రేవంత్ కు ట్రంప్ కార్డు దొరికిందే....!

Update: 2018-10-01 14:30 GMT

తెలంగాణ రాజకీయం బస్తీమే సవాల్ అన్నట్లుగా మారింది. రేవంత్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారుల దాడితో వేడి పెరిగింది. సాధారణ ప్రచారంలో తిట్లు, శాపనార్ధాలు, హామీలు, వాగ్దానాలు మాత్రమే ఉంటాయి. తాజాగా కుట్రలు, కుతంత్రాల విమర్శలు జోరందుకున్నాయి. ట్విస్టులు, మలుపులతో దీనినుంచి ఎంతవరకూ లబ్ధి పొందగలమనే కొత్త ఎత్తుగడలు మొదలయ్యాయి. వ్యూహ, ప్రతివ్యూహాల్లోనూ నూతన పంథా ను ఎత్తుకుంటున్నారు. అధికారపార్టీ, ప్రధాన ప్రతిపక్షం రెండూ కేంద్ర సంస్థల దాడులను ప్రాతిపదికగా చేసుకోవాలని యత్నిస్తున్నాయి. ఇది ఏదో ఒక పార్టీకి అనుకూలించి మరొక పార్టీకి ప్రతికూలంగా పరిణమించే అవకాశాలున్నాయి. రేవంత్ పై ఆరోపణల తీవ్రతను పెంచి చూపేందుకు అధికారపార్టీ శతవిధాల తమ ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని రంగంలోకి దింపుతోంది. పక్కా రాజకీయ కుట్రగా దీనిని నిరూపించేందుకు రేవంత్ ను అనుసరించే నాయకులు పావులు కదుపుతున్నారు. ఎన్నికల ప్రణాళికల కంటే ఇదే పెద్ద హాట్ టాపిక్ గా ప్రజల్లో చర్చనీయమవుతోంది. మీడియా దృష్టి మొత్తం దీనిపైనే కేంద్రీకృతమవుతోంది.

రోడ్డెక్కిన రాజకీయం...

రాజకీయం దిగజారుతోందన్నది కొత్త మాటేమీ కాదు. 2004 వరకూ ఎన్నికల్లో విమర్శలు కొంచెం సంప్రదాయబద్ధంగానే ఉంటూ వచ్చాయి. 2009 ఎన్నికల్లో అవినీతి ఆరోపణలు ప్రధాన ప్రచారాస్త్రంగా వినియోగించుకుంది మహాకూటమి. దానికి తోడు తెలంగాణ సెంటిమెంటునూ ప్రయోగించింది. కానీ వైఎస్సార్ నేత్రుత్వంలోని కాంగ్రెసు గెలిచింది. 2014లో రాష్ట్రవిభజనకు తోడు వైసీపీ అధినేత జగన్ పై కేసులు ఒక ముఖ్యమైన అంశంగా నిలిచాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి వారసునిగా ఆయనకున్న ఇమేజ్ ను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్లను వాడుకున్నారనే విమర్శలు తలెత్తాయి. ప్రధానంగా హైకోర్టు ద్వారా ఆయా సంస్థల విచారణకు కాంగ్రెసు పార్టీయే బాటలు పరిచిందనే రాజకీయ ఆరోపణలున్నాయి. ప్రభుత్వ సంస్థల దుర్వినియోగం అప్పట్నుంచీ పెరుగుతూ వచ్చింది. రాష్ట్రప్రభుత్వాలను సైతం నియంత్రించేందుకు ముఖ్యనాయకులపై నిఘాకు, విచారణలకు అవసరాన్ని బట్టి ఆదాయపన్ను, ఎన్ ఫోర్సుమెంటు డైరెక్టరేట్లను కేంద్రం రంగంలోకి దింపుతోందనేది ప్రధానమైన అభియోగం. తెలంగాణ అసెంబ్లీ రద్దయిన తర్వాత ఇక ఎన్నికలకు ముహూర్తం ఖరారవుతున్న స్థితిలో రేవంత్ పై దాడులు రాజకీయాన్ని రచ్చగా మార్చాయి. ఆరోపణలు ఏమిటి? వాస్తవాలెంతవరకూ ఉన్నాయన్న సంగతులు పక్కన పడిపోయాయి. 2004 నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తిపై పాత ఆరోపణలపై తాజాగా ఎన్నికల సమయంలో విచారణ చేపట్టడంలోని ఔచిత్యం ప్రశ్నార్థకమవుతోంది.

