శైల‌జానాథ్‌కు అడ్డు ప‌డుతున్న‌దెవ‌రు..?

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ క‌మిటీ అధ్యక్షుడు, సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ దూకుడుకు పార్టీలో అడ్డుక‌ట్ట ప‌డుతోందా? ఆయ‌న నాయ‌క‌త్వాన్ని కొంద‌రు వ్యతిరేకిస్తున్నారా ? [more]

Update: 2020-06-03 08:00 GMT

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ క‌మిటీ అధ్యక్షుడు, సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ దూకుడుకు పార్టీలో అడ్డుక‌ట్ట ప‌డుతోందా? ఆయ‌న నాయ‌క‌త్వాన్ని కొంద‌రు వ్యతిరేకిస్తున్నారా ? అందుకే ఆయ‌న‌కు స‌హ‌క‌రించేందుకు ఆయా నాయ‌కులు ఇష్టప‌డ‌డం లేదా ? అంటే తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న వారు ఔన‌నే అంటున్నారు. సాకే శైల జానాథ్ రాష్ట్ర కాంగ్రెస్ ప‌గ్గాలు స్వీక‌రించి దాదాపు ఎనిమిది నెల‌లు గ‌డుస్తున్నాయి. ఈ క్రమంలో ఆయ‌న పెద్దగా చెప్పుకొనే రీతిలో ఎలాంటి కార్యక్రమాలూ చేప‌ట్టలేదు. అయిన‌ప్పటికీ.. ప్రభుత్వంపై విమ‌ర్శలు చేసేందుకు, స‌మ‌స్యల‌పై పోరాటానికి కూడా వెనుకాడ‌డం లేదు.

స్పందించే లక్షణం ఉండటంతో…

ఈ క్రమంలో ఆయ‌న విశాఖ‌లో జ‌రిగిన ఎల్జీ పాలిమ‌ర్స్ ఘ‌ట‌న‌లో బాధి‌తుల‌ను ప‌రామ‌ర్శించే విష‌యంలో రా ష్ట్రంలో స్పందించిన తొలి పార్టీ నేత‌గా ముద్రవేసుకున్నారు. సాకే శైలజానాథ్ అక్కడ‌కు స్వయంగా వెళ్లారు. అదే స‌మ‌యంలో లాక్‌డౌన్‌లో బాధితుల విష‌యంలోనూ స్పందించారు. అదేవిధంగా టీటీడీ భూముల విక్రయం విష‌యం తెర‌మీద‌కు రాగానే త‌న‌దైన శైలిలో స్పందించారు. ప్రత్యేక హోదా విష‌యం పైనా గ‌ళం వినిపించారు. ఇన్ని చేసినా..కూడా పార్టీలో శైల‌జానాథ్‌కు తోడుగా ఎవ‌రూ ముందుకు రాక‌పోవడం గ‌మ‌నార్హం. నిజానికి సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర ఉన్న కాంగ్రెస్‌లో నాయ‌కులు క‌ల‌సిక‌ట్టుగా లేక‌పోయినా.. విష‌యాన్ని బ‌ట్టి స్పందించే ల‌క్షణం ఉంది.

అందుకే కలసి రావడం లేదా?

స్వప‌క్షంలోనే విప‌క్షంగా వ్యవ‌హ‌రించే నాయ‌కులు ఎక్కువ‌గా ఉన్న కాంగ్రెస్‌లో కొన్ని సంద‌ర్భాల్లో అందరూ ఏక‌తాటిపైకి వ‌చ్చిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఇక‌, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయ‌కులే చాలా త‌క్కువ మంది. వారు కూడా ఉంటారో వెళ్తారో తెలియ‌ని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో శైల‌జానాథ్ ఎదురీదుతున్నార‌నే వాద‌న బలంగా వినిపిస్తోంది. దీనికి కార‌ణం ఏంట‌ని ఆరాతీస్తే.. రెడ్డి సామాజిక వ‌ర్గం ఆధిప‌త్యం ఉన్న కాంగ్రెస్‌లో తొలిసారి ఎస్సీ వ‌ర్గానికి చెందిన శైలజానాథ్‌కు ప‌గ్గాలు అప్పగించ‌డ‌మేన‌ని తెలుస్తోంది. ఏపీలో రెడ్డి నాయ‌కులు ఎక్కువ‌గా కాంగ్రెస్‌లో ఉన్నారు. గ‌తంలో వారిదే ఆధిప‌త్యంగా సాగింది.

నిధులిచ్చే వర్గాలు…..

అయితే, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత అటు తెలంగాణ‌కు, ఇటు ఏపీకి కూడా కాంగ్రెస్ ఇంచార్జుల‌ను నియ‌మించిన‌ప్పుడు అస‌లే వ్యతిరేక‌త ఎక్కువ‌గా ఉన్న ఏపీలో రెడ్డి వ‌ర్గాన్ని ప‌క్క‌న పెట్టి ర‌ఘువీరాకు ప‌గ్గాలు అప్పగించారు. ఈయ‌న రెడ్డికాని రెడ్డి! దీంతో పార్టీ పుంజుకోలేదు స‌రిక‌దా.. అప్పటి వ‌ర‌కు పార్టీలో ఉన్న సీనియ‌ర్లు కూడా జంప్ అయ్యారు. ఇక‌, ఈయ‌న త‌ర్వాత అయినా.. రెడ్డి నాయ‌కుడికి ప‌గ్గాలు అప్పగిస్తే.. బాగుంటుంద‌నే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, అధిష్టానం మ‌రోసారి.. ఎస్సీ నాయ‌కుడికి అప్పగించింది. త‌మ‌కు సంప్రదాయ ఓటు బ్యాంకు అయిన ఎస్సీ వ‌ర్గాన్ని ఆక‌ట్టుకునే క్రమంలో కాంగ్రెస్ ఆయ‌న‌కు ఈ ప‌ద‌వి ఇచ్చినా సాకే శైలజానాథ్ తో ఏ వ‌ర్గమూ క‌లిసి రావ‌డం లేదు. దీంతో మెజారిటీ ఆధిప‌త్యం, నిధులు అందించే వ‌ర్గాలు పార్టీకి దూర‌మ‌య్యాయ‌ని, ఇది సాకే శైలజానాథ్ కు శాపంగా మారింద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

వైసీపీకి వన్ సైడ్ గా…..

కాంగ్రెస్ వెలుగులో ఉండ‌గా ఆ పార్టీలో పూర్తి ఆధిప‌త్యం చెలాయించిన రెడ్డి సామాజిక వ‌ర్గం ఇప్పుడు టీడీపీతో వెళ్లే ప‌రిస్థితి లేదు. రెడ్డి వ‌ర్గం మొత్తం వైసీపీకి వ‌న్ సైడ్‌గా స‌పోర్ట్ చేస్తోంది. ఇక కులాల ఈక్వేష‌న్లలో క‌మ్మలు, కాపులు కాంగ్రెస్ వెంట న‌డ‌వ‌వు. బీసీలు త‌లో దిక్కుగా చీలిపోయారు. ఈ నేప‌థ్యంలో శైల‌జానాథ్‌ను ప‌ట్టించుకునే వ్యక్తులు కాని.. వ‌ర్గాలు కాని లేవు. మ‌రి ఈ నేప‌థ్యంలో ఏపీలో కాంగ్రెస్ భ‌విష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News