జగన్ దొరికిపోతాడు అంటున్న విశాఖ ఆక్టోపస్ ?

ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ చాలా కాలంగా సైలెంట్ అయ్యారు. కానీ విశాఖ ఆక్టోపస్ గా పేరు గడించిన మాజీ ఎంపీ సబ్బం హరి మాత్రం ఎపుడూ [more]

Update: 2020-10-24 13:30 GMT

ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ చాలా కాలంగా సైలెంట్ అయ్యారు. కానీ విశాఖ ఆక్టోపస్ గా పేరు గడించిన మాజీ ఎంపీ సబ్బం హరి మాత్రం ఎపుడూ నోరు దాచుకోవడంలేదు. టీడీపీ అనుకూల మీడియాకు ఆయన శాశ్వత విశ్లేషకుడిగా మారిపోయారు. నిజానికి ఆయనలోని ఈ విశ్లేషకుడి టాలెంట్ ని కనిపెట్టి సదా ప్రోత్సహిస్తోంది మాత్రం పచ్చ మీడియావే. విశ్లేషకుడుకి వివక్ష ఉండకూడ‌దు, తరతమ భేదాలు కూడా ఉండవు, కానీ జగన్ అంటే నిలువెల్లా కసి, ద్వేషం నింపుకున్న సబ్బం హరి ఎలా పొలిటికల్ అనలిస్ట్ అవుతాడో సదరు మీడియావే చెప్పాలేమో. ఏది ఏమైనా తమకు అనుకూలంగా తాళం వేస్తూ హరి కధలు చెబుతాడు కాబట్టి ఆయన్ని బాగా ఎంటర్ టైన్ చేస్తారు అంటారు.

జైలు పక్కానట …..

జగన్ కి జైలు పక్కా అంటున్నారు విశాఖ ఆక్టోపస్ సబ్బం హరి . ఆయన దాని కేసుకు సంబంధించిన బలమైన ఆధారాలను ముందుకు తేవడంలేదు. ఎపుడో ఏడేళ్ల క్రితం వైసీపీలో ఉన్న వేళ జగన్ తనతో పర్సనల్ గా కొన్ని విషయాలు చెప్పాడని అంటూ వాటిని ఇపుడు బయటకు తెస్తున్నాడు. జగన్ కి సీబీఐ కేసుల కంటే కూడా ఇబ్బంది కలిగించేవి ఈడీ కేసులట. ఒక నాలుగు కేసుల్లో బలంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి కచ్చితంగా కొంత ఇరకాటం ఉంటుందని సబ్బం హరి అంటున్నారు. పైగా ఈ విషయాన్ని జగనే తనతో స్వయంగా చెప్పారని కలరింగ్ ఇస్తున్నారు. దాన్ని జగన్ ఎటూ ఖండించరు కాబట్టి సబ్బం హరి రాజకీయ పబ్బం ఇలా గడచిపోతోంది అనుకోవాలేమో.

బీజేపీ చేతుల్లోనే…..

జగన్ జైలుకెళ్ళిపోతే ఇక వైసీపీ సర్కార్ పూర్తిగా బీజేపీ చేతుల్లోకి వెళ్ళిపోతుందని కూడా సబ్బం హరి వారు జోస్యం చెబుతున్నారు. తమిళనాట అన్నాడీఎంకే సర్కార్ మాదిరిగా ఏపీలోనూ తోలుబొమ్మ ప్రభుత్వాన్ని చేసి బీజేపీ ఆట అడిస్తుందిట. అందువల్ల వైఎస్ కుటుంబం నుంచి సీఎం అవుతారా, లేక మరొకరు అవుతారా అన్నది అనవసరమైన వాదన అని కూడా ఆయన చెబుతున్నారు. ఏపీలో పేరుకు వైసీపీ సర్కార్ ఉన్నా కూడా దాని వెనక పాలించేది మాత్రం కచ్చితంగా బీజేపీ అని సబ్బం గుట్టు మట్లు చెబుతున్నారు.

చాన్స్ అంటే ఇదేగా…

మేయర్ గా, ఎంపీగా పనిచేసిన సబ్బం హరి రెండు దశాబ్దాల పాటు అక్రమ నిర్మాణం చేసిన ఇంటిలోనే నివాసం ఉన్నారు. దాని మీద ఎట్టకేలకు ఇటీవల విశాఖ మునిసిపల్ అధికారులు జోక్యం చేసుకుని చర్యలు తీసుకున్నారు. ఆయన ఇంటి ప్రహారీ గోడను కూల్చేసి జీవీఎంసీ స్థలం అంటూ పెద్ద బోర్డులే పెట్టారు. నాడు ఆవేశంతో రగిలిన సబ్బం హరికి ఇంత తొందరగా జగన్ చాన్స్ ఇస్తాడనుకోలేదులా ఉంది. అందుకే పిలిచిన వెంటనే టీడీపీ అనుకూల మీడియా ముందుకు వచ్చి జోస్యాలు జాతకాలు వల్లె వేస్తున్నాడని ప్రత్యర్ధులు అంటున్నారు. జగన్ కేసుల విషయంలో తీర్పులు ఎలా వస్తాయో ఎవరికీ తెలియదు కానీ ఈ ముసుగులో తమ పాత పగలను, కోపాలను ఇలా చల్లార్చుకుంటున్నారన్న మాట అయితే వినిపిస్తోంది. నిజానికి కోర్టు తీర్పుల మీద ఇంత ఎక్కువగా చర్చించే రాష్ట్రం దేశంలో ఏదైనా ఉందంటే అది ఏపీ అనే చెప్పాలేమో.

Tags:    

Similar News