కాంగ్రెసు కాసింత దూరం...

కాంగ్రెసు పార్టీ రేవంత్ ఉదంతంపై ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏఐసీసీ పరిధిలో సోషల్ మీడియా నిర్వహణకు సైతం రేవంత్ నిధులు సమకూర్చారనే ఆరోపణలున్నాయి. దీంతో ఈ వ్యవహారం పార్టీకి చుట్టుకుంటుందనే భయాందోళనలు అలుముకున్నాయి. ఆదాయపన్ను శాఖ దాడి జరిగిందన్న సంఘటన తెలిసిన వెంటనే కాంగ్రెసు నాయకులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. వెంటనే మేలుకున్న టీఆర్ఎస్ మీడియాకు వివిధ రూపాల్లో ఆరోపణల పత్రాలను అందచేసింది. వాటిని తమకు లభించిన ఆధారాలుగా మీడియా హడావిడి చేసింది. దీంతో కాంగ్రెసు నాయకులు కొంత వెనక్కి తగ్గారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి వ్యక్తిగత పోరాటంగా దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తమ పార్టీ నేతలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొలుపుతూ కుట్రకు పాల్పడుతున్నారనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెసు భావిస్తోంది. రేవంత్ ను మాత్రమే పెద్దగా ఫోకస్ చేయకూడదనే అంచనాకు వచ్చారు. ఈ కేసును పూర్తిగా సొంతం చేసుకుంటే రాజకీయంగా ఇబ్బందులు తలెత్తవచ్చని కొందరు కాంగ్రెసు నాయకులు పేర్కొంటున్నారు. దాంతో ఖండనలకు మాత్రమే పరిమితం కావాలి. ఆందోళనలకు దిగకూడదని నిర్ణయించారు.

కులం కార్డు....

నిజానికి ఒక నాయకునిపై దాడులు జరిగితే రాజకీయరంగు పులుముకోవడం సహజం. కానీ రేవంత్ పై దాడి కులం రంగు పులుముకుంది. ఆయనపై ఫిర్యాదు చేసిన వ్యక్తి, ముఖ్యమంత్రి కుటుంబం ఒకే కులానికి చెందడం ట్విస్టుగా మారింది. రెడ్డి వర్సస్ రావు అన్నట్లుగా విషయాన్ని ఫోకస్ చేయడం మొదలైంది. అర్థబలం, అంగబలం రీత్యా తాము తెలంగాణలో బలంగా ఉన్నప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాజకీయ ప్రాధాన్యం తగినంతగా లభించడం లేదని రెడ్డి సామాజిక వర్గం కినుక వహించింది. కాంగ్రెసు నాయకుల్లో రెడ్ల ప్రాబల్యం బాగానే ఉంది. అయితే కేసీఆర్ ను దీటుగా ఎదుర్కోగల నాయకులు కరవు అయ్యారు. ఈ దశలో రేవంత్ పై ఐటీ దాడి జరిగింది. ఇందులో రాజకీయ కుట్ర దాగి ఉందనే ఈ వర్గం బలంగా విశ్వసిస్తోంది. దీంతో రేవంత్ ను తమ వర్గం తరఫున కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. కాంగ్రెసు పెద్దలకు ఇది పెద్ద షాక్. కానీ ఫీల్డు లెవెల్ లో అనతికాలంలోనే అతని ఎదుగుదలను ఇది సూచిస్తోంది. అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు, కుట్రలు వంటివన్నీ పక్కనపడిపోయాయి. కులం కార్డు ఇప్పుడు పొలిటికల్ ట్రంప్ కార్డుగా మారింది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News