కోటాల కోలాటం..?

ఓట్లు వస్తాయంటే చాలు సమాజాన్ని విభజించడానికి రాజకీయ పార్టీలు ఏ మాత్రం వెనకాడవు. అందుకే రిజర్వేషన్ల రూపంలో నిరంతరం వివిధ వర్గాలను సంతృప్తి పరుస్తుంటారు నాయకులు. నిజమైన [more]

Update: 2021-08-17 16:30 GMT

ఓట్లు వస్తాయంటే చాలు సమాజాన్ని విభజించడానికి రాజకీయ పార్టీలు ఏ మాత్రం వెనకాడవు. అందుకే రిజర్వేషన్ల రూపంలో నిరంతరం వివిధ వర్గాలను సంతృప్తి పరుస్తుంటారు నాయకులు. నిజమైన అధికారాన్ని తాము అనుభవిస్తుంటారు. అణగారిన వర్గాల నుంచి నాయకత్వానికి పోటీ లేకుండా చూసుకుంటారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పేరిట నిరంతరం కొత్త వర్గాలను ప్రలోభపెడుతుంటారు. ప్రజాస్వామ్యానికి , సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచే చట్ట సబల్లో రిజర్వేషన్ల సంగతి మాత్రం ఊసెత్తరు. ఎందుకంటే అక్కడ తమకు పోటీకి వస్తారు. అందుకే కులాల వారీ కుంపట్లు పెట్టి, వాటి సెగను ఎగదోస్తుంటారు. కొందరు తమకూ కోటా కావాలని కోరుతుంటారు. మరికొందరు వ్యతిరేకిస్తుంటారు. సమాజంలోని అన్నివర్గాలను పైకి తెచ్చే బాధ్యత తమది కాదన్నట్లుగా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తుంటాయి. మరికొన్ని వర్గాలకు కొత్త హామీలు ఇస్తూ ఆశలు కల్పిస్తూ పార్టీలు పబ్బం గడుపుకుంటూ ఉంటాయి. తాజాగా రాజ్యాంగ సవరణతో వెనకబడిన తరగతుల వర్గీకరణ అధికారాన్ని రాష్ట్రాలకే కేటాయిస్తూ పార్లమెంటు నిర్ణయం తీసుకుంది. అంటే మళ్లీ ప్రాంతీయ పార్టీల వలలో కులాల ప్రలోభాలకు మరింతగా దన్ను దొరుకుతోందన్నమాట.

పులి స్వారీ…

రిజర్వేషన్లు పెట్టడంలో రాజ్యాంగ నిర్మాతల ఆశయం చాలా ఉదాత్తమైనది. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వారిని ఇతర వర్గాలతో సమాన స్థాయికి తేవాలనేది వారి ఉద్దేశం. అది కూడా రెండు దశాబ్దాల్లోనే సాధించవచ్చని వారు ఆశించారు. అయితే రాజకీయ పార్టీలు దీనిని ఓట్లు కురిపించే మంత్రంగా భావించి కొత్త వర్గాలను అందులో చేర్చడం ప్రారంభించాయి. నిజానికి రిజర్వేషన్ల అమలు తీరుపై సమీక్ష లేదు. సాంఘికంగా, విద్యాపరంగా ఏమేరకు ఆయా సామాజిక వర్గాలు పై స్థాయికి చేరుకున్నాయనే శాస్త్రీయ అధ్యయనం జరపడం లేదు. ఫలితంగా కొన్ని కుటుంబాలు రిజర్వేషన్ల ఫలాలను తరాలతరబడి వారసత్వంగా అనుభవిస్తున్నాయి. అదే సామాజిక వర్గంలో మరింతగా వెనకబడిన వారికి న్యాయం జరగడం లేదు. నిజానికి ఐఎఎస్, ఐపీఎస్, గ్రూప్ ఒన్ , గెజిటెడ్ స్తాయి ఉద్యోగాలు పొందిన వారి పిల్లలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ వారందరికి వర్తించడం వల్ల అదే సామాజిక వర్గంలో వీరితో పోటీ పడలేని వారు శాశ్వతంగా ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. కొన్ని కుటుంబాలు నాలుగైదు తరాలుగా అఖిలభారత సర్వీసుల హోదాను అదే కోటాలో పొందుతూ ప్రక్రియనే ఎగతాళి చేస్తున్నారు. అయినా ప్రభుత్వాలు దీనిని పునస్సమీక్షించేందుకు సిద్ధపడటం లేదు. నియమనిబంధనలు పెట్టేందుకు సాహసించడం లేదు. పులి స్వారీ మొదలైన తర్వాత కిందకి దిగితే తమ అధికారాన్ని కాటేస్తుందేమోననే భయం వారిని వెన్నాడుతోంది.

