సోలో బ్రతుకే సో బెటర్ మూవీ రివ్యూ

నటీనటులు: సాయి ధరమ్ తేజ్, నభ నటేష్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, నరేష్, కళ్యాణి నటరాజన్, సత్య, అజయ్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్: [more]

Update: 2020-12-25 12:27 GMT

నటీనటులు: సాయి ధరమ్ తేజ్, నభ నటేష్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, నరేష్, కళ్యాణి నటరాజన్, సత్య, అజయ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: ఎస్ ఎస్ థమన్
ఎడిట‌ర్‌ : నవీన్ నూలి
సినిమాటోగ్రఫర్ : వెంకట్ సి దిలీప్
నిర్మాత: బి. వి. ఎం ఎస్ ప్రసాద్
దర్శకత్వం: సుబ్బు

తొమ్మిదినెలల పాటు థియేటర్స్ దగ్గర సందడి లేదు, బాక్సాఫీసు కళ లేదు, హౌస్ ఫుల్ బోర్డు లేదు, ఆన్ లైన్ బుకింగ్స్ లేవు.. థియేటర్ ప్రపంచం మూగబోయింది. కరోనా కారణంగా మూతబడిన థియేటర్స్ తాజాగా తెరుచుకున్నప్పటికీ పాత సినిమాల హడావిడి తప్ప కొత్త రిలీజ్ లు లేని టైం లో 50 శాతం అక్యుపెన్సీకి దడవకుండా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాని థియేటర్స్ లో విడుదల చేసాడు. ప్లీజ్ థియేటర్ ఎక్సపీరియెన్స్ చెయ్యండి అంటూ.. సెలబ్రిటీస్ అంతా సాయి ధరమ్ తేజ్ కి బెస్ట్ విషెస్ చెప్పారు. కరోనా గడ్డుకాలాన్ని పక్కనబెట్టి.. మాస్క్ పెట్టుకుని ప్రేక్షకులు థియేటర్స్ దగ్గర హడావిడి చేస్తున్నారు. కరోనా కి ఎదురెళ్ళిన మొదటి హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ టాక్ ఏమిటో సమీక్షలో చూసేద్దాం.

కథ:
తన మావయ్య (రావు రమేష్) పెళ్లి చేసుకుని పడిన కష్టాలు చూసిన విరాట్(సాయి తేజ్) తన జీవితంలో పెళ్లి చేసుకోకుండా సోలో లైఫ్ సో బెటర్ అని జీవిస్తుంటాడు. పెళ్లి చేసుకుంటే లైఫ్ లో ఎంజాయ్మెంట్ ఉండదని నమ్మిన విరాట్ కొన్ని బలమైన పరిణామాల రీత్యా పెళ్లి చేసుకునే స్టేజ్ వరకు వెళ్ళిపోతాడు. అసలు ప్రేమ, పెళ్లి అంటే పడని విరాట్ ఎలా ప్రేమలో పడ్డాడు? పెళ్లి వరకు ఎలా వెళ్ళాడు? అసలు విరాట్ మావయ్య రావు రమేష్ పెళ్లి వలన పడిన కష్టాలేమిటి? విరాట్ పెళ్లి చేసుకోవాలనుకోవడానికి బలమైన కారణమేమిటి? ఎలా రియలైజ్ అయ్యాడు అనేదే సోలో బ్రతుకే సో బెటర్ సినిమా మిగతా కథ.

