దూకుడు తెచ్చిన దాడులేనా?

Update: 2018-09-28 15:30 GMT

రాజకీయానికి రంగు ,రుచి, వాసన ఉండదు. తన పర భేదం ఉండదు. ఈరోజున తనవాడైనవాడు రేపు పరాయివాడై తలపడతాడు. ఒకే కుటుంబంలో రెండు మూడు పార్టీలవారు ఉంటుంటారు. ఎవరి ఇష్టం వారిదే . పైచేయి సాధించే యత్నాలు సాగుతుంటాయి. తాజాగా టీకాంగ్రెసు వర్కింగు ప్రెసిడెంటుగా ఎన్నికైన రేవంత్ రెడ్డిపై సాగిన ఆదాయపన్ను, ఎన్ ఫోర్స్ మెంటు దాడుల్లో ప్రత్యర్థి పార్టీతో పాటు సొంతపార్టీ వారి హస్తం ఉందనేది ప్రధాన అభియోగం. ఇందులోని పూర్వాపరాలెలా ఉన్నప్పటికీ ఈర్ష్యాసూయలు ఎంతటి పనికైనా తెగిస్తాయనేందుకు ఒక ఉదాహరణగా, దృష్టాంతంగా చెప్పాల్సి ఉంటుంది. ఓటుకు నోటు కేసు, మనీలాండరింగ్, హౌసింగ్ సొసైటీ అక్రమ కేటాయింపుల వంటి అనేక కేసుల్లో రేవంత్ సంకటస్థితిలో పడ్డారు. ఇందులో బీజేపీ,టీఆర్ఎస్ వంటి పార్టీల పాత్రతో పాటు సొంతపార్టీలోని పెద్దల పాత్ర సైతం ఉన్నట్లు అనుమానాలున్నాయి.

టీఆర్ఎస్ కు కొరకరాని కొయ్యగా.....

నిజానికి టీఆర్ఎస్ కు కంట్లోని నలుసు, కాలిముల్లు,చెవిలోని జోరీగ తరహాగా తయారయ్యారు రేవంత్. సాక్షాత్తు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుంటూ రేవంత్ చేస్తున్న విమర్శలు వారిని చాలా చికాకు పరుస్తున్నాయి. భాషాపరమైన సామర్ధ్యం , చేసే విమర్శల్లో చురుకు దనం కారణంగా ఆకట్టుకోవడం అతని ప్రత్యేకత. దాంతో టీఆర్ఎస్ కు కొంత నష్టం వాటిల్లుతోందనే భావన ఉంది. గతంలో టీఆర్ఎస్ సర్కారుకు తీవ్ర నష్టం చేయాలనే యత్నంలో భాగంగానే ఎమ్మెల్సీకి ఎరవేసి దొరికిపోయారు. ఫలితంగా తెలంగాణలో టీడీపీ బాగా దెబ్బతింది. ఆ తర్వాత టీడీపీకి రేవంత్ దూరమయ్యారు. హస్తం పార్టీలో చేరిపోయారు. కాంగ్రెసు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కావడంతో తన దూకుడును మరింత పెంచారు. రెడ్డి సామాజిక వర్గం తరఫున తనను తాను క్లెయిం చేసుకుంటూ ముఖ్యమంత్రి బరిలో ఉన్నట్లుగా ఎక్స్ పోజు అయ్యే ప్రయత్నమూ చేశారు. అధికారపార్టీకి ఇది ఇబ్బందికరంగానే మారిందని చెప్పాలి. కాంగ్రెసు నాయకుల్లో వర్గ విభేదాలు తమకు కలిసొస్తున్నాయని సంతోషంగా ఉన్న టీఆర్ఎస్ కు కొరుకుడు పడని కొయ్యగా మారారు రేవంత్. తాజాగా ఐటీ, ఇడీ ల దాడులతో టీఆర్ఎస్ ఊపిరి పీల్చుకొంటోంది.

కాంగ్రెసులోనూ ఖుషీ...

డజనుకు పైగా ముఖ్యమంత్రి అభ్యర్థులున్న కాంగ్రెసు పార్టీలో కొత్త పోటీదారు రేవంత్. అనతి కాలంలోనే పార్టీలో పెద్ద నాయకులను ఆకట్టుకోగలిగారు. అధిష్టానంతోనూ సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోగలిగారు. టీఆర్ఎస్ ను సమర్థంగా ఎదుర్కోవాలంటే రేవంత్ వంటి వాగ్ధాటి కలిగిన , దూకుడున్న నాయకుడు కావాలని కాంగ్రెసు నాయకత్వం విశ్వసించేలా చేసుకోగలిగారు. షెడ్యూల్డుకులాలు, తెగలు, బలహీన వర్గాలు పోటీ పడే 30 స్థానాల్లో గెలుపు బాధ్యతను రేవంత్ కు అప్పగించినట్లు సమాచారం. వారందర్నీ గెలిపించి తీసుకురాగలిగితే తర్వాత కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చేశారు. ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే అత్యంత కీలకమైన పదవికే భరోసా లభించిందంటున్నారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో స్పష్టత ఇవ్వలేదు. అయితే దానికి దీటైన పదవి ఖాయమని అధిష్టానమే చెప్పేసింది. మిగిలిన సీఎం పోటీదారులతో పోలిస్తే వయసు రీత్యాను, ఆర్థికంగా, ప్రజామద్దతు విషయంలో తనకు అడ్వాంటేజీ ఉందని రేవంత్ సన్నిహితులతో పలుసందర్భాల్లో ప్రస్తావించారు. ఇదంతా మిగిలిన సీనియర్లకు కంటగింపుగా మారింది. దాంతో కొందరు కాంగ్రెసు నాయకులే రేవంత్ వ్యవహారాల్లోని లొసుగులను ప్రత్యర్థులకు అందించారనే వాదన ఉంది. మొత్తమ్మీద ఏదేమైనా కాంగ్రెసు సీనియర్లు తమను దాటేస్తారనుకుంటున్న రేవంత్ బెడద వదిలిపోతుందనే సంబరంలో ఉన్నారు.

సమయం కాదు...

చాలా సీరియస్ అభియోగాలతోనే రేవంత్ పై కేసులు నమోదయ్యాయి. విదేశీ మారకద్రవ్య నిరోధక చట్టం, అవినీతి నిరోధక చట్టం, బినామీ వ్యవహారాల నిరోధకచట్టం, ఆదాయపన్ను చట్టం ప్రకారం కేసులు పెట్టారు. ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ నమోదు చేసే కేసులు పటిష్ఠంగా ఉంటాయి. తగినంత ఆధారాలు లభిస్తే చట్టపరంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు చెబుతున్నారు. అయితే రాజకీయంగా కీలకమైన సమయంలో ఈ కేసుల విషయంలో దర్యాప్తు సంస్థలు ముందుకు కదలడం అనుమానాలకు తావిస్తోంది. ఒకవైపు తెలంగాణ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతోంది. రాజకీయం బాగా వేడెక్కుతోంది. పరస్పర విమర్శలతో కాంగ్రెసు, టీఆర్ఎస్ లు మంచి దూకుడు కనబరుస్తున్నాయి. ఇప్పుడు ఒక ప్రధానపార్టీ లో యువ నాయకునిపై చర్యలు తీసుకోవడం రాజకీయ కక్ష సాధింపు అనడానికి ఆస్కారం ఏర్పడింది. దీనివల్ల అభియోగాల్లోని తీవ్రత తగ్గిపోతుంది. రాజకీయమే ముందుకు వస్తుంది. చర్య సంగతేమోకానీ సమయం సరైంది కాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News