రైతు బంధు రాజకీయం....!

Update: 2018-05-11 15:30 GMT

జనాకర్షక పథకాల రూపకల్పనలో కేసీఆర్ దేశంలోని ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తాను చేపట్టే పథకము, చేసేపని ఇతర సీఎంలు ఇబ్బందిగానైనా అనుసరించకతప్పని అనివార్యత కల్పిస్తున్నారు. ఈకోవలో తాజా పథకం రైతుబంధు. సాగు చేసే రైతుకు పెట్టుబడిగా ఆర్థిక సాయం అందించాలన్నదే లక్ష్యం. పథకంలోని లోపాలు, ప్రతిపక్ష రాజకీయాలు వెరసి దీనిని కూడా వివాదాస్పదం చేస్తున్నాయి. గంపగుత్తగా మొత్తం రైతు కుటుంబాల ఓట్లు కొట్టేయాలని అధికారపక్షం భావిస్తుంటే లోపాల ప్రాతిపదికగా ఓట్ల బ్యాంకుకు చిల్లు పెట్టడమెలా అని ప్రత్యర్థి పక్షాలు ఎదురుచూస్తున్నాయి. ఏతావాతా రాజకీయ సేద్యంగా మారిన రైతుబంధు, సంక్షోభంలో ఉన్న వ్యవసాయరంగానికి ఏమాత్రం సాయం అందించినా గొప్ప విషయమే.

అన్నదాతకు ఆసరా...

రాజకీయాల సంగతి ఎలా ఉన్నప్పటికీ రైతుబంధు పథకం దేశంలోనే వినూత్నం. పెట్టుబడి కోసం ఎకరాకు ఒక్కో పంటకు నాలుగు వేల రూపాయలు అందివ్వడమనేది సన్నచిన్నకారు రైతులకు ఆసరా ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తంగా 58లక్షల మంది రైతులు, 1.43 కోట్ల ఎకరాల్లో పంటల నిమిత్తం 5వేల7వందల కోట్ల రూపాయల వరకూ పెట్టుబడిగా ఇస్తున్నారు. రుణాల ఊబిలో కూరుకుని అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. ఇందుకు ప్రధాన కారణం రుణ సంక్షోభం. తెచ్చిన అప్పులు తీర్చలేక ఆత్మాభిమానంతో ఆత్మహత్యలకు పాల్పడేది ఎక్కువగా రైతులే. పరువు, పరపతి వారిజీవితాలతో విడదీయలేని సంబంధాలు. ప్రభుత్వమిస్తున్న ఆసరా పెద్ద మొత్తం కాకపోయినప్పటికీ పంటవేసే కాలంలో కనీసం మూడో వంతు పెట్టుబడిగా ఉపయోగపడుతుందని రైతులు చెబుతున్నారు. దీంతోనే సమస్య పూర్తిగా పరిష్కారం కాదు. నిజానికి రైతు గట్టెక్కాలంటే గిట్టుబాటు ధర ఒక్కటే శరణ్యం. రైతుబంధు ప్రారంభసందర్బంగా గిట్టుబాటు కోసం కేంద్రంపై పోరాటం చేద్దామంటూ కేసీఆర్ చెప్పారు. నిజానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఈవిషయంలో చొరవ తీసుకుని కేంద్రం మెడలు వంచేందుకు ప్రయత్నిస్తే దేశవ్యాప్తంగా రైతులు స్వచ్ఛందంగానే ఆయనకు మద్దతు ప్రకటిస్తారు. నేషనల్ లీడర్ కావాలన్న ఆయన కల తక్షణం నెరవేరిపోతుంది. అయితే కేసీఆర్ బీజేపీతో పోరాటానికి సిద్దంగా లేరనేది రాజకీయ వర్గాల అభిప్రాయం. అందుకే రాజకీయంగా పార్టీలను ఫెడరల్ ఫ్రంట్ రూపంలో కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసేందుకు సాహసించడం లేదు. 15 వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలపై మౌనం వహించడమే ఇందుకు నిదర్శనమనే విమర్శలున్నాయి. అన్నదాతల విషయంలో కేంద్రాన్ని నిలదీసి పార్టీలను కూడగడితే రైతు సంఘాలు కూడా ముందుకొస్తాయి.

కౌలుదారుకు కుచ్చు టోపీ....

