ఈయన మొహంలో తేజస్సు...ఎందుకో...??

Update: 2018-11-12 17:30 GMT

రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సచిన్ పైలట్ మంచి ఊపు మీద ఉన్నారు. ఆయనలో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. ముఖ వర్చస్సు తెలియని తేజస్సుతో వెలిగిపోతోంది. బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు ఆయనను ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఈ నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘంటాపధంగా గెలుస్తుందన్న సర్వేల్లో రాజస్థాన్ ముందుంది. ప్రతి సర్వే హస్తం విజయాన్ని ఖాయం చేస్తోంది. దీనికి తోడు అధికార పార్టీని ఓడించి విపక్షాన్ని గద్దెనెక్కించే సంప్రదాయం ఈ ఎడారి రాష్ట్రంలో మూడు దశాబ్దాల నుంచి పాతుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సహజంగానే పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి పదవికి ప్రధాన పోటీదారుడు అవుతాడు. దీనికి తోడు యువరాజు కావడం, మిస్టర్ క్లీన్ అన్న ఇమేజ్, రాహుల్ కోటరీలో కీలక వ్యక్తి కావడంతో వరమాల సచిన్ పైలట్ మెడలోనే పడుతుందన్న ఊహాగానాలు బలంగా విన్పిస్తున్నాయి.

సీనియర్లను పక్కన పెట్టి.....

అశోక్ గెహ్లెట్, సీీపీ జోషీ వంటి సీనియర్లను రాహుల్ గాంధీ రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంచడంతో సచిన్ కు తిరుగులేదన్నవాదన వినపడుతోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. సచిన్, గెహ్లాట్, జోషి సహా ఎవరూ అసెంబ్లీ ఎన్నికల్లోపోటీ చేయడం లేదు. అదే సమయంలో అధికారికంగా సీఎం అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించలేదు. అయినప్పటికీ అందరి వేళ్లూ సచిన్ పైలట్ వైపే చూపిస్తుండటం విశేషం. సీఎంగా అనధికారికంగా ఆయన పేరు ఖరారయినట్లేనని చెబుతున్నారు. యువనాయకుడు, వివాదస్పదుడు కాకపోవడం, ఉన్నత విద్యావంతుడు కావడం పైలట్ ప్రత్యేకతలు. దివంగత కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి రాజేష్ పైలెట్ కుమారుడైన సచిన్ 1977 సెప్టంబరు 7న ఉత్తరప్రదేశ్ లోని షహరాన్ పూర్ లో జన్మించారు. ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ బాల భారతి పాఠశాలలో చదివారు. అనంతరం అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ఎం.బి.ఎ అభ్యసించారు. కొంతకాలం బీబీసీలో పాత్రికేయుడిగా పనిచేశారు. పైలట్ వైవాహిక జీవితం ఆసక్తికరం. అమెరికాలో చదువుతున్న సమయంలో "సారా" అనే యువతిని ప్రేమించారు. సారా ఎవరో కాదు. జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా కుమార్తె. వారి వివాహానికి ఫరూక్ కుటుంబం విముఖత చూపింది. అయినా పెద్దల అభీష్టానికి విరుద్థంగా 2004 జనవరి 15న వారి వివాహం జరిగింది. అనంతరం ఫరూక్ కుటుంబం వివాహాన్ని సాదరంగా స్వాగతించింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం పైలట్ కుటుంబం యూపీలోని ఘజియాబాద్ లో నివాసం ఉంటుంది. ఈ నగరం పేరుకు యూపీలో ఉన్నప్పటికీ భౌగోళికంగా ఢిల్లీకి సమీపంలోనే ఉంటుంది.

అనూహ్యంగా రాజకీయాల్లోకి.....

పైలట్ రాజకీయ ప్రవేశం ప్రతికూల పరిస్థితుల్లో జరిగింది. తండ్రి మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన పైలట్ ఆయన ప్రాతినిధ్యం వహించిన "దౌసా" నియోకవర్గం నుంచి 2004లో తొలిసారిగా లోక్ సభకు ఎన్నికయ్యారు. అప్పటికి ఆయన వయస్సు 26 ఏళ్లు. 2009లో అజ్ మేర్ నుంచి 76వేలకు పైగా ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. 2014లో అదేస్థానం నుంచి పోటీ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. రాష్ట్రంలో ఒక్కస్థానాన్ని కూడా కాంగ్రెస్ గెలవలేదు. తండ్రి రాజేష్ పైలట్ ఆశయం మేరకు 2012 సెప్టంబరు6న పైలట్ ప్రాదేశిక సైన్యంలో సేవలందించారు. కేంద్రమంత్రిగా ఉంటూ సైన్యంలో తాత్కాలిక సేవలు అందించిన తొలి వ్యక్తి సచిన్ పైలట్ కావడం విశేషం. తన తాత, తండ్రికూడా సైన్యంలో పనిచేశారని, వారి వారసత్వాన్ని కొనసాగించడం తనకు గర్వకారణమని చెబుతుంటారు సచిన్ పైలట్.

ఉప ఎన్నికల తర్వాత.....

2013 అసెంబ్లీ, 2014 లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో హస్తం పార్టీ చిరునామా కోల్పోయినప్పటికీ సచిన్ పై నమ్మకంతో పార్టీ ఆయనకు పీసీసీ పగ్గాలు అందించింది. అశోక్ గెహ్లాట్, సి.పి.జోషి వంటి అగ్రనేతలను పక్కన పెట్టి సచిన్ వైపు పార్టీ మొగ్గు చూపడం విశేషం. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని ఆయన వమ్ము చేయలేదు. ఈ ఏడాది ఫివ్రవరిలో అజ్మీర్, అల్వార్ లోక్ సభ, మండల్ ఘడ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపారు. రెండు లోక్ సభ స్థానాల పరిధిలో 16 అసెంబ్లీ సెగ్మంట్లున్నాయి. వీటిలో 15 బీజేపీ చేతిలో ఉండటం గమనార్హం. తన సామాజిక వర్గమైన "గుజ్జర్ల" ను హస్తం వైపు మళ్లించడంలో విజయం సాధించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ముందున్నారు. ఈ విషయాలను గమనించిన రాహుల్... సచిన్ కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. రాష్ట్ర వ్యవహారాల్లో గెహ్లాట్ తదితరుల జోక్యాన్ని నివారించారు. పార్టీని విజయపథంలో నడిపించే బాధ్యతను సచిన్ భుజస్కంధాలపై పెట్టారు. అధికారికంగా ప్రకటించనప్పటికీ పార్టీ విజయం సాధిస్తే సచిన్ కే సీఎం కిరీటం అప్పగిస్తామన్న సంకేతాలను చాలా స్పష్టంగా అధిష్టానం తెలియజేసింది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News