సర్వే తర్వాతనే అభ్యర్థి ఎవరనేది?

హుజూరాబాద్ ఉప ఎన్నిక కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారనుంది. ఇటీవల పీసీసీ చీఫ్ గా బాధ్యతలను చేపట్టిన రేవంత్ రెడ్డి ఈ ఉప ఎన్నిక మరింత ప్రిస్టేజ్ [more]

Update: 2021-07-21 11:00 GMT

హుజూరాబాద్ ఉప ఎన్నిక కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారనుంది. ఇటీవల పీసీసీ చీఫ్ గా బాధ్యతలను చేపట్టిన రేవంత్ రెడ్డి ఈ ఉప ఎన్నిక మరింత ప్రిస్టేజ్ కానుంది. అందుకే ఈ ఉప ఎన్నికపై రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఒక సంస్థ చేత సర్వే చేయిస్తున్నారని తెలిసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందన్న దానిపై ఆయన సర్వే చేయిస్తున్నారని సమాచారం. ఒక ప్రముఖ మీడియా సంస్థ ఈ సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఇప్పటికే బీజేపీ అభ్యర్థి గా ఈటల రాజేందర్ ఖరారయ్యారు. టీఆర్ఎస్ తరుపున ఎవరనేది తేలలేదు. వివిధ పేర్లను సామాజికవర్గాల వారీగా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలిస్తున్నారని చెబుతున్నారు.

కౌశిక్ రెడ్డిపై…..

అయితే గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి డిపాజిట్లు కూడా రాలేదు. కాంగ్రెస్ రెండో ప్లేస్ లో నిలిచింది. గత ఎన్నికల్లో పాడె కౌశిక్ రెడ్డి ఈటల రాజేందర్ క గట్టి పోటీయే ఇచ్చారు. ఈసారి కూడా తానే బరిలో ఉంటానని ఆయన చెబుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి రావడంతో కౌశిక్ రెడ్డి వాయిస్ కొంత తగ్గింది. కౌశిక్ రెడ్డి అనుచరులు ఇప్పటికే టీఆర్ఎస్ లోకి వెళ్లారు. ఆయన కూడా టీఆర్ఎస్ లోకి వెళతారన్న ప్రచారం జరుగుతోంది. కొంతకాలం క్రితం కేటీఆర్ తో ఆయన జరిపిన చర్చలు కూడా వివాదమయ్యాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచకుని కౌశిక్ రెడ్డిని అభ్యర్థిగా చేసే విషయంలో రేవంత్ రెడ్డి అంత సుముఖంగా లేరని తెలుస్తోంది.

మరొకరిని బరిలోకి….

కౌశిక్ రెడ్డి మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమీప బంధువు కూడా కావడం విశేషం. కౌశిక్ రెడ్డి కాకుంటే మరెవరిని బరిలోకి దింపాలన్నదానిపై కాంగ్రెస్ నేతల్లో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వం పట్ల పొన్నం ప్రభాకర్ వంటి నేతలు కూడా సుముఖంగా లేరు. అందుకే సర్వే నివేదికల ద్వారా అభ్యర్థిని ఎవరో నిర్ణయించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. కాంగ్రెస్ గత ఎన్నికల ఫలితాల కంటే ఏమాత్రం తగ్గకుండా ఉండేలా వ్యూహ రచనలను చేస్తున్నారు. ఈటల రాజేందర్ బలమైన నేత కావడంతో ఎవరిని పోటీకి దింపితే బాగుంటుందన్న దానిపై ఆ జిల్లా నేతలతో రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు.

ఆ తర్వాతే…?

దీంతో పాటు టీఆర్ఎస్ అభ్యర్థి సామాజికవర్గాన్ని బట్టి కాంగ్రెస్ కూడా అభ్యర్థిని నిర్ణయించే అవకాశముంది. జిల్లా నేతలను సమన్వయం చేసుకుంటూ లోకల్ నాయకుల అభిప్రాయం మేరకు అభ్యర్థిని నిర్ణయించాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఏమాత్రం పరువు పోయినా తన ఇమేజ్ కూడా డ్యామేజీ అవుతుందని రేవంత్ రెడ్డి ఆలోచన. అందుకే హుజురాబాద్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. సర్వే నివేదికలు అందిన తర్వాతనే హుజారాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది తేలనుంది.

Tags:    

Similar News