సచిన్....టెన్షన్...టెన్షన్....!!!

Update: 2018-12-08 16:30 GMT

రాజస్థాన్ పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ ప్రస్తుతం సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర పార్టీ అధినేతగా నిన్న మొన్నటి దాకా హడావిడి చేసిన ఆయన ఒక్కసారిగా ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోయారు. రాష్ట్రంలో విజయం తథ్యమని సర్వేల ఫలితాల నేపథ్యంలో, అధినేత రాహుల్ గాంధీ అనుంగు అనుచరుడిగా, యువనేతగా, అన్నింటికి మించి పీసీసీ చీఫ్ గా ముఖ్యమంత్రి పదవి తనదేనన్న ధీమా ఆయనలో ఉండేది. కానీ అదేసమయంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకుడు, ప్రస్తుత ఏఐసీసీ కార్యదర్శి అశోక్ గెహ్లెట్ ను కూడా అధిష్టానం అసెంబ్లీ బరిలోకి దించడంతో సచిన్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. గెహ్లాట్ తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించడం తన అవకాశాలపై ప్రభావం చూపుతుందని సచిన్ ఆందోళన చెందుతున్నారు. గెహ్లాట్ వెనుకబడిన సామాజిక వర్గమైన "మాలి" నాయకుడు. ప్రస్తుతం సర్దార్ పుర నుంచి ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఖ్యమంత్రి పదవికి గెహ్లాట్ గట్టి పోటీదారుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పరిణామం సచిన్ పైలట్ కు సహజంగానే మింగుడు పడటం లేదు.

చివరి నిమిషంలో....

చివరి నిమిషంలో "టోంక్" నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడం కూడా సచిన్ కు అర్థం కాని విషయమే. ఇక్కడ పోటీ చేయడం ఆయనకు ఇష్టం లేదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. 2004, 2009 లో "దౌసా" నుంచి లోక్ సభ కు ఎన్నికైన సచిన్ 2014లో ఓడిపోయారు. అప్పటి నుంచి రాష్ట్ర పగ్గాలు ఆయనకు అప్పగించారు. మొదట్లో ఎన్నికలకు దూరంగా ఉన్న సచిన్ ను టోంక్ స్థానం నుంచి అధిష్టానం అనూహ్యంగా బరిలోకి దించింది. ఒకింత అయిష్టంగానే అంగీకరించారు. దౌసా-అజ్మీర్ ల మధ్య టోంక్ నియోజకవర్గం విస్తరించి ఉంది. వాస్తవానికి ఇది కమలానికి కంచుకోట వంటిది. పలుమార్లు బీజేపీనే ఇక్కడ విజయం సాధించింది. గత 46 సంవత్సరాలుగా ఇక్కడి నుంచి హస్తం పార్టీ ముస్లిం అభ్యర్థిని బరిలోకి నిలుపుతోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా ముస్లిమేతర నాయకుడు ఇక్కడ పోటీ పడటం ఇదే ప్రధమం. బీజేపీ కూడా గత 38 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న నాయకుడిని బరిలోకి దించుతోంది. 2013లో బీజేపీ అభ్యర్థి అజిత్ సిం్ మెహతా గెలుపొందారు. వాస్తవానికి సచిన్ స్థానికేతరుడు అయినప్పటికీ ఆయనకు గెలుపు నల్లేరు మీద నడకలా ఉండాల్సింది. కానీ అలా లేదని క్షేత్ర స్థాయి పరిస్థితులు తెలియజేస్తున్నాయి. నియోజకవర్గంలో 50 వేల మంది ముస్లిం ఓటర్లు, పాతిక వేల మంది గుజ్జర్లు ఉన్నారు. 35 వేల మంది ఎస్సీలు ఉన్నట్లు అంచనా. సామాజిక వర్గాల పరంగా చూస్తే సచిన్ విజయం నల్లేరు మీద నడక కావాల్సింది. కానీ చివరి క్షణంలో కమలనాధులు అనూహ్యంగా పావులు కదపడంతో హస్తం పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒక్కసారి పరిస్థితి తిరగబడింది.

వ్యూహాలు ఫలిస్తాయా....?

కమలం పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదపడంతో హస్తం పార్టీలో ఆందోళన నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అజిత్ సింగ్ కు బదులు రాష్ట్ర మంత్రి యూనస్ ఖాన్ ను పోటీకి నిలిపింది. దీంతో కంగుతినడం హస్తం పార్టీ వంతయింది. ఖాన్ రాష్ట్ర మంత్రివర్గంలో కీలక సభ్యుడు. కమలం పార్టీ టిక్కెట్ పొందిన ఏకైక ముస్లిం నాయకుడు ఆయనే కావడం విశేషం. ఖాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజేకు అత్యంత సన్నిహితుడు. ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో ఆయన ఉన్నారు. కీలకమైన నీటిపారుదల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. సంప్రదాయ బీజేపీ ఓటర్లతో పాటు యాభై వేల మంది ముస్లింలు ఖాన్ వైపు మొగ్గు చూపితే సచిన్ కు చిక్కులు తప్పవు. నియోజకవర్గ ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పైలట్ కూడా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు. ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు తన మామ ఫరూక్ అబ్దుల్లాను రంగంలోకి దించారు. జమ్మూ కాశ్మీర్ మాజీ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా కూతురు "సారా" ను సచిన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మొత్తం 2.20 లక్షల మంది ఓటర్లలో తన సామాజికవర్గమైన "గుజ్జర్ల" ఓటర్లు 30 వేల మంది ఉన్నారు. 35 వేల మంది ఎస్సీలు, మాల సామాజిక వర్గానికి చెందిన 15 వేల మంది ఓటర్లు తనవైపే ఉంటారన్న ధీమాతో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ముస్లిం అయినంత మాత్రాన గంపగుత్తగా వారి ఓట్లు ఆయనకు పడవని, సంప్రదాయ ముస్లిం ఓటర్లు హస్తం వైపు అభిమానం చూపిస్తారని భావిస్తున్నారు. రాష్ట్ర పార్టీ సీనియర్ నాయకుడు,"మాల" సామాజిక వర్గానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ను ప్రచారంలోకి దించారు. చివరి క్షణంలో నామినేషన్ వేసినప్పటికీ, ప్రత్యర్థి ఖాన్ బలవంతుడయినప్పటికీ సచిన్ పైలట్ తన వంతు ప్రచారం గట్టిగా చేస్తున్నారు. ఒకవేళ సచిన్ ఓడిపోతే సహజంగా సీనియర్ నాయకుడు గెహ్లాట్ సిఎం అభ్యర్థి అవుతారు. దానివల్ల పోటీ ఉండదని అధిష్టానం భావిస్తుంది. ఒక వేళ సచిన్, గెహ్లాట్ ఇద్దరూ ఓడిపోతే అధిష్టానం పని ఇంకా సులువవుతుంది. అప్పుడు మూడో అభ్యర్థి పై దృష్టి పెట్టడానికి మార్గం సుగమమవుతుంది. ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో చూడాలి మరి.....!!!

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News