సంధితో సగం బలం

తిమ్మిని బమ్మి చేయడం అందరికీ చేతగాదు. తాను చెప్పిందే సరైనదని నమ్మించడమూ సాధ్యం కాదు. కొందరు మాత్రం ఈ కళలో ఆరితేరుతుంటారు. రాజకీయాల్లో అది అవసరం. భిన్నమైన [more]

Update: 2020-12-13 15:30 GMT

తిమ్మిని బమ్మి చేయడం అందరికీ చేతగాదు. తాను చెప్పిందే సరైనదని నమ్మించడమూ సాధ్యం కాదు. కొందరు మాత్రం ఈ కళలో ఆరితేరుతుంటారు. రాజకీయాల్లో అది అవసరం. భిన్నమైన డిమాండ్లు, నిత్య అసంతృప్తితో రగిలిపోయే ప్రజలను ఆకట్టుకుంటూ అనుకున్నది చేసుకుంటూ పోవడం చిన్నాచితక వ్యవహారం కాదు. దేశ రాజకీయాల్లో ఈవిషయంలో కేసీఆర్ ది ఒక అరుదైన రికార్డుగా చెప్పుకోవాలి. ప్రతిపక్షాలను డీల్ చేయడంలోనూ, కేంద్రంతో వ్యవహారాలు నడపటంలోనూ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ నేతలకు పాఠాలుగానే చెప్పుకోవాలి. నిన్నామొన్నటివరకూ విరుచుకుపడిన కేంద్రంతో సయోధ్య దిశలో కేసీఆర్ పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలో క్రమేపీ పుంజుకుంటున్న బీజేపీ దూకుడుని నియంత్రించడానికి దౌత్య మార్గం పడుతున్నట్లు కానవస్తోంది. పలితాల సంగతెలా ఉన్నప్పటికీ కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య గ్యాప్ లేదని చాటిచెప్పడానికి కేసీఆర్ ఢిల్లీ పర్యటన పరోక్ష దోహదకారిగా నిలుస్తోంది.

పొలిటికల్ మాస్టర్…

రాజకీయాల్లో మాస్టరీ చేసిన కేసీఆర్ తెలంగాణలో బీజేపీ బలపడుతున్న విషయాన్ని గ్రహించారు. టీఆర్ఎస్ సొంత శక్తి సామర్థ్యాలతో కమలం పార్టీకి అంత సులభంగా కళ్లెం వేయడం సాధ్యం కాదనేది నిజం. జాతీయంగా బలహీనపడి రాష్ట్రంలో క్రమేపీ తన ప్రాభవాన్ని కోల్పోతున్న కాంగ్రెసు ను నియంత్రించినట్లు బీజేపీని అదుపు చేయలేరు. సైద్ధాంతికమైన భూమిక, తాడో పేడో తేల్చుకోగలిగిన సత్తా బీజేపీకి నిండుగా ఉన్నాయి. పైపెచ్చు నాయకుల మధ్య విభేదాలు రోడ్డెక్కి పార్టీని వర్గాలుగా బలహీనపరిచే పరిస్థితి లేదు. ఇదే టీఆర్ఎస్ కు పరీక్షగా మారుతోంది. కాంగ్రెసుకి భస్మాసుర హస్తం పెట్టే నాయకుల కారణంగా ఆపార్టీ రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో పొలిటికల్ హరకిరి చేసుకుంటోంది. హైదరాబాద్ ఎన్నికల్లో అంతటి ఘోరపరాజయం తర్వాత కూడా రియలైజేషన్ కనిపించడం లేదు. ఈ దశలో భవిష్యత్తులో బీజేపీనే ప్రధాన ప్రత్యర్థిగా ఆవిర్భవించనుంది. దీనిని గ్రహించిన బీజేపీ నాయకులు మరింత చురుకుగా టీఆర్ఎస్ పై ఒత్తిడి పెంచే అవకాశాలున్నాయి. దీనికి విరుగుడు వ్యూహం రచించడంలో ప్రస్తుతం కేసీఆర్ బిజీ అయ్యారు. తొలి అయిదేళ్ల పాలనలో బీజేపీ కేసీఆర్ కు చక్కగా సహకరించింది. స్థానిక నాయకులు ఎంతగా ప్రయత్నించినా కమల వికాసం సాధ్య పడలేదు. ఇందుకు ప్రధాన కారణం కేసీఆర్ వ్యూహమే. కేంద్రంతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడంతో కేంద్రమంత్రులు కితాబులు ఇస్తూ వచ్చారు. ముందస్తు శాసనసభ ఎన్నికలకూ కేంద్రం సహకరించింది. అందువల్ల రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రజల్లో ఎంతగా మొత్తుకున్నా పట్టించుకునే నాథుడు కరవు అయ్యారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత తన సీటు కిందకే నీళ్లు వచ్చే ప్రమాదాన్ని గమనించి కేసీఆర్ బీజేపీపై దాడి చేయడం మొదలు పెట్టారు. దానికి కమలం పార్టీ దీటుగా బదులివ్వడం మొదలు పెట్టింది. ఇది శ్రుతి మించితే టీఆర్ఎస్ కు కొంతమేరకు నష్టం తప్పదు.

