వాద్రాకు తప్పేట్లు లేదే....!!!

Update: 2018-12-17 16:30 GMT

గాంధీల కుటుంబం గారాల పట్టి ప్రియాంక గాంధీని పెళ్లి చేసుకోక ముందు రాబర్ట్ వాద్రా ఎవరో? ఏమిటో? ఎక్కడి వారో ఎవరికీ తెలియదు. వ్యాపార ప్రపంచంలోనూ కొద్దిమందికి మాత్రమే తెలుసు. ప్రియాంకను పెళ్లాడాక ఒక్కసారిగా వార్తల్లోని వ్యక్తిగా మారారు. అప్పట్లో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేసిన సోనియా గాంధీ అల్లుడయ్యాక అత్యంత ప్రముఖ వ్యక్తి అయ్యారు. దీంతో రాజకీయ ప్రపంచంలో ఆయన పేరు తారాజువ్వలా వెలుగొందారు. ముఖ్యంగా యూపీఏ అధికారంలో ఉన్న 2004 నుంచి 2014 మధ్య పదేళ్ల కాలంలో వాద్రా ఒక వెలుగు వెలిగారు. ఆయన వ్యాపారం విస్తృతమైంది.

వాద్రా కార్యాలయాలపై....

ప్రియాంకను పెళ్లాడక వాద్రాకు ఎంత పేరు ప్రతిష్టలు వచ్చాయో రాజకీయంగా ఆయనకు ఇబ్బందులూ ఎదురయ్యాయి. కాంగ్రెస్ ను, సోనియా, రాహుల్ గాంధీలను విమర్శించడానికి వాద్రా ఒక ఆయుధంగా మారారు. ఆయన చేసే వ్యాపారం కూడా విమర్శలకు ఒక అవకాశంగా మారింది. ముఖ్యంగా 2014 లో ఏన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హస్తం పార్టీకి కష్టాలు అటుంచితే వాద్రాకు మాత్రం వెతలు మొదలయ్యాయి. ఈడీ నోటీసులు, దాడులతో సతమతమవుతున్నారు. ఈడీ ప్రశ్నల పరంపరకు సమాధానాలు చెప్పలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సన్నిహితులే టార్గెట్ గా.....

తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వాద్రా వ్యాపార సంస్థలు, కార్యాలయాలపై దాడులు, ఆయన అనుచరులు, స్నేహితుల అరెస్టులు ఇంటరాగేషన్ తో సంచలనం సృష్టించింది. వాద్రా ముగ్గురు సన్నిహితులయిన జగదీశ్ శర్మ, మనోజ్ అరోరా, రమేశ్ శర్మతో పాటు మరో స్నేహితుడి ఇంటిలో ఈడీ సోదాలు జరిపింది. జగదీశ్ శర్మను రోజంగా ఈడీ అధికారులు ప్రశ్నించారు. అనేక అంశాలకు సంబంధించి సమాధానాలను అతని నుంచి రాబట్టారు. చివరకు విడిచి పెట్టారు. మిగిలిన ముగ్గురిని కూడ వివిధ కోణాల్లో ప్రశ్నించి సమాచారం రాబట్టారు. వాద్రా అక్రమార్జనకు పాల్పడినట్లు, విదేశాల్లో అక్రమ ఆస్తులు సంపాదించినట్లు వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా ఈడీ అధికారులు తమపై ఒత్తిడి తెచ్చినట్లు వారు చెబుతున్నారు. మరోపక్క వాద్రా విషయంలో చట్టబద్దంగానే వ్యవహరించామని, తమపై ఎలాంటి వత్తిడులు లేవని ఈడీ అధికారులు ప్రకటించారు.

కుంభకోణంకేసులను....

మనీ లాండరింగ్ చట్టం నిబంధనల మేరకు సోదాలు నిర్వహించామని, సెర్చ్ వారెంట్లతో వెళ్లి ఢిల్లీ, బెంగళూరులోని కార్యాలయాల్లో తనిఖీలు చేసినట్లు చెబుతోంది ఈడీ. మనీ ల్యాండరింగ్ ఆరోపణలతో కూడిన రాజస్థాన్ లోని బిక్ నేర్ కుంభకోణం కేసు, పరారీలో ఉన్న ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ కేసులకు సంబంధించి గతంలో దాఖలైన రెండు అభియోగ పత్రాల ఆధారంగా సోదాలు చేశారు. బిక్ నీర్ వద్ద రక్షణ శాఖ భూమి కొనుగోలు, అమ్మకం కుంభకోణం కేసులో వద్రాకు సంబంధించిన స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థ, దాని అధికారులను ఈడీ ప్రశ్నించింది. రక్షణ ఒప్పందాలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు, ఐటీ శాఖల ఫిర్యాదుల మేరకు 2016లో ఈడీ కేసులు నమోదు చేసింది. అప్పట్లో భండారీ కార్యాలయానికి సంబంధించి తనిఖీలు నిర్వహించగా కొన్ని కీలక అధికారిక రక్షణ పత్రాలు లభించాయి. వాద్రాకు సంబంధించిన వివరాలు గల మెయిల్స్ ను సోదాల్లో గుర్తించారు. అయితే లండన్ ఆస్తులకు సంబంధించి తనకు ఎటువంటి సంబంధం లేదని వాద్రా పేర్కొంటున్నారు. అదే విధంగా ఆయుధ వ్యాపారి భండారీతోనూ ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు.

వాద...ప్రతివాదనలు.....

ఒక పక్క ఈడీ దాడులు, వాద్రా సంస్థ వివరణలను పక్కన పెడితే ఈ విషయం రాజకీయంగా సంచలనాన్ని సృష్టించింది. పెను దుమారాన్ని రేపింది. మోదీ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా దాడులకు దిగుతోందని కాంగ్రెస్ అగ్రనేతలు కపిల్ సిబాల్, అహ్మద్ పటేల్, రణదీప్ సుర్జేవాలా, అభిేషేక్ మను సింఘ్వీలు ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులైన సోనియా, రాహుల్ గాంధీలను నేరుగా ఢీకొనలేక, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా పెట్టుకుని వ్యవహరిస్తోందన్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే దాడులకు దిగిందని వారు ఆరోపిస్తున్నారు. వాద్రాను కాపాడుకునేందుకు, ఆయన చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు హస్తం పార్టీ ఎదురుదాడి చేస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి సుభిల్ పాత్ర, జాతీయ కార్యదర్శి తరుణ్ భుగ్ స్పష్టం చేశారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నప్పటికీ వ్యక్తుల లక్ష్యంగా కాకుండా, వ్యాపారాల ప్రాతిపదికగా దాడులు చేస్తే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు. చట్టం ముందు అందరూ సమానులే. అదే సమయంలో చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఆమోదనీయం కాదు. ఇంత సమతుల్యంగ ఆలోచించే పరిస్థితి నేడు ఉందా? అన్నదే అసలు ప్రశ్న.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News