సబితమ్మ సర్దుకుంటున్నారా..?

ఇప్పటికే ఓటమితో కుదేలైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి త్వరలోనే భారీ షాక్ తగిలేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి సుమారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలో [more]

Update: 2019-01-16 11:00 GMT

ఇప్పటికే ఓటమితో కుదేలైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి త్వరలోనే భారీ షాక్ తగిలేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి సుమారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు మహేశ్వరం ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి. ఆమెకు టీఆర్ఎస్ మంత్రి పదవితో పాటు ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ సీటు కూడా ఆఫర్ చేశారని తెలుస్తోంది. కుమారుడిని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇప్పించాలని భావిస్తోన్న ఆమె టీఆర్ఎస్ పార్టీలో చేరతారని అంటున్నారు. ఆయితే, ఆమె మాత్రం ఈ ప్రచారాన్ని ఎప్పటికప్పుడు కొట్టివేస్తూ వస్తున్నారు.

కుమారుడి భవిష్యత్ కోసం…

పట్లోళ్ల ఇంద్రారెడ్డి హఠాన్మరణంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన సబిత ఇంద్రారెడ్డి మొదట చేవెళ్ల నుంచి తర్వాత మహేశ్వరం నుంచి ప్రాతినిథ్యం వహించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంతో సబిత ఇంద్రారెడ్డి మంచి ప్రధాన్యత ఉండేది. ఆమెకు కీలకమైన హోంశాఖ మంత్రి పదవి కూడా దక్కింది. ఇక, గత ఎన్నికల్లోనే కుమారుడు కార్తీక్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావాలనుకున్న ఆమె తన సీటును త్యాగం చేశారు. కుటుంబంలో ఒక్కరికే టిక్కెట్ ఇస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం చెప్పడంతో ఆమె పోటీ చేయకుండా కుమారుడికి చేవళ్ల పార్లమెంట్ టిక్కెట్ ఇప్పించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆమె మహేశ్వరం నుంచి పోటీచేసే విజయం సాధించగా కార్తీక్ రెడ్డి మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. ఆయన రాజేంద్రనగర్ టిక్కెట్ చివరి వరకు ప్రయత్నించినా మళ్లీ కుటుంబంలో ఒకటే టిక్కెట్ అనే పార్టీ రూల్ తో అవకాశం కోల్పోయారు.

మంత్రి పదవి ఆఫర్ ఉందా..?

దీంతో కార్తీక్ రెడ్డిని చట్టసభలో చూడాలనుకున్న సబిత ఇంద్రారెడ్డి ఆశలు నెరవేరలేదు. అయితే, ఈసారి చేవెళ్ల ఎంపీ టిక్కెట్ కార్తీక్ రెడ్డికి దక్కే అవకాశాలు తక్కువే అంటున్నారు. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరడంతో ఆయనకే టిక్కెట్ దక్కే అవకాశం ఉంది. దీంతో వీరి అసంతృప్తిని గుర్తించిన టీఆర్ఎస్ నేతలు పార్టీలో చేరాల్సిందిగా కోరినట్లు సమాచారం. సీనియర్ ఎమ్మెల్యేగా, రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నందున సబితను మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు టీఆర్ఎస్ ఆఫర్ ఇచ్చిందట. గత క్యాబినెట్ లో మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదనే అపవాదు ఉన్నందున సబితకు మంత్రి పదవి ఇస్తే సరిపోతుందని ఆ పార్టీ భావిస్తోందని సమాచారం.

సీఎల్పీ పదవి దక్కకపోతే

ఇక, సబిత ఇంద్రారెడ్డి ఆశ నెరవేర్చేలా కార్తీక్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ సీటును కూడా ఆఫర్ చేసిందట. కాంగ్రెస్ లో కేవలం ఎమ్మెల్యేగా ఉండటం కంటే టీఆర్ఎస్ లోకి వెళితే మంత్రి పదవితో పాటు కుమారుడిగా ఎంపీ టిక్కెట్ వస్తుండటంతో వారు అటువైపు మొగ్గు చూపుతారని అంటున్నారు. అయితే, ప్రస్తుతం సీఎల్పీ లీడర్ పదవిని ఆశిస్తున్న సబిత ఇంద్రారెడ్డి ఇందుకోసం ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ ఈ పదవి గనుక దక్కితే ఆమె కాంగ్రెస్ లోనే కొనసాగుతారని, ఒకవేళ దక్కకపోతే మాత్రం గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమే అంటున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుబంధంతో పాటు కీలక నాయకురాలిగా ఉన్న ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారరని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ ప్రచారం అంతా టీఆర్ఎస్ ఆడుతున్న మైండ్ గేమ్ అని వారు ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News