సచిన్ చల్లబడ్డారు.. అనిశ్చితికి తెర?

రాజస్థాన్ రాజకీయ పరిణామాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. తాజాగా సచిన్ పైలట్ రాహుల్, ప్రియాంక గాంధీలను కలవడంతో రాజస్థాన్ లో రాజకీయ అనిశ్చితికి తెరపడే [more]

Update: 2020-08-11 16:30 GMT

రాజస్థాన్ రాజకీయ పరిణామాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. తాజాగా సచిన్ పైలట్ రాహుల్, ప్రియాంక గాంధీలను కలవడంతో రాజస్థాన్ లో రాజకీయ అనిశ్చితికి తెరపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. మరో మూడు రోజుల్లో రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సచిన్ పైలట్ రాజీకి రావడంతో అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం గండం నుంచి బయటపడినట్లేనని అంటున్నారు.

బీజేపీలో చేరనని చెప్పినప్పుడే….

నిజానికి సచిన్ పైలట్ తన వర్గం ఎమ్మెల్యేలతో బయటకు వచ్చినప్పుడు బీజేపీలో చేరతారనుకున్నారు. కానీ ఆయన బీజేపీలో చేరనని ప్రకటించారు. దీంతో ఆయన సొంతంగా పార్టీ పెడతారని భావించారు. కానీ నెల రోజుల తర్వాత సచిన్ పైలట్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. రాహుల్, ప్రియాంక గాంధీ భేటీలో తన అసహనాన్ని మొత్తాన్ని వెళ్లగక్కినట్లు తెలిసింది. తనకు పార్టీ మీద ఏమాత్రం కోపం లేదని, అశోక్ గెహ్లాత్ వ్యవహారశైలితోనే తాము బయటకు రావాల్సి వచ్చిందని సచిన్ పైలట్ రాహుల్ కు వివరించినట్లు తెలిసింది.

రాహుల్ ముందు షరతులు….

దీంతోపాటు సచిన్ పైలట్ రాహుల్ ముందు కొన్ని షరతులు కూడా పెట్టినట్లు సమాచారం. భవిష్యత్తులో తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్నది ఆయన ప్రధానమైన షరతు. అంతేకాకుండా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కూడా తనకు ఇవ్వాలని సచిన్ పైలట్ కోరినట్లు చెబుతున్నారు. తన వర్గం ఎమ్మెల్యేల మీద అశోక్ గెహ్లాత్ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని కూడా రాహుల్ కు సచిన్ పైలట్ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

అధిష్టానం అంగీకారం….

ఇందుకు రాహుల్ గాంధీ నుంచి కూడా సానుకూల స్పందన వచ్చినట్లు సమాచారం. త్వరలోనే సచిన్ పైలట్ వర్గ ఎమ్మెల్యేలను స్వయంగా కలుస్తానని హామీ ఇచ్చారు. సచిన్ పైలట్ వర్గానికి మరో డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడానికి కూడా రాహుల్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇకపై ప్రభుత్వ నిర్ణయాలపై ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని కూడా రాహుల్ సచిన్ పైలట్ కు హామీ ఇచ్చారని సమాచారం. ప్రస్తుతం రాజస్థాన్ పీసీసీ అధ్యక్ష పదవితో పాటు డిప్యూటీ సీఎం పదవిని కూడా చేపట్టాలని సచిన్ పైలట్ ను రాహుల్ గాంధీ కోరినట్లు సమాచారం. దీంతో అసెంబ్లీ సమావేశాలకు ముందే రాజస్థాన్ రాజకీయ అనిశ్చితి కి తెరపడనుంది.

Tags:    

Similar News