ఇంతేసంగతులు…చిత్తగించవలెను

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా రెచ్చిపోయిన నేత ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. జగన్ పైన విమర్శలు, చంద్రబాబుపైన పొగడ్తలూ చేస్తూ కాలం వెళ్లబుచ్చిన మాజీ పార్లమెంటు [more]

Update: 2019-12-04 15:30 GMT

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా రెచ్చిపోయిన నేత ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. జగన్ పైన విమర్శలు, చంద్రబాబుపైన పొగడ్తలూ చేస్తూ కాలం వెళ్లబుచ్చిన మాజీ పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి ఇప్పుడు పూర్తిగా పక్కకు జరిగిపోయారు. దీంతో తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన భీమిలీ నియోజకవర్గం పార్టీ క్యాడర్ లో అయోమయం పరిస్థితి నెలకొంది. సబ్బం హరి పూర్తిగా విశాఖపట్నంలోని తన ఇంటికే పరిమిత మయ్యారు.

ప్లస్ అవుతారని భావిస్తే…..

సబ్బం హరి సీనియర్ రాజకీయ నేత. ఆయన టీడీపీలో చేరారా? లేదా? అన్నది పక్కన పెడితే చివరి నిమిషంలో చంద్రబాబు భీమిలీ టిక్కెట్ ను సబ్బం హరికి కేటాయించి అందరినీ ఆశ్చర్యపర్చారు. సబ్బం హరి తనకు ప్లస్ అవుతారని చంద్రబాబు భావిస్తే, తాను గెలచి మంత్రి అవ్వాలని హరి కలలు కన్నారు. అయితే ఇద్దరికీ ఝలక్ ఇస్తూ భీమిలీ ప్రజలు సబ్బం హరిని చిత్తుగా ఓడించారు. దీనికి కారణాలు లేకపోలేదు. అక్కడ గెలిచిన అవంతి శ్రీనివాసరావు మంత్రి అయ్యారు.

కంచుకోట ప్రాంతంలో…..

భీమిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటిది. టీడీపీ ఆవిర్భవించిన తర్వాత భీమిలీ నియోజకవర్గంలో తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే ఆరుసార్లు టీడీపీ విజయం దక్కించుకుందంటే అక్కడ పార్టీకి పట్టు గురించి వేరే చెప్పనక్కరలేదు. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు. టీడీపీలో ఈ సీటు కోసమే గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావుల మధ్య తేడాలొచ్చాయి. అవంతి వైసీపీకి వెళ్లిపోయినా గంటా కూడా భీమిలీ నుంచి పోటీ చేయలేదు. ఆయన విశాఖ నార్త్ నియోజకవర్గానికి మారిపోయారు. దీంతో సబ్బంహరిపైనే భీమిలీ పార్టీ క్యాడర్ ఆశలు పెట్టుకుంది.

పూర్తిగా వదిలేయడంతో…..

అయితే ఆరు నెలల నుంచి సబ్బం హరి భీమిలి మొహమే చూడటంలేదు. విశాఖలో చంద్రబాబు జరిపిన సమీక్షలకు మాత్రం హాజరై వెళ్లిపోయారు. భీమిలీ నియోజకవర్గంలో నడిపించే నేత లేక పార్టీ కార్యక్రమాలు కూడా జరగడం లేదు. ఈ విషయాన్ని కొందరు టీడీపీ నేతలు చంద్రబాబుకు చెప్పినా సబ్బం హరిని తప్పించే ధైర్యం చంద్రబాబు చేయడం లేదంటున్నారు. సబ్బం హరి కూడా ఆరు నెలలే కదా? ఇంకా ముందు ముందు చాలా ఉంది అంటూ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. మొత్తం మీద సబ్బం హరి సైలెంట్ తో ఉన్న పార్టీ క్యాడర్ కూడా వైసీపీలోకి వెళ్లే అవకాశముందంటున్నారు. ఇప్పటికే కొందరు ఫ్యాన్ పార్టీ నీడకు చేరారు. సబ్బంహరిని నమ్ముకుంటే ఇక భీమిలీలో ఇంతే సంగతులంటన్నారు పార్టీ నేతలు.

Tags:    

Similar News