రేవంత్ నాయకత్వాన్ని అంగీకరించినట్లేనా?

రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి దక్కడం ఎవరికి ఇష్టం లేదు. కాంగ్రెస్ లో సీనియర్లందరూ గుర్రుగా ఉన్నా ఏమీ అనలేక పైకి నవ్వు ముఖం పులముకుంటున్నారు. [more]

Update: 2021-07-20 11:00 GMT

రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి దక్కడం ఎవరికి ఇష్టం లేదు. కాంగ్రెస్ లో సీనియర్లందరూ గుర్రుగా ఉన్నా ఏమీ అనలేక పైకి నవ్వు ముఖం పులముకుంటున్నారు. ఇది వాస్తవం. తమ సీనియారటిని కాదని రేవంత్ రెడ్డికి ఇవ్వడమేంటన్న ఆగ్రహం దాదాపు అందరిలోనూ ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నేతలు బయటపడ్డారు తప్పించి మిగిలిన వారు సమయం కోసం వేచి చూస్తున్నారు. రేవంత్ రెడ్డి స్వభావం తెలియడంతో ఆయన దూకుడు కుర్చీకి చేటు తెస్తుందని కూడా కొందరు సీనియర్ నేతలు నమ్ముతున్నారు. అందుకే రేవంత్ రెడ్డి నియామకం పట్ల పైకి సంతోషం ప్రకటిస్తున్నారు.

దూకుడు స్వభావంతో…

నిజమే రేవంత్ రెడ్డి దూకుడు స్వభావం ఉన్న నేత. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలీదు. ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి పిలుపునిస్తారో ఊహించలేం. అప్పటికప్పడు నిర్ణయం తీసుకునే తత్వం రేవంత్ ది. అందుకే రేవంత్ రెడ్డి తనంతట తానే చిక్కుల్లో పడతారన్నది సీనియర్ నేతల భావన. ప్రధానం హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉంది. ఈ ఉప ఎన్నికల్లో గెలుపు ఓటములు ఎలా ఉన్నప్పటికీ నేతలను సమన్వయం చేసుకోవడం, గతంలో కంటే ఎక్కువ ఓట్లను సాధించాల్సి ఉంది. రేవంత్ రెడ్డి పోకడలతో గతంలో వచ్చిన ఓట్లు కూడా తగ్గే అవకాశముందన్న అంచనా ఉంది.

పైకి అలాగే ఉన్నా…

కాంగ్రెస్ లో ఎప్పుడూ అంతే. అంతా కలసి ఉన్నట్లే కనిపిస్తారు. కానీ సమయం వచ్చినప్పుడు నొక్కేయడానికి రెడీ గా ఉంటారు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ లో చేరిన మూడేళ్లకే పీసీసీ చీఫ్ పదవి ఎలా ఇస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో హైకమాండ్ ను ఎదిరించలేక, వారి నిర్ణయాన్ని కాదనలేక బలవంతంగా కొందరు అంగీకరించాంటారు. మధుయాష్కి, మల్లు భట్టి విక్రమార్క తదితర నేతలు సమయం కోసం వేచి చూస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వారు అంగీకరిస్తున్నట్లు మాత్రం అనుకోలేం. అనుకుంటే అది భ్రమే అవుతుంది. అందుకే రేవంత్ రెడ్డి ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంంది.

భవిష్యత్ లో ఇబ్బందులే….

కాంగ్రెస్ చీఫ్ గా ప్రస్తుతం అందరినీ రేవంత్ రెడ్డి కలుపుకుని పోతున్నారు. సమిష్టి నిర్ణయాలు ఇకపై జరగాల్సి ఉంది. ఏకపక్షంగా నిర్ణయాలు ఉంటే రేవంత్ రెడ్డిపై వ్యతిరేకత పార్టీలో వెంటనే కన్పిస్తుంది. జిల్లాల్లో పార్టీ నియామకాల విషయంలోనూ రేవంత్ రెడ్డి తన వర్గానికి పెద్దపీట వేస్తారన్న అనుమానాలున్నాయి. ఇప్పటికే ఆయన చుట్టూ కొందరు చేరిపోయారు. భవిష్యత్ లో ఇదే రేవంత్ రెడ్డికి ఇబ్బందికరంగా మారనుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ లో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. రేవంత్ కు సెగ పెట్టేందుకు సీనియర్లు సిద్ధంగా ఉన్నమాట వాస్తవం. కాకుంటే అందుకు సమయం కుదరాల్సి ఉంది.

Tags:    

Similar News