అదే జరిగితే…?

తెలంగాణలో అసలే పెద్ద పండగ. 16 రోజులు వరుస సెలవులు. నగరం నుంచి లక్షలాది మంది ఈ సెలవుల్లో వారి వారి స్వగ్రామాలకు వెళ్తుంటారు. ఇందుకోసం ఆర్టీసీ [more]

Update: 2019-10-02 00:30 GMT

తెలంగాణలో అసలే పెద్ద పండగ. 16 రోజులు వరుస సెలవులు. నగరం నుంచి లక్షలాది మంది ఈ సెలవుల్లో వారి వారి స్వగ్రామాలకు వెళ్తుంటారు. ఇందుకోసం ఆర్టీసీ మూడువేల పైచిలుకు అదనపు బస్సులను సిద్ధం చేసింది. ఇప్పటికే రిజర్వేషన్లు జోరుగా సాగుతున్నాయి. కాని ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆర్టీసీ కార్మికులు నెలరోజుల క్రితం తమ సమస్యల పరిష్కారానికి సమ్మె నోటీసిచ్చారు. అయినా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదు. దీంతో అక్టోబర్ 5 నుంచి తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు సైరెన్ మోగించింది. మరి ప్రయాణికులు తమ గమ్యం చేరుకుంటారా….? ప్రభుత్వం దిగి చర్చలు జరుపుతుందా…?

సమ్మెకు సైరన్….

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో పాటు మరో 25 సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. అక్టోబర్ 5 నుంచి సమ్మె చేపట్టనున్నట్టు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మె చేస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల నెల రోజుల క్రితం నోటీసులు ఇచ్చినప్పటికీ.. యాజమాన్యం నుంచి స్పందన రాలేదు.

ప్రభుత్వ వైఫల్యమే…

బతుకమ్మ సీజన్లో ఆర్టీసీ సమ్మెకు పిలుపును ఇవ్వడంతో వివిధ జిల్లాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అయితే కార్మిక సంఘాలు మాత్రం ఆర్టీసీ నష్టాలకు, కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ వైఖరే కారణమని ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ.. ప్రభుత్వం వైఖరి కారణంగానే సమ్మెకు దిగాల్సి వస్తోందని కార్మిక నేతలు చెబుతున్నారు. 25 డిమాండ్లతో ఆర్టీసీలోని అన్ని సంఘాలు సమ్మెకు నోటీసులు ఇచ్చాయని వారు తెలిపారు.

తలలు పట్టుకుంటున్న అధికారులు

ఇప్పటికే ఆర్టీసీ అధికారులు గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 15వరకు అదనపు బస్సులను ఏర్పాటు చేసింది. దీనికి తోడు రెగ్యులర్ బస్సులు నడుస్తాయి. నగరంలోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్, జేబీఎస్, కూకట్ పల్లి, బి.హెచ్.ఇ.ఎల్ ప్రాంతాల నుంచి ఈ అదనపు బస్సులను నడుపుతోంది. నగరంలో ట్రాఫిక్ పరిస్థితి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. కాని ఇప్పుడు అధికారులకు ఏం చేయాలో తోచడం లేదు. 5వ తేదీ నుంచి కార్మిక సంఘాలు సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించడం పట్ల మరి ఆ రోజు నుంచి రిజర్వేషన్లు చేయాలా……? వద్దాననే మీమాంసలో పడ్డారు. వచ్చే ప్రయాణికులు కూడా మరి ఆ తేదీల్లో రిజర్వేషన్లు చేయాలానని అడిగినప్పటికి ఆర్టీసీ సిబ్బంది ఏ సమాధానం చెప్పడం లేదు. ప్రయాణికుల ప్రశ్నలకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ఎస్మాపెట్టినా….. ఉద్యమాన్ని తలుచుకోండి

ఆర్టీసీ సమ్మె పేరుతో ఇప్పటికే రాష్ట్రంలో హీట్ ఎక్కిపోయింది. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తాము వెనక్కి తగ్గేది లేదంటున్నారు. ఎస్మా ప్రయోగించినా తాము వెనుకాడేది లేదని కార్మిక సంఘాలు ప్రకటించాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలా పోరాటం చేశామో అలాగే పోరాటం చేయాలని, అప్పటి రోజులను గుర్తు చేసుకోవాలని జేఏసీ పిలుపిస్తోంది. దీంతో ఇటు సర్కారుకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఓ వైపు హుజూర్ నగర్ ఉప ఎన్నిక టెన్షన్ ఉంటే ఇటువైపు ఆర్టీసీ సమ్మె మరో సమస్యగా మారింది. అయితే మంత్రి వర్గ సమావేశంలో ఏమైనా పరిష్కారం లభించే అవకాశం ఉన్నట్లు ఆర్టీసీ కార్మికులు ఎదురు చూస్తున్నారు. సర్కార్ ఓ కమిటీని వేసి సమస్యను పరిష్కరిస్తామనే హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News