మదం అణుస్తారా?

అమెరికా అధినేతలకు సహజంగానే ఒకింత అహంకారం ఎక్కువ. అగ్రరాజ్యం కావడం, రష్యా ప్రాభవం తగ్గిపోవడం, సైనిక, ఆర్థికశక్తిలో తనకు సరితూగగల దేశం లేకపోవడంతో ఈ అతిశయానికి కారణం. [more]

Update: 2019-10-10 16:30 GMT

అమెరికా అధినేతలకు సహజంగానే ఒకింత అహంకారం ఎక్కువ. అగ్రరాజ్యం కావడం, రష్యా ప్రాభవం తగ్గిపోవడం, సైనిక, ఆర్థికశక్తిలో తనకు సరితూగగల దేశం లేకపోవడంతో ఈ అతిశయానికి కారణం. ఇక డెమొక్రటిక్ నాయకులతో పోల్చి చూస్తే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులకు మిడిసిపాటు ఎక్కువన్నది అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం. అదే పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ కు ఆది నుంచి అహంకారం ఎక్కువే. గత మూడేళ్లుగా తన మాటలు, చేతల ద్వారా అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళన పరిచారు. అర్థం పర్థం లేని అహంకరా పూరిత ప్రకటనలు, అనాలోచిత వ్యాఖ్యలు, విమర్శల ద్వారా నవ్వుల పాలయ్యారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తానే స్వయంగా చిక్కుల పాలయ్యారు. మరో ఏడాదిలో పదవీకాలం ముగియనున్న తరుణంలో ఎదురైన ఇబ్బందుల నుంచి ఎలా గట్టెక్కాలా? అని ట్రంప్ ఆందోళన చెందుతున్నారు. అందరి సాయాన్ని ట్రంప్ అర్థిస్తున్నారు. తన పదవికి ఎసరు పెట్టే పరిస్థితులు కళ్లముందు కదలాడుతున్నప్పటికీ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ట్రంప్ ప్రదర్శిస్తున్నారు.

అభిశంసన ఇందుకు….

దీనికంతటికీ కారణం అభిశంసన తీర్మానం. ట్రంప్ ను అభిశంసించడం ద్వారా ఆయనను పదవి నుంచి దించేందుకు విపక్ష డెమొక్రటిక్ పార్టీ సభ్యులు పావులు కదుపుతున్నారు. సెనెట్ స్పీకర్ నాస్సి పెలోసీ ఈ విషయంలో క్రియాశీలకంగా ఉన్నారు. అమెరికా ప్రతినిధుల సభలో అభిశంసన ప్రక్రియ మొదలయినట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చట్టానికి ఎవరూ అతీతులు కారని, అధ్యక్షుడు అయినా, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు జవాబుదారీగా ఉండాల్సిందేనని నిష్కర్షగా ప్రకటించడంతో ట్రంప్ లబోదిబోమంటున్నారు. అభిశంసన ప్రక్రియకు దారితీసిన పరిస్థితులను విశ్లేషిస్తే ట్రంప్ టెంపరితనం స్పష్టమవుతుంది. వచ్చే ఏడాది నవంబరులో జరగనున్న ఎన్నికల్లో డెమొక్రటిక్ పా్రటీ అభ్యర్థి జోయ్ బిడెన్ ను ట్రంప్ ఢీకొనాల్సి ఉంది. దీంతో ఆయన పరువు, ప్రతిష్టలను మంట గలపాలని ట్రంప్ వ్యూహం పన్నారు. ఇందులో భాగంగా జోయ్ బిడెన్ పై దర్యాప్తు జరపాల్సిందిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడోమిర్ జెలెన్ స్కీని ట్రంప్ కోరినట్లు డెమొక్రటిక్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు జెలెన్ స్కీ తో జులై 25న ట్రంప్ జరిపిన ఫోన్ సంభాషణను వారు ఆధారంగా చూపుతున్నారు. లిఖిత పూర్వకంగా ఉన్న ఈ మాటలను అధ్యక్ష భవనం వైట్ హౌస్ స్వయంగా విడుదల చేయటం విశేషం. అమెరికా అటార్నీ జనరల్ విలియం బార్ , తన వ్యక్తిగత న్యాయవాది రూడీ గిలియాని తో కలిసి బిడెన్ పై దర్యాప్తు జరపాలని ట్రంప్ ఉక్రెయిన్ అధినేతకు చెబుతున్నట్లుగా ఆ సంభాషణల్లో ఉంది. ట్రంప్ ను అభిసంశించడానికి ఈ ఒక్క కారణం చాలునని డెమొక్రటిక్ నాయకులు చెబుతున్నారు.

