కుదరదంటున్న కేసీఆర్

చీటికి మాటికి కార్మికుల స‌మ్మెల వ‌ల్లే ఆర్టీసీకి న‌ష్టాలు వ‌స్తున్నాయి…. ఆర్టీసీ కార్మికులు ఆదాయానికి గండిపెడితే ఉద్యోగం నుంచి తొల‌గిస్తాం…. పన్నులు చెల్లిస్తూ ప్రైవేటు బస్సులు లాభాలు [more]

Update: 2019-10-04 09:30 GMT

చీటికి మాటికి కార్మికుల స‌మ్మెల వ‌ల్లే ఆర్టీసీకి న‌ష్టాలు వ‌స్తున్నాయి….

ఆర్టీసీ కార్మికులు ఆదాయానికి గండిపెడితే ఉద్యోగం నుంచి తొల‌గిస్తాం….

పన్నులు చెల్లిస్తూ ప్రైవేటు బస్సులు లాభాలు ఆర్జిస్తున్నాయ్……

మరి ఆర్టీసీకే ఎందుకు నష్టాలు వస్తున్నాయ్……..

ఈ మాటలన్నది ఎవరో కాదు సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. ఏడాది క్రితం ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె నోటీసిచ్చారు. దీంతో ఆర్టీసీ అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ మండిపడ్డారు. ఇట్లా చేస్తే ఎట్లా అంటూ హెచ్చరించారు. ఆర్టీసీ అభివృద్ధి గురించి అనేక సలహాలు, సూచనలు ఆ సమయంలో కేసీఆర్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నాగరాజు కమిటీని వేశారు.

మా నిర్ణయం అంతే….

మరి ఇప్పడు అదే పరిస్థితి. మళ్లీ ఆర్టీసీ కార్మిక నేతలు నెలరోజుల క్రితమే సమ్మె నోటీసు ఇచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధానమైన డిమాండ్ తో పాటు మొత్తం 25 సమస్యలను ఏకరువుపెట్టారు. నోటీసు అందుకుని 20 రోజులు దాటినా సర్కారు సమ్మె నోటీసుపై స్పందించలేదు. దీంతో ఆర్టీసీ అంటే ప్రభుత్వానికి కనపడడం లేదని కార్మికులు, జేఏసీ నేతలు లోలోనే మదనపడ్డారు. ఏదేమైనా సరే 5వ తేదీ నుంచి సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పండగ వేళైతేనే ఆర్టీసీ సిబ్బంది పని ఏంటో తెలుస్తుందని భావించారు. దసరా పండగకు లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో రాకపోకలు సాగిస్తారు. ఇదే సమయంలోనే సమస్యలను పరిష్కరించుకోవాలనుకున్నారు.

విలీనం కదరదు…?

గతంలో కేసీఆర్ ఆర్టీసీ సిబ్బందిపై చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయనకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని మాత్రం కనిపించడం లేదు. తరచూ సమ్మెలంటూ బెదిరిస్తున్నారా అంటూ కూడా గతంలో అధికారులతో కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలోనూ ఆర్టీసీ విలీనంపై మాత్రం ఏమి స్పందించలేదు. ఈ పండగ రద్దీని దాటించేందుకు మొక్కుబడిగా ముగ్గురు అధికారులతో కమిటీని నియమించారు. ఈ కమిటీ కార్మికుల సమస్యలు తెలుసుకుని నివేదిక ఇవ్వాలంటే సమయం పడుతుంది. అప్పటి వరకు చూద్దామన్నట్లే ఉంది సర్కారు. గతంలో జరిగిన సమావేశంలోనూ కేసీఆర్ రాష్ట్రంలో 95 డిపోల్లో 5 మాత్ర‌మే లాభాల్లో ఉండ‌డం సిగ్గు చేటని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కార్మికులు ఆర్టీసీని కాపాడేలా ప‌ని చెయ్యాలని కేసీఆర్ సూచించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించాలంటే కష్టమే.

ప్రైవేటుకే మొగ్గు…..

ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని కొంతకాలంగా వినిపిస్తోంది. అనేక సార్లు ఈ వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి. ఇదంతా కూడా ప్రభుత్వ వ్యూహమేనని తెలుస్తోంది. ముందు లీకులిస్తే ఆ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూసేందుకే అలా ప్రచారం జరిగిందని సమాచారం. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వం బెట్టుగా ఉండడంతో పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. సీఎం కేసీఆర్ సైతం ఢిల్లీలో ఉండడంతో సమస్యకు పరిష్కారం దొరికేలా కనిపించడం లేదు. చివరికి సర్కార్ ఎస్మా ప్రయోగించాలని చూస్తోంది. దానికి కూడా మేం సిద్దంగానే ఉన్నామని జేఏసీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఎన్నో అటుపోట్లు ఎదుర్కొన్నామని, ఇప్పుడు ఇది మాకో లెక్కానని చెబుతున్నారు. సో కేసీఆర్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఏ నిర్ణయం అనేది వెలువడనుంది.

 

 

Tags:    

Similar News