భాను ఫుల్లు సైలంట్… అందుకేనా?

సామినేని ఉద‌య‌భాను రాజ‌కీయాల్లో మూడు ద‌శాబ్దాల‌కు పైగా ఉన్నారు. కృష్ణా జిల్లా జ‌గ్గయ్యపేట కేంద్రంగా గ‌తంలో కాంగ్రెస్‌, ఇప్పుడు వైసీపీలో రాజ‌కీయాలు చేస్తోన్న ఉద‌య‌భాను మూడోసారి అసెంబ్లీకి [more]

Update: 2020-11-26 06:30 GMT

సామినేని ఉద‌య‌భాను రాజ‌కీయాల్లో మూడు ద‌శాబ్దాల‌కు పైగా ఉన్నారు. కృష్ణా జిల్లా జ‌గ్గయ్యపేట కేంద్రంగా గ‌తంలో కాంగ్రెస్‌, ఇప్పుడు వైసీపీలో రాజ‌కీయాలు చేస్తోన్న ఉద‌య‌భాను మూడోసారి అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. 1999లోనే నాడు మంత్రిగా ఉన్న నెట్టెం ర‌ఘురాంను ఓడించి సంచ‌ల‌నం క్రియేట్ చేసిన సామినేని ఉద‌య‌భాను 2004 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా రెండోసారి విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత తీవ్రమైన వ్యతిరేక‌త‌తో ఆయ‌న అనుచ‌రుడిగానే ఉన్న శ్రీరాం తాత‌య్య టీడీపీలోకి వ‌చ్చి భానును ఓడించారు. త‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లోనూ వీరిద్దరే త‌ల‌ప‌డ‌గా తాత‌య్య రెండోసారి గెలిచారు. గ‌త ఎన్నిక‌ల్లో మాత్రం సామినేని ఉద‌య‌భాను ప‌దేళ్ల త‌ర్వాత మళ్లీ జ‌గ్గయ్యపేట‌లో గెలిచారు.

మంత్రి పదవి పై ఆశతో…..

సీనియ‌ర్ నేత‌గా ఉన్న సామినేని ఉద‌య‌భాను గ‌తంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విప్‌గా ప‌నిచేశారు. ప్రస్తుతం విజ‌య‌వాడ పార్లమెంట‌రీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా కొన‌సాగుతున్నారు. కాపు సామాజిక వ‌ర్గంలో కీల‌క నేత‌గా ఉన్న సామినేని ఉద‌య‌భాను మంత్రి ప‌ద‌విపై ఆశ‌ల‌తో ఉన్నారు. మూడుసార్లు గెలిచినా.. త‌న‌కంటే జూనియ‌ర్ అయిన వాళ్లకు మంత్రి ప‌ద‌వులు వ‌చ్చినా ఉద‌య‌భానుకు మాత్రం ఆ ప‌ద‌వి అంద‌ని ద్రాక్ష మాదిరిగానే ఉంది. జిల్లాలో కాపు వ‌ర్గం నుంచి పేర్ని నానికి జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వి కేటాయించారు. వ‌చ్చే ప‌ది నెల‌ల త‌ర్వాత జ‌రిగే ప్రక్షాళ‌న‌లో అయినా మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న ఆశ‌తో సామినేని ఉద‌య‌భాను ఉన్నారు. ఉద‌య‌భాను అంటేనే దూకుడు, దందుడుకు స్వభావం అన్న టాక్ ఉంది.

అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ…..

2004లో రెండోసారి గెలిచాక సామినేని ఉద‌య‌భానుపై తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. నియోజ‌క‌వ‌ర్గంలో క‌క్షాపూరిత రాజ‌కీయాలు జ‌ర‌గ‌డంతోనే 2009లో ఏపీలో వైఎస్ రెండోసారి సీఎం అయినా జ‌గ్గయ్యపేట‌లో మాత్రం భాను త‌న శిష్యుడు తాత‌య్య చేతిలోనే ఓడిపోయార‌న్న పేరు అప్పట్లో వినిపించింది. ఉద‌య‌భాను మొన్న ఎమ్మెల్యే అయ్యాక కూడా అటు జ‌గ్గయ్యపేట‌లోనే కాకుండా హైద‌రాబాద్‌లో కూడా ఆయ‌న కుమారులు ప‌లు వివాదాల్లో చిక్కుకోవ‌డంతో ఆయ‌న అభాసు పాల‌య్యారు. అలాంటి నేతలో ఉన్నట్టుండి మార్పు వ‌చ్చేసింది. ఏ చిన్న వివాదానికి కూడా ఆయ‌న మ‌ద్దతు ప‌ల‌క‌డం లేదు. త‌న‌పై చిన్నపాటి ఆరోప‌ణ కూడా రాకుండా జాగ్రత్త ప‌డుతున్నారు.

ఏ తప్పు జరిగినా…?

నియోజ‌క‌వ‌ర్గంలో ఎంత కావాల్సిన కార్యక‌ర్త కూడా చిన్న త‌ప్పు చేసినా సామినేని ఉద‌య‌భాను స‌హించ‌డం లేదు. అక్రమ కార్యక‌లాపాల‌కు తాను ఎంత మాత్రం స‌పోర్ట్ చేయ‌న‌ని ఖ‌రాఖండీగా చెప్పేస్తున్నారు. గ‌త ప‌దేళ్ల క్రితం ఉన్నంత స్పీడ్ భానులో లేద‌ని నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌లే చ‌ర్చించుకుంటున్నారు. త‌ప్పు చేసిన కార్యక‌ర్తకు ఏ ప‌ద‌వి కూడా ఇచ్చే ప్రశ‌క్తే లేదంటున్నార‌ట‌. ఆయ‌న‌లో ఈ స‌డెన్ మార్పున‌కు ప్రధాన కార‌ణం మంత్రి ప‌ద‌విపై ఉన్న ఆశే అంటున్నారు. జిల్లాలో కాపు సామాజిక వ‌ర్గం నుంచే మంత్రిగా ఉన్న పేర్ని నానిని మార్చక‌పోవ‌చ్చనే అంటున్నారు. కొడాలి నానిని ఎలాగూ మార్చరు. ఈ స‌మ‌యంలో పేర్నికి స్ట్రాంగ్ కాంపిటేష‌న్‌గా ఉండాలంటే ఆరోప‌ణ‌లకు దూరంగా ఉండాల‌ని భాను భావిస్తున్నార‌ట‌. భాను తన వియ్యంకుడు అయిన తోట త్రిమూర్తుల‌ను వైసీపీలోకి తీసుకు రావడంలో కీల‌కంగా వ్యవ‌హ‌రించారు. పైగా తోట పార్టీలోకి వ‌చ్చిన వెంట‌నే అమ‌లాపురం పార్లమెంట‌రీ పార్టీ అధ్యక్షుడు కూడా అయ్యారు. ఏదేమైనా భాను సైలెన్స్ ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి తెస్తుందా ? లేదా ? అన్నది చూడాలి.

Tags:    

Similar News