వ్యవసాయ క్షేత్రంలో ఆరుగాలం కష్టపడే కౌలు రైతుకు రైతుబంధు ఖాళీ చేతులు చూపుతోంది. నగరీకరణ వేగంగా జరుగుతున్న తెలంగాణలో ఎక్కువ భూములు కౌలుదారుల చేతిలోనే సాగవుతున్నాయి. ఉద్యోగాలు, పిల్లల చదువులు, వ్యాపారాల పేరిట చాలామంది పెద్ద రైతులు, మధ్యతరగతి రైతులు కూడా పట్టణం బాట పట్టారు. ఒకటిరెండు ఎకరాలు సొంతానికి ఉన్న చిన్న,సన్నకారు రైతులు ఇతరుల పొలాలను కూడా కౌలుకు తీసుకుని చేస్తున్నారు. వారు వ్యవసాయానికి పెట్టుబడే కాకుండా రైతులకు కౌలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రకృతి విపత్తుల కారణంగా వీరు తీవ్రంగా నష్టపోతున్నారు. భూయాజమాన్యం ఉన్న రైతు తన పంట వరకే దెబ్బతింటాడు. అదే కౌలు రైతు అప్పులు తెచ్చి మరీ భూయజమానికి చెల్లించాల్సి వస్తోంది. అటువంటి వారిని రైతు బంధు నుంచి పూర్తిగా మినహాయించడం ఆవేదన కలిగిస్తోంది. ఉద్యోగం చేసుకుంటూ ఊళ్లో పొలం ఉన్నవారికి ఎకరాకు ఏడాదికి ఎనిమిదివేలు ప్రభుత్వ సాయం అందుతుంది. కౌలు వస్తుంది. వారికి పెద్దగా కష్టం, శ్రమ ఉండదు. కానీ ఎండనక వాననక దుక్కి దున్ని సాగు చేసిన కౌలుదారుకు కష్టం, నష్టం మాత్రమే మిగులుతుంది. తాజాగా భూయాజమాన్య హక్కు గుర్తించిన దాదాపు 60 లక్షల మంది రైతులున్నారు. ఇందులో మూడోవంతు కౌలుదారులు. అంటే 20 లక్షల మంది వరకూ కౌలు రైతులు ఉంటారని రైతు సంఘాలు చెబుతున్నాయి. ఇందులో కొందరు సొంత పొలాలు ఉండి ఇతరుల భూములను సాగు చేస్తున్నవారు కూడా ఉంటారు. మొత్తమ్మీద ఈ కౌలు రైతులనే లక్ష్యంగా చేసుకుంటూ కాంగ్రెసు పార్టీ రాజకీయ చక్రం కదుపుతోంది. వీరి ఓట్లను తమ కాతాలో వేసుకోవాలని చూస్తోంది.

ప్రచార పటాటోపం...

పథకం సంగతెలా ఉన్నప్పటికీ ప్రచారం హోరెత్తిస్తోంది. జాతీయ నాయకునిగా ఎదగాలని ఆశిస్తున్న కేసీఆర్ రైతు బంధును ఒక సాధనంగా చేసుకోవాలని చూస్తున్నారు. దేశంలోనే ఈ పథకం కొత్తది కావడంతో వివిధ రాష్ట్రాల ప్రసార,ముద్రణ మాధ్యమాల్లోనూ పబ్లిసిటీకి కోట్ల రూపాయలు వెచ్చించేందుకు ఒక పథకం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు, ఆంగ్ల పత్రికల్లో కోట్ల రూపాయలతో ప్రకటనలు ఇచ్చేశారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా గుప్పించింది. ప్రకటనలకే వందకోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటూ ధ్వజమెత్తింది. నేషనల్ లీడర్ గా, మార్గదర్శిగా తనను ప్రొజెక్టు చేసుకునేందుకు కేసీఆర్ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల ప్రాంతీయ భాషల్లో సైతం వాణిజ్య ప్రకటనలు ఇచ్చేందుకు కొన్ని కన్సల్టెన్సీలను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. దేశంలో అత్యధిక ప్రజలు ఆధారపడిన వ్రుత్తి వ్యవసాయం. వారిని ఆకట్టుకొనే విధంగా , ఆలోచింప చేసే విధంగా తెలంగాణ పథకాలను ప్రచారంలోకి తెస్తే దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలపై ఒత్తిడి పెరుగుతుంది. వారంతా తనతో జత కడతారనే దూరాలోచన కూడా టీఆర్ ఎస్ అధినేతలో ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ఇంతవరకూ కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ యాత్రలు చేసినప్పటికీ ఆశించిన స్థాయి స్పందన లభించలేదు. రైతు బందు పథకాన్ని అంబాసిడర్ గా చేసుకుంటూ ప్రజాదరణతో ఇతర రాష్ట్రాల, పార్టీల అభిమానాన్ని చూరగొనాలనే వ్యూహంతో కేసీఆర్ ముందుకు కదులుతున్నారు. కేసీఆర్ పాల్గొన్న రైతుబంధు సభ నిజానికి ఎన్నికల ప్రచార సభను తలపింప చేసిందనే విమర్శలూ ఉన్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News