రేవంత్ ఆయన వైపే మొగ్గు చూపుతున్నారట

కొత్తగా పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి రానున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక సవాల్ గా మారిందనే చెప్పాలి. ఇక్కడ కాంగ్రెస్ ను గట్టెక్కించాలన్న పట్టుదలతో [more]

Update: 2021-08-13 09:30 GMT

కొత్తగా పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి రానున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక సవాల్ గా మారిందనే చెప్పాలి. ఇక్కడ కాంగ్రెస్ ను గట్టెక్కించాలన్న పట్టుదలతో రేవంత్ రెడ్డి ఉన్నారు. పీసీసీ చీఫ్ పదవి చేపట్టిన వెంటనే తొలుత హుజూరాబాద్ పైనే ఆయన దృష్టి పెట్టారు. అక్కడ పార్టీకి ఇబ్బందిగా మారిన కౌశిక్ రెడ్డిని వదిలించుకున్నారు. కౌశిక్ రెడ్డి లోపాయికారీగా టీఆర్ఎస్ తో ఒప్పందం కుదుర్చుకున్నారన్న అనుమానం రేవంత్ రెడ్డికి తొలి నుంచి ఉంది.

పొన్నం పేరును….

అందుకే అదను చూసి ఆయనపై రేవంత్ రెడ్డి వేటు వేశారు. ఇప్పుడు హుజూరాబాద్ లో కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంది. ఇందుకోసం పొన్నం ప్రభాకర్ పేరును సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అదే జిల్లాకు చెందిన పొన్నం ప్రభాకర్ ఎంపీగా అందరికీ పరిచయమే. బీసీ నేత కావడం, యూత్ కాంగ్రెెస్ నుంచి పొన్నం ప్రభాకర్ పనిచేయడంతో కాంగ్రెస్ పార్టీలో జిల్లా అంతటా విస్తృతమైన పరిచయాలున్నాయి.

బీసీ అభ్యర్థిగా…?

బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ బలమైన అభ్యర్థి కావడంతో పొన్నం ప్రభాకర్ అయితేనే బెస్ట్ అన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి హుజూరాబాద్ లో పటిష్టమైన ఓటు బ్యాంకు ఉంది. దీంతో పాటు పొన్నం ప్రభాకర్ వ్యక్తిగత ఇమేజ్ కూడా తోడయితే ఖచ్చితంగా కాంగ్రెస్ కు లాభం చేకూరుతుందన్న లెక్కలు రేవంత్ రెడ్డి వేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ గౌడ కులానికి చెందిన వారు కావడం కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

సర్వే తర్వాత…?

అయితే ఇప్పటి వరకూ పొన్నం ప్రభాకర్ నే హుజూరాబాద్ అభ్యర్థిగా పోటీ చేయించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీంతో పాటు సర్వేలు కూడా ప్రత్యేకంగా చేయిస్తుండటంతో అభ్యర్థి ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు. పార్టీ హైకమాండ్ కూడా పీసీసీకే అభ్యర్థి ఎంపిక బాధ్యతను అప్పజెప్పింది. దీంతో రేవంత్ రెడ్డి పరిశీలనలో అనేక పేర్లు ఉన్నప్పటికీ పొన్నం ప్రభాకర్ పేరును ఆయన ఫైనల్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Tags:    

Similar News