రేవంత్ ని గిల్లుతున్నదెవరు…?

రేవంత్ రెడ్డి తెలంగాణా రాజకీయాల్లో ఇపుడు కొంత కీలక భూమిక పోషిస్తున్నారని చెప్పుకోవాలి. ఆయన తొలుత టీఆర్ఎస్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసినా తరువాత ఒక వెలుగు [more]

Update: 2020-09-04 11:00 GMT

రేవంత్ రెడ్డి తెలంగాణా రాజకీయాల్లో ఇపుడు కొంత కీలక భూమిక పోషిస్తున్నారని చెప్పుకోవాలి. ఆయన తొలుత టీఆర్ఎస్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసినా తరువాత ఒక వెలుగు వెలిగింది మాత్రం టీడీపీ ద్వారానే. ఆయన రాజకీయాన్ని ఒక గురువులా తీర్చిదిద్దించి చంద్రబాబు. ఇక ఓటుకు నోటుకు కేసు ఇద్దరు జాతకాలను తారుమారు చేసి పారేసింది. రేవంత్ రెడ్డి ఆ తరువాత జైలుకి వెళ్ళినా జాతీయ పార్టీ కాంగ్రెస్ లో చేరి తన పొలిటికల్ కెరీర్ని మళ్ళీ గాడిన పెట్టుకున్నారు. చంద్రబాబు మాత్రం ఆంధ్ర్ర్రాకు మాజీ సీఎంగా మిగిలిపోయారు. తెలంగాణాలో టీడీపీని చాప చుట్టేశారు. ఇపుడు టీడీపీ గొంతు కూడా వినిపించే సీన్ లేదక్కడ.

మొనగాడేనా…?

రేవంత్ రెడ్డి తెలంగాణా కాంగ్రెస్ లో ఫేస్ వాల్యూ ఉన్న అతి కొద్ది మంది నేతలలో ఒకరుగా ఉన్నారు. కేసీఆర్ మీద ఘాటుగా విమర్శలు చేయాలంటే రేవంత్ రెడ్డికే చెల్లు. ఆయన ప్రసంగాలు, పంచ్ డైలాగులూ జనాలను బాగానే ఆకట్టుకుంటాయి. అందుకే కాంగ్రెస్ ఆయనను టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసింది. అయితే ఏకంగా పీసీసీ ప్రెసిడెంట్ కే రేవంత్ రెడ్డి గేలం వేస్తున్నారు. కాంగ్రెస్ రాజకీయాలు ఆయన్ని పార్టీ పెద్ద కుర్చీ ఎక్కనీయడంలేదు. ఓడనైనా ఓడుతాము కానీ తామే పెద్ద లీడర్లుగా ఉండాలనుకుంటున్నారు సీనియర్ నేతలు. కాంగ్రెస్ వర్గ పోరు అంతలా ఉండబట్టే కదా జగన్మోహనరెడ్డి ఆ పార్టీని వీడాల్సివచ్చింది.

కొత్త పార్టీతోనే….

ఈ పరిణామాల నేపధ్యంలో రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెడతారు అని ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ లో ఉన్న వారు ఎప్పటికీ తనకు కీలక పదవి దక్కనీయరు. అది దక్కపోతే తన కలల సీఎం పదవి కూడా కడు దూరంలో ఉండిపోతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. రాజకీయాల్లో పోరాడాలే కానీ పోయేది ఏమీ లేదు, వస్తే గిస్తే పదవులు తప్ప. ఇక రేవంత్ రెడ్డికి పొలిటికల్ గా ఎంతో కొంత గ్లామర్ ఉంది. దాన్ని పెట్టుబడిగా పెట్టి సొంతంగా ప్రాంతీయ పార్టీ పెడితే ఎలా ఉంటుందోనని ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. దక్షిణ తెలంగాణాలోని కొన్ని జిల్లాల్లో రేవంత్ రెడ్డికి పట్టు ఉందని సొంతంగా చేయించుకున్న సర్వేలు చెబుతూండడంతో రేవంత్ రెడ్డి ఉత్సాహంగా ఉన్నారని టాక్.

అదే ప్లాన్ …..

రేవంత్ రెడ్డి తెలంగాణాలో కీలకమైన మూడు పార్టీలను చుట్టి వచ్చిన నేత. ఆయన చాలా కాలం టీడీపీలో ఉన్నారు. దాంతో పార్టీ పెడితే టీడీపీ క్యాడర్ కలసి వస్తుందని ఆశిస్తున్నారు. తెలంగాణాలో లీడర్లు లేకపోయినా క్యాడర్ ఇప్పటికీ టీడీపీకి గట్టిగానే ఉంది. దాన్ని సొమ్ము చేసుకోవడానికి రేవంత్ చూస్తున్నారని అంటున్నారు. అదే విధంగా రెడ్డి సామాజికవర్గం అధికారం లేక విలవిలలాడుతోంది. వారంతా వైసీపీని తెలంగాణాలో రీ స్టార్ట్ చేయమని జగన్ని కోరినట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే కేసీఆర్ తో దోస్తీ. ఏపీ రాజకీయ పరిణామాల వల్ల జగన్ ఇటు వైపు తొంగి చూడడంలేదు. ఇపుడు రేవంత్ రెడ్డి కనుక పార్టీ పెడితే వారంతా ఆయన వైపు చూసి జై కొట్టే అవకాశాలు అధికంగా ఉన్నాయని కూడా అంటున్నారు.

భేటీ అయ్యారా..?

ఇదిలా ఉండగా మరో ప్రచారం కూడా తెలంగాణాలో ఉంది. ఈ మధ్యనే రేవంత్ రెడ్డి తమ రాజకీయ గురువు చంద్రబాబుని కలసి ఏకాంత చర్చలు జరిపారని టాక్. అంటే చంద్రబాబే దగ్గరుండి శిష్యుడి చేత ప్రాంతీయ పార్టీని పెట్టిస్తున్నారా అన్న డౌట్లూ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ఒక వేళ అది నిజం అయితే ఇద్దరికీ లాభమేనన్న మాట కూడా ఉంది. టీడీపీ రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తే టీయారెస్ ని ఢీ కొట్టేందుకు బలం బాగానే వస్తుందని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి ఎవరు కాదన్నా కూడా కేసీయార్, కేటీయార్ లకు రేవంత్ రెడ్డి గట్టి ప్రత్యర్ధి అని ఒప్పుకోవాల్సిందే. మరి ఆయన రాజకీయ అడుగులు కరెక్ట్ గా ఉంటే తెలంగాణాలో మరో పాంతీయ పార్టీ దూసుకురావడం ఖాయమే.

Tags:    

Similar News