రోజా..ఆగ్రహం తగ్గలేదట…ఎందుకంటే?

నగరి నియోజకవర్గంలో వైసీపీలో నెలకొన్న విభేదాలు సమసిపోతాయా? స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తలెత్తిన పరిణామాలను పార్టీ హైకమాండ్ సరిచేస్తుందా? ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. నగరి [more]

Update: 2020-03-23 06:30 GMT

నగరి నియోజకవర్గంలో వైసీపీలో నెలకొన్న విభేదాలు సమసిపోతాయా? స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తలెత్తిన పరిణామాలను పార్టీ హైకమాండ్ సరిచేస్తుందా? ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. నగరి నియోజకరవర్గం వైసీపీలో రెండు గ్రూపులు మొదలయ్యాయి. ఒకటి ఎమ్మెల్యే ఆర్కే రోజా వర్గం కాగా, మరొకటి వ్యతిరేకవర్గం. రోజా రెండోసారి గెలిచిన తర్వాత తన వర్గాన్ని పటిష్టం చేసుకునే పనిలో పడ్డారు. ఇది వైరి వర్గం వారికి రుచించలేదు.

వైరివర్గానికి….

వారంతా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆశ్రయించారు. తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలా సహకరిస్తారని రోజా ప్రశ్నిస్తున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో కూడా ఇబ్బంది ఏర్పడింది. కొన్ని స్థానాలు తన వ్యతిరేక వర్గానికి కేటాయించడంతో రోజా మండి పడుతున్నారు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారికి అండగా ఉండటంతో ఎవరూ ఏమీ అనలేకపోయారంటారు.

శాంతపర్చే ప్రయత్నాలు…..

తాజాగా ఆర్కే రోజాను శాంతపర్చడానికి సీనియర్ నేతలు ఆమె ఇంటికి వెళ్లారు. మంత్రి నారాయణస్వామితో పాటు భూమన కరుణాకర్ రెడ్డి స్వయంగా వెళ్లి రోజాతో చర్చలు జరిపారు. ఇందులో ఎవరి ప్రమేయం ఉండదని, పార్టీకోసం పనిచేసిన వారికి మాత్రమే గుర్తింపు లభించిందని వారు వివరించబోయారు. అయితే రోజా మాత్రం ససేమిరా అన్నారట. తనను అవమానించే విధంగా ఇక్కడ రాజకీయాలు జరుగుతున్నాయని ఒకింత ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.

జగన్ వద్దకే పంచాయతీ…..

తాను జగన్ వద్దనే విషయం తేల్చుకుంటానని కూడా రోజా చెప్పినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర నియోజకవర్గాల నాయకులు, మంత్రుల పాత్ర ఎందుకని రోజా ఎదురు ప్రశ్నించారట. దీంతో సమాధానపర్చాలని వెళ్లిన మంత్రి నారాయణస్వామి, భూమన కరుణాకర్ రెడ్డి తెల్లమొహం వేశారంటున్నారు. తాను ఎవరితో మాట్లాడాల్సిన పనిలేదని, జగన్ సమక్షంలోనే తాను తేల్చుకుంటానని రోజా కుండబద్దలు కొట్టడంతో వారు వెనుదిరగక తప్పలేదంటున్నారు. మొత్తం మీద నగరి రాజకీయాలు జగన్ కు తలనొప్పిగా మారే అవకాశముంది.

Tags:    

Similar News