ఉక్రెయిన్ ఎందుకంటే?

ఉక్రెయిన్ గురించి ఇక్కడ కొంత చెప్పుకోవడం అవసరం. ఇది ఒకప్పటి సోవియట్ యూనియన్ లో భాగం. 90వ దశకంలో సోవియట్ యూనియన్ ముక్కలు కావడంతో ఇది స్వతంత్ర దేశంగా అవతరించింది. దీని రాజధాని నగరం ‘‘కీవ్’’. సహజంగానే ఒకప్పటి సోనియట్ యూనియన్ అయిన ప్రస్తుత రష్యాకు, ఉక్రెయిన్ కు వైరం ఉంది. ఇక్కడ ట్రంప్ కు అధ్యక్ష్య ఎన్నికలలో పోటీదారుగా ఉన్న బిడెన్ కుమారుడు హంటర్ బిడెన్ కు ఉక్రెయిన్ లో భారీగా వ్యాపారాలున్నాయి. హంటర్ ఒక సహజవాయువు కంపెనీలో సభ్యుడిగా ఉన్నారు. హంటర్ వ్యాపార కార్యకలాపాలపై దర్యాప్తు జరిపిస్తే అందుకు ప్రతిగా ఉక్రెయిన్ కు సైనిక సాయం చేస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. హంటర్ తో పాటు ఆయన తండ్రి జో బిడెన్ కార్యకలాపాలపైనా దర్యాప్తు జరపాలని ఉక్రెయిన్ ను ట్రంప్ కోరారు.

సుదీర్ఘ ప్రక్రియ…

ఇక అభిశంసన ఓ సుదీర్ఘ ప్రక్రియ. దీనికి చట్టపరమైన అనేక లాంఛనాలున్నాయి. తీవ్రమైన నేరాలకు పాల్పడిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులను గద్దె దింపే ప్రక్రియ అభిశంసన. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ఇతర అధికారులు దేశ ద్రోహ,లంచాలు తీసుకోవడం, అధికార దుర్వినియోగానికి పాల్పడితే అభిశంసించే విశేష అధికారం అమెరికా కాంగ్రెస్ కు ఉంది. తొలుత అధ్యక్షుడిపైన నమోదైన అభియోగాలను స్వతంత్ర ప్రతిపత్తిగల హౌస్ ఆఫ్ జ్యుడిషియరీ కమిటీ సాక్ష్యాధారాలతో విచారిస్తుంది. ఇది నిజమని తేలితే 435 మంది సభ్యులు గల ప్రతినిధుల సభ సాధారణ మెజారిటీతో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. అభిశంసన ప్రక్రియలో సెనెట్ మరో కీలక వ్యవస్థ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో ఇక్కడ విచారణ జరుగుతుంది. ఈ సందర్భంగా అధ్యక్షుడు తాను నిర్దోషినని వాదించేందుకు అవకాశం ఉంటుంది. సెనెట్ లోని మూడింట రెండొంతుల మంది (67 మంది) సభ్యులు అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆయన పదవి నుంచి వైదొలగక తప్పదు. అభిశంసన నుంచి ట్రంప్ గట్టెక్కగలుగుతారని రాజకీయ విశ్లేషకుల అంచనా. అమెరికా చరిత్రలో ఇంతవరకూ ఏ అధ్యక్షుడూ అభిశంసనకు గురి కాలేదు. 1860 ప్రాంతంలో ఆండ్రూ జాన్సన్, మళ్లీ 1998లో బిల్ క్లింటన్ లపై అభిశంసన ప్రవేశపెట్టినా సెనెట్ లో వారికి ఊరట లభించింది. క్లింటన్ పై అప్పట్లో సెక్స్ పరమైన ఆరోపణలు వచ్చాయి. 1974లో నాటి అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ పై వాటర్ గేట్ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలు వచ్చాయి. అయితే అభిశంసన ప్రక్రియపై చర్చ జరగకముందే నిక్సన్ రాజీనామా చేశారు. ప్రస్తుత గడ్డు పరిస్థితి నుంచి ట్రంప్ గట్టెక్కే పరిస్థితులు అధికంగా ఉన్నాయన్నది విశ్లేషకుల అంచనా. అయితే వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడం ట్రంప్ కు అంత తేలిక కాబోదన్నది చేదు నిజం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News