రేవంత్ వారికి టార్గెట్ అయ్యారా?

కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి మామూలే. ఎప్పుడూ అది మండుతూనే ఉంటుంది. హైకమాండ్ ఎన్ని సూక్తులు చెప్పినా అసంతృప్తి మాత్రం ఆగదు. అది కాంగ్రెస్ నైజం. తాజాగా రేవంత్ [more]

Update: 2021-07-23 11:00 GMT

కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి మామూలే. ఎప్పుడూ అది మండుతూనే ఉంటుంది. హైకమాండ్ ఎన్ని సూక్తులు చెప్పినా అసంతృప్తి మాత్రం ఆగదు. అది కాంగ్రెస్ నైజం. తాజాగా రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని పైకి నేతలు ఆమోదించినట్లే కనపడుతున్నా లోలోపల మాత్రం కోపంతో రగిలిపోతున్నారు. ప్రధానంగా జీవన్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క లాంటి నేతలు రేవంత్ రెడ్డికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.

రేవంత్ కు ఇవ్వడంతో….?

కాంగ్రెస్ లో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ వారిని కాదని మూడున్నరేళ్ల క్రితం పార్టీ కండువా కప్పుకున్న రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చారు. ఆయన సమర్థతపై హైకమాండ్ అంత నమ్మకం ఉంచింది. దీనిని సీనియర్ నేతలు సహించలేకపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా తాము పార్టీనే నమ్ముకుని ఉన్నా సీనియారిటీని కూడా హైకమాండ్ ను పరిగణనలోకి తీసుకోలేదన్న ఆగ్రహం వారిలో ఉంది.

సీనియర్ నేతలు….

వీరిలో జీవన్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సయితం రేవంత్ రెడ్డికి సహకారం అందించే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డిపై టీడీపీ ముద్ర ఉందని, ఓటుకు నోటు కేసులో అధికార పార్టీ నేతలు చేసే విమర్శలకు సయితం కౌంటర్ ఇచ్చే పరిస్థితుల్లో లేమని వారు ఇప్పటికే హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. రేవంత్ పై ఈ విమర్శలకు కనీసం ఒక్క నేత కూడా స్పందించలేదు.

జీవన్ రెడ్డిలో అసహనం…..

జీవన్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేయాలని తొలుత భావించింది. కానీ సాగర్ ఉప ఎన్నికల తర్వాత ఆలోచనను మార్చుకుంది. తనకు చీఫ్ పదవి కావాలని ఎవరు కోరారని? వారే అంతా ప్రచారం చేసి చివరి నిమిషంలో ఇలా చేస్తారా? అని ఆయన ఆగ్రహంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి కూడా హాజరుకాలేదు. రేవంత్ రెడ్డి గతంలో టీడీపీలో ఉన్న నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారని మల్లు భట్టి విక్రమార్క భావిస్తున్నారు. తనకు పార్టీలో ప్రత్యర్థి అయిన రేణుకా చౌదరిని యాక్టివ్ చేయాలన్న రేవంత్ రెడ్డి ప్రయత్నాన్ని మల్లు భట్టి విక్రమార్క తిప్పి కొట్టాలని చూస్తున్నారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి పైకి కన్పిస్తున్నంత కంఫర్ట్ గా లేరు. మరి రాబోయే రోజుల్లో రేవంత్ కు సొంత పార్టీ నేతల నుంచే ఇబ్బందులు తలెత్తే అవకాశముంది.

Tags:    

Similar News