్రదానమంత్రి పదవి ఎలాగూ దక్కదు. కనీసం రాష్ట్రపతి పదవి అయినా ఆపర్ చేస్తే సానుకూలంగా స్పందించాలనేది పవార్ యోచన. కానీ బీజేపీ అంత తెలివితక్కువగా వ్యవహరించదు. 2024 నాటికి పార్టీల బలాబలాలు ఎలా ఉంటాయో తెలియదు. ఏమాత్రం బీజేపీకి మెజార్టీ సంఖ్య తగ్గినా ఇతర పార్టీలను కలుపుకుని పోవాల్సి వస్తుంది. ఇటువంటి దశలో ప్రభుత్వ ఎంపికలో రాష్ట్రపతి కీలకం . ముందుగా ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తే వారికే ఇతర పార్టీలతో బేరసారాలకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ అవకాశాన్ని రాష్ట్రపతి కల్పించాలి. అటువంటి కీలక సందర్బాన్ని శరద్ పవార్ వంటి రాజకీయ యోధుడి చేతిలో పెట్టడం సాహసోపేతమవుతుంది. అందువల్ల ఆ కోరిక నెరవేరే అవకాశాలు కూడా లేవు. ప్రధానమంత్రితో ప్రయివేటుగా మాట్టాడినా మహారాష్ట్రలోని తమ నాయకులకు ఎదురవుతున్న ఇబ్బందులపై ద్రుష్టి పెట్టి ఉంటారని భావించడానికి ఇదొక కారణం.

ఎవరి వ్యూహం వారిదే…?

శరద్ పవార్ కలయికకు ప్రధానమంత్రి కార్యాలయం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. మహారాష్ట్రలో ఎన్సీపీ నాయకులు చాలామంది కేంద్ర దర్యాప్తు సంస్థల కేసులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ కుంభకోణాలు, సహకార చక్కెర కర్మాగారాలకు సంబంధించిన నిధుల అవకతవకల వంటివి వెంటాడుతున్నాయి. వీటి నుంచి తాత్కాలిక ఉపశమనం పొందేందుకు ప్రధానిని కలిశారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిపక్షాలు ఇంతవరకూ పవార్ తమ కూటమిలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో మోడీకి వ్యతిరేకంగా ఏర్పాటయ్యే ఫ్ఱంట్ లో ఆయన కీలక భాగస్వామి అవుతారని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పవార్ పరివారాన్ని కేంద్రం మరింతగా టార్గెట్ చేసే ప్రమాదం ఏర్పడింది. ఆ భయంతోనే తాను ప్రతిపక్ష కూటమికి మద్దతు ఇవ్వడం లేదనే సంకేతాలు పంపేందుకు ప్రధానితో భేటీని శరద్ పవార్ వినియోగించుకున్నట్లుగా భావించాలి. ప్రతిపక్ష శిబిరంలో అనైక్యత పెంచడానికి, అనుమానాలు రేకెత్తించడానికి ఈ సందర్బాన్ని బీజేపీ, ప్రధాని చక్కగా వాడుకున్నారు. రాజకీయ ఐక్యత, జాతీయ ప్రత్యామ్నాయం వంటి సైద్దాంతిక అంశాల కంటే శరద్ పవార్ తన ప్రయోజనాలకే పెద్ద పీట వేసుకుంటారనేందుకు ఇదొక పెద్ద నిదర్శనం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News