అది హస్తం పార్టీ నాయనా?

రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నేతలకు కాదు..ఇప్పుడు కాంగ్రెస్ నేతలకే టార్గెట్ గా మారారు. రేవంత్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ నేతలకు మింగుడు పడటం లేదు. ఆయన మీద [more]

Update: 2019-09-22 13:30 GMT

రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నేతలకు కాదు..ఇప్పుడు కాంగ్రెస్ నేతలకే టార్గెట్ గా మారారు. రేవంత్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ నేతలకు మింగుడు పడటం లేదు. ఆయన మీద ఏకంగా క్రమశిక్షణ సంఘం చర్యలకు సమీక్షించిందంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా ఒంటరి అయినట్లేనన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఇన్నాళ్లూ శత్రువులుగా ఉన్న నేతలు సయితం రేవంత్ రెడ్డి విషయంలో ఒక్కటిగా మారడం విశేషం. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కోలుకోలేదని స్పష్టం కావడంతో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఎమ్మెల్యేగా ఓడి….

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావడానికి అప్పట్లో మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కూడా కారణం. ఇద్దరూ దగ్గర బంధువులు కావడంతో రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్ బాగుండాలంటే కాంగ్రెస్ లో ఉండటమే బెటరని జైపాల్ రెడ్డి కూడా భావించారు. అయితే కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఓటమితో కొంత డీలా పడ్డారు. అప్పటి వరకూ రేవంత్ రెడ్డికి ఉన్న ఇమేజ్ డ్యామేజీ అయింది. అయితే పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ టిక్కెట్ సాధించి విజయం సాధించారు. మల్కాజిగిరి నుంచి ఎంపీ అయిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ రెడ్డి దగ్గరయ్యారు.

అధిష్టానానికి దగ్గరవుతున్నారని….

అయితే పీసీసీ అధ్యక్ష పదవిలో రేసులో రేవంత్ రెడ్డి ఉండటం కాంగ్రెస్ సీనియర్ నేతలకు రుచించడం లేదు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వకూడదంటూ అధిష్టానం వద్దకు వెళ్లి మరీ సీనియర్ నేతలు మొరపెట్టుకున్నారు. సీనియర్ నేత వి.హనుమంతరావు అయితే బహిరంగంగానే రేవంత్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. ఇది జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలసి సోనియాగాంధీని కలిశారు. దీంతో రేవంత్ మరింతగా పార్టీలో చొచ్చుకుపోయే ప్రమాదముందని భావించి కాంగ్రెస్ నేతలు ఆయన్ను దూరం పెట్టడం ప్రారంభించారు.

రేవంత్ టార్గెట్ గా….

పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై గవర్నర్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డిని ఆ కార్యక్రమానికి పిలవలేదు. పైగా రేవంత్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేరుగా ఫోన్ చేసి యురేనియం తవ్వకాలపై అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించడం కాంగ్రెస్ నేతలకు రుచించలేదు. దీనికి తోడు హుజూర్ నగర్ ఉప ఎన్నికలో ఉత్తమ్ భార్య పద్మావతి అభ్యర్థిత్వాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకించడం మరింత ఆజ్యం పోసింది. అసెంబ్లీలో విద్యుత్తు పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేతలు సభలో లేకపోవడాన్ని రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. దీనిని కాంగ్రెస్ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నారు. నల్లగొండ జిల్లాలో నిన్న మొన్నటి వరకూ శత్రువులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ విషయం వచ్చే సరికిఒక్కటయ్యారు. వీహెచ్ , సంపత్ కుమార్ లాంటి నేతలు రేవంత్ ను టార్గెట్ చేసుకున్నారు. కాంగ్రెస్ అంటే ఇప్పటికి రేవంత్ రెడ్డికి అర్థమయ్యే ఉంటుంది.

Tags:    

Similar News