గాజువాకే మహా రాజుట…?

గాజువాక అన్నది రెండు దశాబ్దాల క్రితం ఎవరికీ పెద్దగా పట్టని ప్రాంతం. అప్పట్లో ఒక సినిమాలో గాజువాక పిల్లా మేము గాజులోళ్ళం కాదా అంటూ వచ్చిన పాటతో [more]

Update: 2021-02-07 14:30 GMT

గాజువాక అన్నది రెండు దశాబ్దాల క్రితం ఎవరికీ పెద్దగా పట్టని ప్రాంతం. అప్పట్లో ఒక సినిమాలో గాజువాక పిల్లా మేము గాజులోళ్ళం కాదా అంటూ వచ్చిన పాటతో ఈ ప్రాంతం ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలకు తెలిసిపోయింది. ఆ తరువాత 2009 ఎన్నికల నాటికి ఏకంగా గాజువాక నియోజకవర్గం కూడా అయింది. అంతేనా. ఇక్కడ నుంచి తొలి ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం తరఫున అభ్యర్ధి ఎమ్మెల్యే అయి జెండా ఎగరేశాడు. 2019 నాటికి ఇక్కడ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన తరఫున పోటీ చేయడంతో మరో మారు రాష్ట్ర రాజకీయాల్లో టాప్ లెవెల్ డిస్కషన్ గా మారింది.

డబ్బున్న ప్రాంతం….

ఇపుడు గాజువాకకు ఈ కీర్తిని మించి మరోటి వెంట వచ్చింది. అదే లక్ష్మీ కళ. గాజువాకను మించిన ధనిక నియోజకవర్గం ఏపీలోని మొత్తం 175 నియోజకర్వగాల్లో లేదుట. ఈ లెక్కలను ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే తాజాగా తేల్చింది. రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా అభివృద్ధి ప్రణాళికలను ప్రభుత్వ నివేదిక ఒకటి తాజగా వెల్లడించింది. దాని ప్రకారం చూస్తే గాజువాకను మించిన రిచెస్ట్ నియోజకవర్గం వేరే లేదని కూడా వెల్లడైందిట. గాజువాక తలసరి ఆదాయం రెండు లక్షల 68 వేల 332 రూపాయలుగా ఉందని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

రాజధాని వెనకడుగే….?

ఇక ఏపీలో మూడు రాజధానుల వివాదం ఓవైపు ఉంది. ఇప్పటికైతే అమరావతినే రాజధానిగా అంతా భావిస్తున్నారు. మరి ఆ రాజధాని పరిధిలోని వచ్చే కృష్ణా జిల్లాలోని తూర్పు నియోజకవరం తలసరి ఆదాయం చూస్తే లక్షా 22 వేల 773 రూపాయలు మాత్రమేనట. ఇక విశాఖను పాలనారాజధాని అని జగన్ అంటున్నారు. మరి విశాఖ వాసుల తలసరి ఆదాయం చూసినా లక్షా 24 వేల 171 దగ్గర ఆగిపోయింది. అదే సమయంలో ఉత్తరాంధ్రాలో అత్యంత వెనకబడిన విజయనగరం జిల్లా తలసరి ఆదాయంలో అట్టడుగున ఉండడం గమనార్హం. కేవలం 76 వేల 621 రూపాయలుగా విజయనగరం జిల్లా వాసుల తలసరి ఆదాయం ఉంది. దీంతో అసలైన తలమానికం అంటే గాజువాకేనని అంతా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది.

అదే వరమా…?

గాజువాక విశాఖ శివారు ప్రాంతంగా మొదట్లో చెప్పుకునేవారు. ఇపుడు ఆదాయవనరులు అక్కడ బాగా పెరిగాయి. అనేక కేంద్ర రాష్ట్ర పరిశ్రమలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక ప్రైవేట్ పరిశ్రమలకు లెక్కలేనే లేదు. ఇక్కడ వలస కూలీల ఆదాయమే నెలకు నలభై వేల దాకా వస్తుంది అంటే ఎంత రిచెస్ అన్నది అర్ధం చేసుకోవాల్సిందే. అన్ని పరిశ్రమల సమాహారంగా ఉన్న గాజువాక విశాఖకు గట్టి పోటీని ఇవ్వడమే కాదు, భవిష్యత్తులో మరో నగరంగా మారినా కూడా ఆశ్చర్యం లేదని అంటున్నారు. మొత్తానికి విశాఖను రాజధాని నగరంగా చేసినా కూడా ఆదాయం మాత్రం గాజువాకే సమకూర్చాలన్నది తేలిపోయిన సత్యం. అందుకే గాజువాకది మహారాజయోగం అంటున్నారు.

Similar News