సంచయితకు పెద్ద పదవి… ?

మాన్సాస్ ట్రస్ట్ తమ చేతి నుంచి చేజారిందని తెగ ఫీల్ అవుతున్న వైసీపీ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు మీద ప్రతి రోజూ విమర్శలు చేస్తూనే ఉంది. [more]

Update: 2021-06-29 12:30 GMT

మాన్సాస్ ట్రస్ట్ తమ చేతి నుంచి చేజారిందని తెగ ఫీల్ అవుతున్న వైసీపీ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు మీద ప్రతి రోజూ విమర్శలు చేస్తూనే ఉంది. ఆయనకు ఆ పదవి అలంకరారమైతే తమకు బాధ్యత అంటున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇక కనీసం ట్రస్ట్ వ్యవహారాలను పట్టించుకోకుండా అశోక్ వదిలేయడం వల్ల కోట్లలో నష్టం వాటిల్లింది అని కూడా ఆరోపిస్తున్నారు. అశోక్ హయంలో ట్రస్ట్ లో జరిగిన అవకతవకల మీద పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశిస్తామని కూడా అంటున్నారు.

అది ముగిసినట్లేనా ..?

ఇదిలా ఉంటే మాన్సాస్ ట్రస్ట్ బైలాస్ ప్రకారం చూస్తే అశోక్ ని చైర్మన్ పదవి నుంచి ఎవరూ కదిలించలేరు. అది హై కోర్టు తీర్పుతో రుజువు అయింది. అయినా కూడా రాజ్యాంగానికి లోబడే ఏ బైలాస్ అయినా ఉండాలని విజయసాయిరెడ్డి అంటున్నారు. ఈ విషయంలో తమకు న్యాయం జరుగుతుందని ఆయన అంటున్నా మళ్ళీ కోర్టు తలుపు తట్టినా కూడా తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న నమ్మకం అయితే వైసీపీ పెద్దలకు లేదుట‌. దాంతో మాన్సాస్ ట్రస్ట్ మీద దర్యాప్తు అంటూనే మరో వైపు సంచయితను అశోక్ మీద గురి చూసి వదలాలని వైసీపీ నిర్ణయించిందని అంటున్నారు.

నామినేటెడ్ హోదా …?

రాష్ట్రంలో చాలా నామినేటెడ్ పదవులు ఉన్నాయి. వాటిని భర్తీ చేయడానికి వైసీపీ రెడీగా ఉంది. అదే సమయంలో సంచయితకు కూడా కీలకమైన పదవిని ఇవ్వాలని వైసీపీ డిసైడ్ అయిందట. ఆమెకు ఇపుడు ఏ పదవీ లేకపోవడం వల్ల బాబాయ్ అశోక్ మీద ధాటీగా విమర్శలు చేయలేకపోతున్నారుట. దాంతో ఆమెను ఉన్నత పదవిలో కూర్చోబెట్టి అశోక్ మీద విమర్శలు చేయిస్తే జనాలకు బాగా ఎక్కుతాయని, తద్వారా పూసపాటి ఫ్యామిలీలో ఏర్పడిన ముసలం తమకు పొలిటికల్ గా అనుకూలం అవుతుందని వైసీపీ ఎత్తులు వేస్తోందిట.

పరస్పర అవసరం…

బీజేపీని పూర్తిగా వదిలేసిన సంచయితకు ఇపుడు అర్జంటుగా ఒక పదవి కావాలి. అలాగే వైసీపీకి కూడా పూసపాటి వారసుల అండ కావాలి. దాంతో సంచయితకు పదవి ఇవ్వాలని వైసీపీలో ఒక కీలక నిర్ణయం జరిగింది అంటున్నారు. ఆమెను పూర్తి స్థాయిలో వైసీపీ నేతగా మార్చి తమ ట్రంప్ కార్డుగా వాడుకోవాలని చూస్తున్నారుట. మొత్తానికి అశోక్ మీద ప్రతీ రోజూ విమర్శలు చేస్తూ ఆయాసపడుతున్న విజయసాయిరెడ్డికి తోడుగా తొందరలోనే సంచయిత ఉన్నత పదవితో రంగంలోకి దిగుతారు అంటున్నారు. చూడాలి మరి ఈ రాజుల కోటలో కత్తుల యుద్ధం ఎంతకాలం సాగుతుందో.

Tags:    

Similar News