పైలెట్ పూర్తిగా పట్టు కోల్పోయారా?

ఉన్నదీ పోయే.. ఉంచుకున్నదీ పోయే అన్న సామెత ఖచ్చితంగా కాంగ్రెస్ యువనేత సచిన్ పైలెట్ కు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. సచిన్ పైలెట్ అశోక్ గెహ్లాత్ పై తిరుగుబాటు [more]

Update: 2020-11-29 18:29 GMT

ఉన్నదీ పోయే.. ఉంచుకున్నదీ పోయే అన్న సామెత ఖచ్చితంగా కాంగ్రెస్ యువనేత సచిన్ పైలెట్ కు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. సచిన్ పైలెట్ అశోక్ గెహ్లాత్ పై తిరుగుబాటు చేసి సాధించిందేమిటన్నది ప్రశ్నించుకుంటే ఏమీ లేదనే చెప్పాలి. ఇప్పుడు సచిన్ పైలెట్ వైపు వచ్చే ఎమ్మెల్యే కూడా ఎవరూ లేరు. పైగా ఆయనకు ఉన్న డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి కూడా పోయింది. అధిష్టానంతో చర్చలు జరిపి రాజీ పడ్డాక సచిన్ పైలెట్ రాజస్థాన్ రాజకీయాల్లో నామమాత్రంగా మారిపోయారన్న టాక్ వినపడుతుంది.

నాలుగు నెలల క్రితం….

నాలుగు నెలల క్రితం రాజస్థాన్ రాజకీయం సంక్షోభంలో పడిన సంగతి తెలిసిందే. సచిన్ పైలెట్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కు వ్యతిరేకంగా బయటకు వచ్చారు. దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు సచిన్ పైలెట్ ను నమ్ముకుని వచ్చారు. బీజేపీలో చేరతారని తొలుత ప్రచారం జరిగినా ఆయన మాత్రం ఆ పని చేయలేదు. చివరకు కాంగ్రెస్ అధిష్టానం సూచనల మేరకు సచిన్ పైలెట్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. ప్రత్యేకంగా రాహుల్, ప్రియాంక గాంధీలు బుజ్జగించిడం, ప్రత్యేక హామీలు ఇవ్వడంతో సచిన్ పైలెట్ వెనక్కు తగ్గారంటున్నారు.

అయితే పైలెట్ వర్గాన్ని….

ఫలితంగా రాజస్థాన్ లో అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది. అయితే గత నాలుగు నెలల నుంచి సచిన్ పైలెట్ ను అశోక్ గెహ్లాత్ పూర్తిగా పక్కన పెట్టేశారంటున్నారు. ఆయన వెంట వెళ్లిన ఎమ్మెల్యేలను మాత్రం అశోక్ గెహ్లాత్ పిలిచి మాట్లాడుతూ దగ్గరకు తీసుకుంటున్నారు. సచిన్ పైలెట్ ను ఒంటరి వాడిని చేసే ప్రయత్నం ఇప్పటికే అశోక్ గెహ్లాత్ ప్రారంభించారు. ఇందులో ఆయన సక్సెస్ అయినట్లే కనిపిస్తుంది.

వివక్షత కొనసాగుతున్నా….

రాహుల్ సూచనల మేరకు సచిన్ పైలెట్, అశోక్ గెహ్లాత్ ల మధ్య సయోధ్యకు సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. సమన్వయ కమిటీపై కూడా అశోక్ గెహ్లాత్ ప్రభావం చూపుతున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. అప్పట్లో సచిన్ పైలెట్ కోరిక మేరకు పార్టీ ఇన్ ఛార్జిని మార్చినా ఏ మాత్రం ప్రయోజనం లేదంటున్నారు. అశోక్ గెహ్లాత్ సచిన్ పైలెట్ పట్ల మరింత వివక్షత చూపుతున్నారు. అయినా ఇప్పుడు సచిన్ పైలెట్ ఏమీ చేయలేని పరిస్థితి. మరోసారి ఎదురుతిరగలేని స్థితి. ఎందుకంటే ఆయన నమ్మకం కోల్పోయినట్లే కనపడుతుంది.

Tags:    

Similar News