నటీనటుల నటన:
సాయి తేజ్ లుక్స్ లోను, పెరఫార్మెన్స్ లోను కొత్తదనం చూపించాడు. ఈ సినిమాలో కామెడీని పర్ఫెక్ట్ గా పండించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో సాయి తేజ్ పర్వాలేదనిపిస్తుంది. ఇక డాన్స్ విషయంలో మరోసారి గ్రేస్ చూపించాడు. హీరోయిన్ నభ నటేష్ నేచురల్ లుక్స్ తో ఆకట్టుకుంది.నటనకు స్కోప్ ఉన్న కేరెక్టర్ పడడంతో నభ నటన పరంగా మంచి పెరఫార్మెన్స్ ఇచ్చింది. ఇక రావు రమేష్ ఎప్పటిలాగే కామెడిగాను, ఎమోషనల్ గాను అదరగొట్టేసాడు. సాయి తేజ్ – రావు రమేష్ మధ్యన ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి.రాజేంద్ర ప్రసాద్ కూడా ఒక భాద్యతాయుతమైన రోల్ లో కనిపిస్తాడు. మిగతా నటీనటులు పరిధిమేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:
దర్శకుడు సుబ్బు సోలో బ్రతుకే సో బెటర్ కోసం తీసుకున్న లైన్ బావుంది. చాలా సింపుల్ స్టోరీ లైన్ కి కామెడీ యాడ్ చేసి చూపిద్దామనుకున్నాడు. అనుకున్నట్టుగానే ఫస్ట్ హాఫ్ ని కామెడీతో బాగానే మ్యానేజ్ చేసాడు. కథలోకి వెళితె హీరోకి పెళ్లంటే ప‌డ‌దు. దాని కోసం ఓ సంఘాన్ని కూడా ఏర్పాటు చేస్తాడు. పెళ్లి చేసుకుంటే పడే కష్టాలను శ్లోకాల రూపంలో అందరిని మోటివేట్ చేస్తుంటాడు. ఇదే కథ మనకి ఎక్కడో ఎప్పుడో విన్నట్టుగా, చూసినట్టుగా అనిపిస్తుంది. ఎక్కడో కాదు.. నాగార్జున మన్మధుడు సినిమానే గుర్తొస్తుంది. మన్మధుడు లో నాగ్ పెళ్లి చేసుకోడు, చేసుకునే వాళ్ళకి నీతి బోధ చేస్తుంటాడు. ఇక్కడ సోలో బ్రతుకు లో కూడా హీరో అదే చేస్తాడు. అలాంటి హీరోకి పెళ్లెలా అయ్యింద‌న్న‌దే మిగిలిన క‌థ‌. దర్శకుడు ఫస్ట్ హాఫ్ ను హ్యాండిల్ చేసిన విధానం సింప్లీ సూపర్బ్ అనిపిస్తాయి. కానీ దానిని సెకండాఫ్ లో చూపించకపోవడం చాలా నిరాశ కలిగించే అంశం. హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌లో ఫ‌న్ ఉంది. కానీ.. దాన్ని అల్లుకుంటూ తీసిన స‌న్నివేశాల్లో అంత కామెడీ పండ‌దు. ఫస్ట్ హాఫ్ లో ఉన్న కామెడీ.. సెకండ్ హాఫ్ లో మందగించడంతో.. సినిమా మీద ఆసక్తి తగ్గుతుంది. తర్వాత జరగబోయే సన్నివేశాలు ప్రేక్షకుడు ముందే గెస్ చెయ్యడం కూడా ఈ సినిమాకి మైనస్ అనిపిస్తుంది. అంతేకాకుండా హీరో హీరోయిన్ మధ్యన మరిన్ని సీన్స్ అంటే రొమాంటిక్, కెమిస్ట్రీ తరహా సీన్స్ ను యాడ్ చేసి ఉంటే ప్రేక్షకులకి సినిమాపై ఇంకాస్త ఆసక్తి కలిగేది. ఏదైనా సోలో బ్రతుకే సో బెటర్ సో సో గానే మిగిలిపోయిన ఫీలింగ్ అయితే ప్రేక్షకుడికి తప్పకుండా కలిగినా.. థియేటర్స్ లో సినిమా ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఓసారి చూడొచ్చు అనేలా ఉంది.

సాంకేతికంగా:
తమన్ సంగీతం ఈ సినిమాకి ప్లస్ పాయింట్. టైటిల్ ట్రాక్ మరియు ఇది నేనేనా అనే పాటలు వినసొంపుగా అనిపిస్తాయి. నేపధ్య సంగీతం మధ్యస్తంగా అనిపిస్తుంది. వెంకట్ దిలీప్ యొక్క కెమెరావర్క్ బావుంది. చాలా లొకేషన్స్ ని అందంగా చూపించడంలో కెమెరా మ్యాన్ ప్రతిభ కనిపిస్తుంది. ఎడిటింగ్ విషయంలో మరికాస్త షార్ప్ గా ఉంటే బావుండేది. నిర్మాణ విలువలు కథానుసారం ఉన్నాయి.

రేటింగ్: 2.5/5

Tags:    

Similar News