వైఎస్సార్ శిష్యుడికి జగన్ మీద గుస్సా

వైఎస్సార్ చలవతో మంత్రి అయిన అనంతపురం జిల్లాకు చెందిన సాకె శైలజానాధ్ నిబద్ధత కలిగిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో బలహీన వర్గాలను ప్రాతినిధ్యం [more]

Update: 2019-08-06 15:30 GMT

వైఎస్సార్ చలవతో మంత్రి అయిన అనంతపురం జిల్లాకు చెందిన సాకె శైలజానాధ్ నిబద్ధత కలిగిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో బలహీన వర్గాలను ప్రాతినిధ్యం వహించారు. వైఎస్సార్ అంటే వీరాభిమానం కలిగిన ఆయన కొడుకు జగన్ తో మాత్రం సాన్నిహిత్యాన్ని కొనసాగించలేకపోయారు. ఆ సంగతి అలా ఉంచితే ఎన్నికలకు ముందు వైసీపీలో చేరతారని ప్రచారాంలోకి వచ్చినా సాకె శైలజానాధ్ కు కోరుకున్న సీటు ఇవ్వడానికి వైసీపీ సుముఖంగా లేకపోవడంతో కాంగ్రెస్ నుంచే పోటీకి దిగారు. ఇక టీడీపీలో కూడా చేరుతారని వినవచ్చినా సాకె శైలజానాధ్ సైకిలెక్కలేదు. ఇవన్నీ ఇలా ఉంటే లేటెస్ట్ గా బీజేపీలో చేరుతారన్న వార్తలకు ఆయన ఉత్తరాంధ్రా టూర్లో చెక్ పెట్టేశారు. ఆయన శ్రీకాకుళం మొదలుకుని విశాఖపట్నం వచ్చేంతవరకూ మోడీని, బీజేపీని విడవకుండా నానా రకాలా విమర్శలు చేయడం బట్టి చూస్తే కమలదళంలో ఆయన చేరరని పక్కాగా తేలిపోతోంది.

ఆ ఇద్ద్దరే టార్గెట్ …..

మంత్రిగా ఉన్నపుడు పెద్దగా ఈ ప్రాంతాలు తిరగని సాకె శైలజానాధ్, గడచిన అయిదేళ్ళలోనూ కూడా పెద్దగా రాని నేత ఇపుడు హఠాత్తుగా ఉత్త్రాంధ్ర టూర్ పెట్టుకున్నారు. అరకొరగా మిగిలి ఉన్న కాంగ్రెస్ నాయకులను పలకరించడమే కాకుండా మీడియా మీటింగులు పెట్టి మరీ కాంగ్రెస్ ఈ దేశానికి రాష్ట్రానికి అవసరమని స్పష్టంగా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని అనుసరించి పాలిస్తే బీజేపీ తూట్లు పొడిచి పాలిస్తోందని విమర్శించడం వెనక బీజేపీ భావజాలాన్ని ద్వేషించిన తీరు కనిపిస్తోంది. మోడీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారని సాకె శైలజానాధ్ గట్టిగానే విమర్శలు చేసారు. ఇక ఏపీలో జగన్ పాలన జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలోకి వెళ్ళిపోయిందని సాకె శైలజానాధ్ సెటైర్లు వేశారు. బీజేపీ చెప్పుచేతల్లో జగన్ నడుస్తున్నారని కొత్త సర్కార్ మీద హాట్ కామెంట్స్ చేశారు.

ఉనికి చాటుకుంటున్నారా…?

సాకె శైలజానాధ్ మంత్రిగా ఉన్నప్పటి కంటే ఇపుడు జనంలోకి రావడం బట్టి చూస్తూంటే ఆయన ఏపీలో రాజకీయ ఉనికిని కోరుకుంటున్నారనిపిస్తోంది. తనను అన్ని పార్టీలు పక్కన పెట్టడాన్ని సాకె శైలజానాధ్ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఆయన తాజా పర్యటనలో టీడీపీని, చంద్రబాబుని పల్లెత్తు మాట అనకపోవడంతో కొత్త డౌట్లు వస్తున్నాయి. ఆయన టీడీపీలో చేరుతారా, లేక కాంగ్రెస్ లో ఉంటూనే రాజకీయం చేస్తారా అన్నది అర్ధం కావడం లేదు. సాకె శైలజానాధ్ మాత్రం 2024లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, పార్టీ నాయకులంతా పనిచేయాలని సూచిస్తున్నారు. ఓ వైపు జాతీయ రాజకీయల్లోనే కాంగ్రెస్ ఇబ్బందులు పడుతున్న వేళ ఆ పార్టీ ఎదుగుదల అయోమయంలో పడుతున్న వేళ సాకె శైలజానాధ్ ఉత్తరాంధ్రా టూర్ దేనికో అర్ధం కాని స్థితి. ఏది ఏమైనా వైఎస్సార్ శిష్యుడు జగన్ ని నానా మాటలు అనేసి వెళ్ళిపోవడాన్ని వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు.

Tags:    

Similar News