సచిన్ కు ఇక అన్నీ మంచిరోజులేనా?

రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడు కాబోతున్నారు. దీంతో మళ్లీ యువనేతల్లో ఆశమొదలయింది. ప్రధానంగా రాజస్థాన్ లో సచిన్ పైలట్ కు తిరిగి పగ్గాలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. [more]

Update: 2021-05-17 17:30 GMT

రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడు కాబోతున్నారు. దీంతో మళ్లీ యువనేతల్లో ఆశమొదలయింది. ప్రధానంగా రాజస్థాన్ లో సచిన్ పైలట్ కు తిరిగి పగ్గాలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈసారి రాజస్థాన్ ఎన్నికల్లో సచిన్ పైలట్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. అయితే సచిన్ పైలట్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు.

గత ఎన్నికల సమయంలోనే….?

రాజస్థాన్ లో సచిన్ పైలట్ కు ప్రత్యేక స్థానం. ఆయన గత ఎన్నికల్లో పీసీసీ చీఫ్ గా పార్టీని విజయపథాన నడిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని తానేనని భావించి సచిన్ పైలట్ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పార్టీని అధికారంలోకి తెచ్చారు. తీరా అధికారంలోకి రాగానే సచిన్ పైలట్ ను దూరం పెట్టారు. సోనియా గాంధీ జోక్యంతో చివరి నిమిషంలో అశోక్ గెహ్లాత్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించింది. అప్పటి నుంచి రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో రెండు గ్రూపులుగా మారి విభేదాలు తీవ్రమయ్యాయి.

రాహుల్ జోక్యంతో…

సచిన్ పైలట్ ఒక దశలో పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు సిద్దమయ్యారు. తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో కలసి క్యాంప్ రాజకీయాలను నడిపారు. అయితే చివరికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ జోక్యంతో సచిన్ పైలట్ పార్టీలోనే కొనసాగేందుకు నిర్ణయించుకున్నారు. సచిన్ పైలట్, అశోక్ గెహ్లాత్ మధ్య సమన్వయానికి కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడగలిగింది.

రాహుల్ రానుండటంతో….

అయితే రాహుల్ గాంధీ తిరిగి పగ్గాలు చేపడుతుండటంతో సచిన్ పైలట్ కు మంచి భవిష్యత్ ఉంటుందని ఆయన వర్గం అంచనాల్లో ఉంది. రాహుల్ గాంధీ నుంచి వచ్చిన హామీ మేరకే సచిన్ పైలట్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికలకు సచిన్ పైలట్ సారథ్యంలోనే వెళ్లాలన్నది రాహుల్ గాంధీ ఆలోచనగా ఉందని చెబుతున్నారు. రాజస్థాన్ లో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సచిన్ పైలట్ చిరకాల కోరిక నెరవేరే అవకాశముంది.

Tags:    

Similar News