రాజకీయ వలలు…

అవసరానికి అనుగుణంగా బలమైన సామాజిక వర్గాలకు కూడా పార్టీలు రిజర్వేషన్ల ప్రలోభం చూపించి వల వేస్తున్నాయి. మహారాష్ట్రలో మరాఠాలు బలమైన నేపథ్యం ఉన్న వర్గం. సాంఘికంగా, ఆర్థికంగా వారి స్థితిగతులు దయనీయంగా లేవు. అయినా శివసేన ప్రభుత్వం వారిని శాశ్వత ఓటు బ్యాంకుగా మలచుకునేందుకు రిజర్వేషన్ల ఎర వేసింది. సుప్రీం కోర్టు కొట్టి వేసినా తాజా పార్లమెంటు చట్ట సవరణతో మళ్లీ పునరుద్ధరణకు అవకాశం ఏర్పడింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కాపు రిజర్వేషన్లకు గతంలో తెలుగుదేశం హామీ ఇచ్చి ఒకసారి అధికారం దక్కించుకుంది. ఇంకా అనేక రాస్ట్రాల్లో వివిధ కులాల నుంచి వెనకబడిన తరగతుల్లో చేర్చమనే డిమాండ్లు ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలివిగా రాష్ట్రాల నెత్తిన రుద్దేసింది. దీంతో ప్రాంతీయ పార్టీలు ఇష్టారాజ్యంగా చెలరేగి పోయే అవకాశాలున్నాయి. కచ్చితంగా గెలుపునకు ఉపయోగపడతారనే బావన ఉన్న బలమైన కులాలను రిజర్వేషన్ల పరిధిలోకి తెచ్చే ప్రమాదం ఉంది. దీంతో నిజంగా వెనకబాటునకు గురైన వర్గాలు అన్యాయానికి గురవుతాయి. ఇప్పటికే సమాజంలో వారికంటే పై స్థాయిలో ఉన్న వర్గాలు ప్రయోజనాలను ఎగరేసుకుపోయే అవకాశం ఉంది.

ఇంకా అన్యాయమే..

ఎస్సీ,ఎస్టీలకు రిజర్వేషన్లు 70 ఏళ్లకు పైబడి అమలవుతున్నాయి. ఓబీసీలకు కూడా ముఫ్పై ఏళ్లనుంచి కేంద్రస్థాయిలో అమల్లోకి వచ్చాయి. రాష్ట్రాల్లో అంతకుముందు నుంచే ఈ కోటా ఉంది. అయినా ఇప్పటికీ ఆయా సామాజిక వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన స్తాయిలో ప్రాతినిధ్యం లేదు. అంటే అమలులోనే ఎక్కడో లోపం ఉంది. బీసీలకు 27శాతం కోటా ఇచ్చారు. అయినా కేంద్రంలోని గ్రూప్ ‘ఎ’ ఉద్యోగాల్లో వారు 17 శాతమే ఉండటం విచిత్రం. అలాగే బీసీడీ గ్రూపు స్థాయి ఉద్యోగాల్లో 12శాతం మేరకే ఉన్నారు. కోటాల ద్వారా సామాజిక స్తాయిలను దిద్దుబాటు చేయలేకపోతున్నాయి ప్రభుత్వాలు. కొత్తగా మరికొందరిని తెచ్చి పెట్టి ఘర్షణకు తావిస్తున్నాయి. మంది ఎక్కువైతే మజ్జిగ పలచన కావడం ఖాయం. పైపెచ్చు ఇకపై ప్రతి ఎన్నికలోనూ కొన్ని కులాలకు కొత్త కోటా హామీలు ఇస్తాయి రాజకీయ పార్టీలు. రిజర్వేషన్ వర్గాల్లోనూ వివక్ష ఉంది. నూటికి 25 కులాలు మాత్రమే ఆయా సామాజిక వర్గాల్లో ఫలితాలను అనుభవించగలుగుతున్నాయి. అందుకే కులాల ఉప వర్గీకరణతో అందరికీ న్యాయం చేయాలనే డిమాండ్లు ఉన్నాయి. 2017 లోనే దీనికి సంబంధించి కమిషన్ వేసినప్పటికీ ఫలితం ఏమైందో తెలియదు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడంతోనే సమస్య వచ్చి పడుతోంది. అదే తమ అధికారానికి సోపానంగా భావిస్తున్నాయి పార్టీలు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News