కేంద్రంతో సయోధ్య…

జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెసులను కంట్రోల్ చేయడానికి అప్పుడప్పుడూ మూడో ఫ్రంట్ ముచ్చటకు తెర తీస్తుంటారు కేసీఆర్. బీజేపీకి మొదట్లో ఇది కొంతమేరకు అనుకూలంగానే కనిపించింది. కాంగ్రెసు కూటమిలో తటస్థులు చేరకుండా కేసీఆర్ ఎత్తుగడలు పరోక్షంగా తమకు ఉపకరిస్తున్నాయని కమలనాథులు అంచనా వేస్తూ వచ్చారు. అయితే కేసీఆర్ పెట్టదలచుకున్న కుంపటి కింద సేదతీరేందుకు ఏ ఒక్క పెద్ద పార్టీ చేరకపోవడంతో టీఆర్ఎస్ ప్రాబల్యం ఏపాటిదో తేటతెల్లమై పోయింది. కేసీఆర్ పట్ల మెతకగా వ్యవహరిస్తూ తెలంగాణలో తమకున్న అవకాశాలను చేజార్చుకోకూడదని బీజేపీ అగ్రనాయకులు అవగాహనకు వచ్చారు. దాని ఫలితంగానే స్థానిక నాయకత్వానికి సంపూర్ణ స్వేచ్చనిచ్చారు. హైదరాబాద్ నగర నాయకుల గుప్పెట్లో లౌక్యంగా ఒదిగిపోతున్న కమలం పగ్గాలను దూకుడు కలిగిన ఉత్తర తెలంగాణ నాయకులకు అప్పగించారు. ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై చూసీచూడనట్లు పోతున్న బీజేపీ నాయకుల చాటుమాటు వ్యవహారాలకు చెల్లుచీటీ చెప్పేశారు. సమరమే అంటూ శంఖం పూరిస్తున్న నాయకుల హవా మొదలైంది. ఈ పోరాట పటిమే తెలంగాణలో అధికారపార్టీకి సవాల్ విసురుతోంది. రోజులు మారాయి. దీంతో కేసీఆర్ కు, టీఆర్ఎస్ కు.కేంద్రంతో సయోధ్య తప్పనిసరి అవసరంగా మారింది

ఆలోచన అటకెక్కినట్లే…

థర్డ్ ఫ్రంట్ పేరిట కేసీఆర్ చేసిన హడావిడి దాదాపు సద్దుమణిగినట్లే కనిపిస్తోంది. ప్రత్యర్థి బలాన్ని కుదించివేయాలంటే చెలిమి చేయడం ఒక ఎత్తుగడ. బీజేపీ బలపడే పరిస్థితులు కనిపించినప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అదే వ్యూహంతో రెండు సార్లు బీజేపీని రాష్ట్రంలో బలపడకుండా కట్టడి చేయగలిగారు. అయితే టీఆర్ఎస్ కు నేరుగా బీజేపీతో పొత్తు కుదుర్చుకుని పోటీ చేసే వెసులుబాటు లేదు. ప్రత్యర్థిగా మారింది. ఈ స్థితిలో అగ్రనాయకత్వంతో, కేంద్రంతో సన్నిహిత సంబంధాల ద్వారా రాష్ట్రంలో బీజేపీ పోరాటపటిమను కొంతమేరకు బలహీనపరచవచ్చు. ఈ పంథానే కేసీఆర్ ఎంచుకోబోతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తీవ్రమైన యుద్ధాన్ని ప్రకటించి వారం గడవకుండానే ఢిల్లీలో అగ్రనాయకులతో మంతనాల వెనక దాగిన రహస్యమిదే. ఏదేమైనప్పటికీ టీఆర్ఎస్ కు ఉన్న బలహీనత ఎంఐఎం తో దోస్తీ. అదే బీజేపీ బలం. ఈ రెండు శక్తుల మధ్య బ్యాలెన్స్ చేసుకుంటూ రాష్ట్రంలో తన పట్టు సడలకుండా చూసుకోవాలనేది కేసీఆర్ యోచన. నిజంగా ఇది కత్తిమీద సామే. అందుకే భవిష్యత్తులో కేసీఆర్ రాజకీయ గారడీలు చేయాల్సిన పరిస్థితి మరింతగా కనిపిస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News