అవుట్ డేటెడ్ ఆర్టిస్ట్ అట

ఆయన ఓడిపోయి మూలన కూర్చుంటాడనుకుంటే అది తప్పుడు అభిప్రాయమే. ఆయనలోని రాజకీయం అలా కుదురుగా ఉండనివ్వదు కదా. ఒకనాడు కాంగ్రెస్ లో వైఎస్సార్ చలువతో అనేక పదవులు [more]

Update: 2019-09-03 13:30 GMT

ఆయన ఓడిపోయి మూలన కూర్చుంటాడనుకుంటే అది తప్పుడు అభిప్రాయమే. ఆయనలోని రాజకీయం అలా కుదురుగా ఉండనివ్వదు కదా. ఒకనాడు కాంగ్రెస్ లో వైఎస్సార్ చలువతో అనేక పదవులు నిర్వహించి జగన్ పక్కన కూడా నిలబడి సన్నిహితునిగా మెలిగిన ఆయన ఇపుడు అదే జగన్ కి బద్ద శత్రువుగా మారి ఎదురు నిలిచారు. అంతటితో ఆగితే బాగానే ఉంటుంది, కానీ వైజాగ్ ఆక్టోపస్ గా మారి జోస్యాలు చెప్పడం, రాజకీయ విశ్లేషకుడి అవతారం ఎత్తి వైసీపీ సర్కార్ కి మార్కులు వేయడంతోనే ఆ పార్టీ నేతలు మండిపోతున్నారు. ఇంతకీ ఆయనెవరంటే తాజా ఎన్నికల్లో భీమిలీ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ప్రస్తుత మంత్రి అవంతి శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయిన సబ్బం హరి. ఆయన నోరు ఆగదు, టీవీ ఛానళ్ళు కనబడితే అసలు మాటలు కూడా ఆపుకోలేరు, అందుకే జగన్ సర్కార్ కి సున్నా మార్కులు వేసేసి తనదైన హరికధలు చెప్పడం మొదలెట్టారు.

జగన్ ఫెయిల్ ట….

మూడు నెలల జగన్ పాలన మీద ఆయన కుండబద్దలు కొట్టారు. జగన్ అన్ని విధాలుగా ఫెయిల్ అయ్యారని, ఆయనకు పాలన చేతకాదని ఏవేవో అనేశారు. జగన్ ది చంద్రబాబుని వేధించే పాలన తప్ప అసలు నిజంగా పాలిస్తున్నారా అంటూ సబ్బం హరి సందేహం కూడా వ్యక్తం చేశారు. పాలనంటే కట్టడాలు కూల్చడం కాదంటూ ప్రజావేదిక కూల్చివేత మీద సెటైర్లు కూడా వేశారు. పోలవరం, అమరావతి రాజధాని మీద అవినీతి అసలు జరిగితే కదా నిరూపించేందుకు అంటూ జగన్ కే సవాల్ చేస్తున్నారు. జగన్ పాలన మీద మూడు నెలల్లోనే మోజు తీరిపోయిందని, ఆయన హామీలన్నీ నీటిబుడగలేనని కూడా సబ్బం హరి హాట్ కామెంట్స్ చేశారు. నవరత్నాలు అనడమే తప్ప అవి ఎక్కడ ఉన్నాయో వైసీపీ వారికైనా తెలుసా అంటూ సబ్బం హరి ప్రశ్నించడంతో వైసీపీ నేతలకు ఎక్కడ లేని కోపం వస్తోంది.

బాబు భజన చేసినా….

సబ్బం హరి అవుట్ డేటెడ్ ఆర్టిస్ట్ అంటున్నారు వైసీపీ నేతలు. బాబు చుట్టూ ఇపుడు ఎంత భజన చేసినా టీడీపీ అధికారంలోకి రాదు, సబ్బం హరికి కూడా చోటుందదు అని తీసిపారేస్తున్నారు. సెటిల్మెంట్లు చేసుకునే వీలు దక్కలేదన్న అక్కసుతోనే సబ్బం హరి ఈ రకంగా అంటున్నారని విశాఖ వైసీపీ నేత కొయ్య ప్రసాదరెడ్డి కౌంటరేశారు. ఇదే సబ్బం హరి జగన్ చుట్టూ తిరిగిన రోజులు మరచిపోయారా అని ఎద్దేవా చేస్తున్నారు. మూడు నెలలు కాలేదు కానీ కలుగుల్లో నుంచి బయటకు వచ్చి తమ్ముళ్ళు సౌండ్ చేస్తున్నారని, మళ్ళీ పసుపు పార్టీకి అధికారం దక్కుతుందన్నది కల్లేనని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే సబ్బం హరి మౌనం వీడి ఇపుడు మీడియా ముందుకు రావడం వెనక ఉనికి పోరాటమే ఉందని కూడా అంటున్నారు. వయసు ఏడు పదులకు చేరువైన ఈ వృధ్ధ రాజకీయ నేత లేటు టైంలో ఘాటు పోలిటిక్స్ లో ఎన్ని ట్రిక్స్ చేసినా ఆయనకు దక్కేది శూన్యమని కూడా అంటున్నారు. ఏదో సామెత చెప్పినట్లుగా ఆగని సబ్బం హరి నోరు మాత్రం టీడీపీ అనుకూల మీడియా కు మాత్రం బాగా ఉపయోగపడుతున్నారని అంటున్నారు. మొత్తానికి హరి కధలు మళ్ళీ మొద‌లెట్టేసిన సబ్బం హరి ఇకపై జగన్ జాతకాలు ప్రతీ రోజూ చెబుతారన్న మాటేగా.

Tags:    

Similar News