సబ్బం శాపాలు.. ఆ కల నిజమైతే?

కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను చెప్పి ప్రజలను విపత్తు నుంచి కాపాడాలి. ఒకవేళ ప్రభుత్వం దాస్తే.. కనీసం ఐఏఎస్‌ అధికారులైనా ఈ సమయంలో నిజాలను చెప్పాలి. [more]

Update: 2020-04-22 14:30 GMT

కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను చెప్పి ప్రజలను విపత్తు నుంచి కాపాడాలి. ఒకవేళ ప్రభుత్వం దాస్తే.. కనీసం ఐఏఎస్‌ అధికారులైనా ఈ సమయంలో నిజాలను చెప్పాలి. కరోనా పేరు చెబితే యావత్‌ దేశం, ప్రపంచం వణికిపోతుంటే.. మన సీఎం, మంత్రులు దానిని చాలా తేలికగా తీసుకుంటున్నారు. విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం ఈ ముఖ్యమంత్రికి లేదు. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో టెస్టులు జరగడం లేదు. కరోనా టెస్టింగ్‌ కిట్లను నేరుగా కొనుగోలు చేయకుండా ఏజెన్సీ ద్వారా కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమిటి?… అబ్బో.. ఇలా వింటూపోతే.. అలా ఆయ‌న సూక్తుల‌ను చెప్పుకొంటూనే పోతారు!

అనుకూల మీడియాకే…..

ఇంత‌కీ ఆయ‌నెవ‌రో తెలుసా? అమావాస్యకు పున్నమికి అనుకూల మీడియా ముందుకు వ‌చ్చి.. జ‌గ‌న్ ప్రభుత్వంపై చెడా మ‌డా విమ‌ర్శల వ‌ర్షం కురిపించి.. మ‌ళ్లీ తెర‌మ‌రుగ‌య్యే మాజీ ఎంపీ వ‌ర్యులు స‌బ్బం హ‌రి. గ‌తంలోనూ ఆయ‌న జ‌గ‌న్ ప్రభుత్వంపై ఆరోప‌ణ‌లు చేశారు. కొన్ని తీర్పులు కూడా చెప్పారు. మ‌ళ్లీ ఇప్పుడు క‌రోనా కాలంలో మీడియా ముందుకు వ‌చ్చారు. నిజానికి నాయ‌కుడు అనేవారు. ఈ కష్ట కాలంలో ప్రజ‌ల‌కు ద‌న్నుగా ఉంటూ.. వారికి కొన్ని సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇవ్వాలి. ప్రభుత్వానికి తోచిన సాయం చేయాలి. కానీ, ఈ విష‌యాన్ని ప‌క్కన పెట్టిన స‌బ్బం హరి మామూలుగానే త‌న రాజ‌కీయ విమ‌ర్శలు చేసేశారు.

కసిదీరా తిట్టడానికే…..

జ‌గ‌న్‌ను క‌సి దీరా.. రెండు తిట్లు తిట్టేసి.. నాలుగు శాప‌నార్థాలు పెట్టేశారు. కేంద్రం ఇచ్చిన డబ్బు ను తామే ఇస్తున్నామని చెప్పుకోవడం కంటే దానికి అదనంగా రెండు, మూడు వేల రూపాయలు కలిపి ఇచ్చి నిరుపేదలను ఆదుకుంటే బాగుండేద‌న్నారు. మ‌రి ఇలా ఇవ్వడానికి గ‌తంలో పాలించిన త‌మ నాయ‌కుడు చంద్రబాబు ఖ‌జానాలో ఎంత మిగిల్చి వెళ్లారో కూడా చెప్పి ఉంటే .. స‌బ్బం హరి చాతుర్యానికి చ‌ప్పట్లు అదిరేవి. ఇక‌, చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నా వైరస్‌ సమయంలో ఎలా ఉండాలి? ప్రజలకు ఏం చేయాలో హైదరాబాద్‌ నుంచి సూచనలు చేస్తున్నార‌ని భ‌జ‌న ప్రారంభించారు. మా నాయ‌కుడు ఎక్కడున్నా.. మా భ‌జ‌న‌ మామూలే.. అన్నట్టుగా ఉంద‌ని స‌బ్బం హ‌రికి విమ‌ర్శకుల నుంచి బాణాలు.

ఇంకా మార్పు రాలేదా?

ఇంత‌టితో స‌బ్బం హరి ఆగి ఉంటే వేరేగా ఉండేది. కానీ, ఆయ‌న మ‌రో కీల‌క వ్యాఖ్య చేసి అంద‌రి దృష్టినీ ఆక ర్షించాడు. టీడీపీకి 70-80 సీట్లు ఉంటే ఇప్పటికే వైసీపీలో రాజకీయ సంక్షోభం వచ్చి ఉండేదని, రాష్ట్రంలో అధికారం మ‌ళ్లీ సైకిల్ ఎక్కేద‌ని, చంద్రబాబు చ‌క్రం తిప్పేవార‌ని చెప్పక‌నే చెప్పేశారు! అంటే.. ఇంత జ‌రిగాక కూడా చంద్రబాబులో మార్పు రాలేద‌ని జంపింగ్ జిలానీల‌పైనే ఆధార‌ప‌డతార‌ని చెప్పిన‌ట్టుగా లేదూ? రెండేళ్లలో జమిలి ఎన్నికలు వస్తే ప్రజలకు ఈ బాధలు తప్పుతాయని.. లేకపోతే నాలుగేళ్లు భరించాల్సిందేనని ప్రజ‌ల‌కు స‌బ్బం హరి శాపం పెట్టారు!

భీమిలీలో ఎందుకు?

అయితే, ఇంత విశ్లేష‌ణ చేయ‌గ‌లిగిన స‌బ్బం హరి కూడా భీమిలిలో తాను ఎందుకు గెల‌వ‌లేక‌పోయారో ముందుగానే అంచ‌నా వేసుకుని ఉంటే బాగుండేది క‌దా? అంటున్నారు ఊరుకోలేకుండా ఉండ‌లేక పోతున్న విమ‌ర్శకులు! నిజ‌మే క‌దా?.. శ‌కునం చెప్పే బ‌ల్లి మాదిరిగా స‌బ్బం మారిపోయార‌ని అనిపించ‌డం లేదూ? ఒక‌ప్పుడు స‌బ్బం హ‌రి వ్యాఖ్యల‌కు, విశ్లేష‌ణ‌ల‌కు ఎంతో ప్రయార్టీ ఉండేది. అలాంటి స‌బ్బం హరి ఈ రోజు బాబు భ‌జ‌న ఇంత‌లా చేయ‌డం చాలా మందికి న‌చ్చడం లేదు.

Tags:    

Similar News