రాజుల కోటలో సంచలనం.. ఇంతకూ ఎవరు విలన్?

విజయనగరం పూసపాటి వారికి వందేళ్ల చరిత్ర ఉంది. వారికి వారే స్వతంత్రమైన రాజ్యాలతో రాజులుగా వెలుగొందారు. బ్రిటిష్ వారి హయాంలో కూడా పోరాడి తన హక్కులను సాధించుకున్న [more]

Update: 2020-06-07 03:30 GMT

విజయనగరం పూసపాటి వారికి వందేళ్ల చరిత్ర ఉంది. వారికి వారే స్వతంత్రమైన రాజ్యాలతో రాజులుగా వెలుగొందారు. బ్రిటిష్ వారి హయాంలో కూడా పోరాడి తన హక్కులను సాధించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక ప్రజాస్వామ్య యుగంలోనూ జనం వారిని దేవుళ్ళుగానే భావించి వరసగా చట్టసభలకు పంపుతూ వచ్చారు. ఇపుడు ఆ వంశంలో చిచ్చు రేగింది. రెండవ తరం, మూడవ తరం మధ్యన సాగుతున్న ఆధిపత్య సమరంతో పూసపాటి వంశం పరువు పోతోంది. ఇంతకాలం మిస్టర్ క్లీన్ అని పేరుపడిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజులోని రెండవ కోణాన్ని మాన్సాస్ ప్రస్తుత చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు బయటపెడుతూంటే ఆమె అసలు పూసపాటి వారసురాలే కాదని అశోక్ మొదటికే తెగ్గొట్టేస్తున్నారు.

కుట్రలున్నాయా…?

సంచయితగజపతిరాజు మాటలను బట్టి చూస్తూంటే కోటలో కుట్రలు, కుతంత్రాలు ఓ స్థాయిలో నడిచాయని అంటున్నారు. తన తండ్రి ఆనందగజపతిరాజు ఉన్నంత వరకూ బాగా ఉన్న మాన్సాస్ ట్రస్ట్ అశోక్ హయాంలో విద్వంసం అయిందని ఆమె ఆరోపిస్తున్నారు. బాబాయి తాత తండ్రుల వారసత్వాన్ని పట్టించుకోలెదని, ఆస్తులు సైతం అన్యాక్రాంతం అయ్యాయని కూడా ఆమె అంటున్నారు. ఈ విషయంలో నాటి సీఎం చంద్రబాబు పాత్ర కూడా ప్రధానంగా ఉందని ఆమె అభియోగం. తన తండ్రి చితి కూడా ఆరకముందే అర్జంటుగా బాబాయికి అనుకూలంగా నాటి ప్రభుత్వం జీవో విడుదల చేయడంలోని ఆంతర్యాన్ని ఆమె ప్రశ్నిస్తున్నారు.

గొడవలేనా…?

సంచయిత ఆరోపణలు చూస్తూంటే తన తండ్రి తరువాత మాన్సాస్ ట్రస్ట్ వారసత్వం తమకు రావాల్సివుండగా కాకుండా చేశారన్న ఆవేదన కనిపిస్తోంది. ఇక పీవీజీ రాజుకు చాలా మంది వారసులు ఉన్నారు. ఆయనకు ఇద్దరు కుమారులే కాకుండా కుమార్తెలు, ఇంకా రెండవ భార్య తరఫున పిల్లలు కూడా ఉన్నారు. మరి ఎవరినీ సంప్రదించకుండా, ట్రస్టీలుగా నియమించకుండా కేవలం అశోక్ ని మాత్రమే నాటి టీడీపీ సర్కార్ గుర్తించి ట్రస్ట్ బాధ్యతలు అప్పగించడాన్ని సంచయిత నిగ్గదీస్తున్నారు. మరో వైపు చూసుకుంటే నాలుగేళ్ళుగా తన తండ్రి వారసత్వం కోసం సంచయిత గజపతి చేసిన పోరాటానికి ఇపుడు వైసీపీ సర్కార్ అనుకూలంగా స్పందించడంతో ఆమెకు కుర్చీ దక్కిందని అంటున్నారు.

వారసురాలు కాదా?

పూసపాటి వంశంతో సంచయితకు సంబంధం లేదని మరో వైపు సొంత బాబాయ్ అశోక్ గ‌జపతిరాజు అంటున్నారు. ఆమె వారసత్వం హక్కు చెల్లదని కూడా ఆయన కోర్టుకు ఎక్కారు. అమెకు తన అన్న ఆనందగజపతిరాజుకు కూడా సంబంధాలు ఏ విధంగానూ లేవని చెబుతున్నారు. ఆమె తల్లి, మాజీ ఎంపీ ఉమా గజపతిరాజు తన అన్నతో విడిపోయి విడాకులు తీసుకున్న సంగతిని ఆయన గుర్తు చేస్తున్నారు. ఇక తన అన్న చివరి రోజుల్లో సంచయిత కానీ ఆమె వైపు కానీ ఎవరూ పట్టించుకోలేదని ఆయన‌ తన వాదనను కోర్టుకు వినిపిస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే ఈ విషయంలో సంచయితను తప్పించి మళ్ళీ తనకే మాన్సాస్ పగ్గాలు ఇచ్చేలా కోర్టు ఆదేశాలు జారీ చేస్తుందని అశోక్ ఆశాభావంతో ఉన్నారు. సరే అవన్నీ అలా ఉన్నా కానీ నిన్నటి వరకూ రాజులంటే జనాలకు ఉన్న గౌరవాలు పోయేలా ఈ రచ్చ సాగడం విశేషం. తన బాబాయ్ విలన్ అని సంచయిత అంటూంటే ఆమెకు కోటకూ ఏ రిలేషన్ లేదని అశోక్ అనడంటో ఈ వివాదం రాజులకు మచ్చగానే ఉందని అంటున్నారు.

Tags:    

Similar News