రఫ్ఫాడిస్తుంది అందుకేనట

వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజాతో పెట్టుకుంటే ఎంతటి నాయకుడికైనా ఇంతే సంగతులు అన్నది తెలిసిందే. సినిమాల్లో క్లాస్ మాస్ రోల్స్ వేసిన రోజా రాజకీయాల్లో మాత్రం [more]

Update: 2019-12-14 13:30 GMT

వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజాతో పెట్టుకుంటే ఎంతటి నాయకుడికైనా ఇంతే సంగతులు అన్నది తెలిసిందే. సినిమాల్లో క్లాస్ మాస్ రోల్స్ వేసిన రోజా రాజకీయాల్లో మాత్రం తనదైన స్టయిల్లోనే దూకుడుగా వెళ్తున్నారు. రోజాలోని ఫైర్ ని మొదట చంద్రబాబే గుర్తించారు. ఆమెను తెలుగు మహిళా ప్రెసిడెంట్ ని చేసి ఏపీ అంతటా తిప్పారు. అప్పట్లో వైఎస్సార్ సర్కార్ కి ఎదురు నిలిచి ఘాటైన కామెంట్స్ చేయడం ద్వారా కాంగ్రెస్ కి కొరకరాని కొయ్యగా రోజా మారారు. రెండు మార్లు టీడీపీ నుంచి పోటీ చేసినా గెలవని రోజా 2009 ఎన్నికల తరువాత వైఎస్సార్ చెంతకు చేరారు. అయితే ఆయన దుర్మరణంతో సంభవించిన పరిణామాల నేపధ్యంలో ఆమె జగన్ వైపుకు వచ్చేశారు. 2014, 2019 ఎన్నికల్లో వరసగా గెలిచిన రోజా రెండు దశాబ్దాల రాజకీయ జీవితానికి ప్రతిఫలంగా జగన్ మంత్రివర్గంలో మంత్రి కావాలని గట్టిగా కోరుకున్నారు.

ఆ హోదాయే అడ్డా …..

అయితే జగన్ సామాజిక సమీకరణల నేపధ్యంతో పాటు చిత్తూరు జిల్లాలో ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకుని రోజాకు మంత్రి అవకాశం ఇవ్వలేకపోయారు. దాంతో క్యాబినెట్ ర్యాంక్ కలిగిన ఏపీఐఐసీ చైర్ పర్సన్ ని చేశారు. ఈ హోదాతో రోజా హ్యాపీగానే ఉన్నారని అనుకున్నారు. కానీ ఆమె మాత్రం పూర్తిగా సైలెంట్ గా మారారు. ఏపీలో ఓ వైపు చంద్రబాబు, మరో వైపు పవన్ కళ్యాణ్ జగన్ మీద రెచ్చిపోతున్నా ఫైర్ బ్రాండ్ నోటి వెంట నుంచి ఒక్క మాట కూడా రాలేదు. దాంతో రోజా అలిగారని అంతా అనుకున్నారు. రోజా సైతం ఈ మధ్యలో పార్టీలో హల్ చల్ చేయడం తగ్గించారు. అయితే చిత్రంగా ఆమె అసెంబ్లీలో పెద్ద నోరు చేసుకుని చంద్రబబు బ్యాచ్ ని కట్టడి చేయడంతో ట్రాక్ లో పడిందని అంటున్నారు.

జగనే అలా చెప్పారా…?

రోజాకి కీలకమైన పదవిని అప్పగించిన జగన్ ఆమెని కొంతవరకూ తగ్గి ఉండమని స్వయంగా సూచించారని అంటున్నారు. ప్రభుత్వ పదవిలో ఉంటూ ఏది మాట్లాడినా అది జగన్ సర్కార్ మీదకే వస్తుంది కాబట్టి జాగ్రత్తగా నడచుకోవాలని అందరితో పాటుగానే రోజాకు కూడా అదేశాలు వెళ్ళాయని చెబుతున్నారు. దాంతో రోజా తన నోరు కుట్టేసుకున్నారని అంటున్నారు. లేకపోతే పవన్, బాబు లను ఆమె ఎప్పటిమాదిరిగానే రఫ్ఫాడించేదని కూడా వైసెపీ వర్గాలు భోగట్టా. ప్రభుత్వంలో ఉన్నపుడు కొంత బాధ్యత అవసరమని జగన్ చెబితే రోజా పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారని కూడా సొంత పార్టీ నుంచే ఇన్నాళ్ళుగా సెటైర్లు పడుతూ వచ్చాయి.

ఆదుకుంటారా….?

మాట్లాడవద్దు అంటే నోటికి ఎంత వస్తే అంత అన్నట్లుగా మాట్లాడవద్దు అని అర్ధమని వైసీపీ నేతలు అంటున్నారు. దీన్ని రోజాతో సహా చాలా మంది పెద్ద నాయకులు వేరేలా అర్ధం చేసుకుని అసలు మీడియా ముందుకే రావడం తగ్గించేశారని, దాంతో గత ఆరు నెలలుగా వైసీపీ మీద జనసేన, టీడీపీ దాడి ఎక్కువైపోయిందని కూడా విశ్లేషిస్తున్నారు. ఫలితంగా వైసీపీ అన్ని మంచి పనులు చేస్తున్నా జనంలోకి వెళ్ళలేకపోతున్నాయన్న బాధ ప్రభుత్వ పెద్దల్లో ఉంది. ఇపుడు రోజా అసెంబ్లీలో పదునైన మాటల దాడితో ఫాంలోకి వచ్చారని, ఇదే విధంగా ఆమె ప్రతిపక్షాలను కంట్రోల్ చేస్తూ వాస్తవాలు జనాలకు చెప్పగలిగితే జగన్ సర్కార్ కి మేలు జరుగుతుందని అంటున్నారు. మరి ఈ పొలిటికల్ హీట్ ని రోజా అసెంబ్లీ బయట కూడా కంటిన్యూ చేస్తారా అన్నది చూడాలి.

Tags:    

Similar News