రిలయన్స్ లో ‘‘రియాల్టీ’’ ఎంత?

Update: 2018-09-24 16:30 GMT

రాఫెల్ ఒప్పందానికి సంబంధించి రోజురోజుకూ నిజాలు రాటుదేలుతున్నాయి. ప్రభుత్వ వాదనకు, వెలుగు చూస్తున్న వాస్తవాలకు అసలు పొంతనే ఉండటం లేదు. ఒప్పందాన్ని కట్టబెట్టే విషయంలో ఉద్దేశ్యపూర్వకంగానే బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ (హెచ్ఎఎల్) ను పక్కన పెట్టినట్లు స్పష్టమవుతోంది. హెచ్ఎఎల్ బదులు ప్రవేటు రంగ సంస్థకు అప్పగించడంలో ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉన్నట్లు తాజగా వెలుగులోకి వచ్చింది. పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ అనిల్ అంబానీ సారథ్యంలోని కంపెనీకి ఒప్పందాన్ని అప్పగించమని భారత ప్రభుత్వ పెద్దలే సూచించారని ఫ్రాన్స్ వైపు నుంచి వాదన విన్పిస్తోంది. దీంతో ఒప్పందం విషయంలో భారత ప్రభుత్వ పాత్రపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

హోలన్ ప్రకటనతో....

యుద్ధ విమానాల తయారీలో భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్ ను ఎంపిక చేసుకోవాలని భారత ప్రభుత్వమే డసో ఏవియేషన్ సంస్థకు సూచించినట్లు ఫ్రెంచ్ పత్రిక "మీడియా పార్ట్" వెల్లడించింది. మాజీ అధ్యక్షుడు హోలన్ ఈ విషయాన్ని చెప్పినట్లు స్పష్టం చేసింది. ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఫ్రాన్స్ పత్రిక వెల్లడించిన సమాచారం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఎఎల్ ను పక్కన పెట్టి అనుభవం లేని రిలయన్స్ డిఫెన్స్ కు ప్రభుత్వం కాంట్రాక్టుకు అప్పగించిందని విమర్శలు చేస్తున్నవిమర్శలకు ఇదో ఆయుధంగా మారింది. ‘‘ఇందులో మా ప్రమేయం లేదు. భారత్ ప్రభుత్వమే ఆ సంస్థ పేరు ప్రతిపాదించింది. ఆ మేరకు అనిల్ అంబానీ సంస్థతో డసో ఏవియేషన్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. మాకు మరో అవకాశం లేకపోయింది’’ అని హాలన్ చెప్పినట్లు మీడియా పార్ట్ పత్రిక స్పష్టం చేసింది.

సినిమా ఒప్పందం తర్వాతేనా?

అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ అనే సంస్థ లో హాలన్ భాగస్వామి. ఫ్రెంచ్ సినిమా నిర్మాత అయిన జూరీ గమెట్ తో కలసి ఓ సినిమా నిర్మిస్తుందని, రాఫెల్ ఒప్పందానికి ముందే ఆ సినిమాకు సంబంధించిన ఒప్పందం కుదిరిందన్న వార్తలు వచ్చాయి. రాఫెల్ కొనుగోళ్లకు, ఈ సినిమాకు సంబంధం ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ వాదనను హాలన్ ఖండించారు. అయితే హాలన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లారు. 36 యుద్ధ విమానాలను కొనుగోలు చేయనున్నట్లు 2015 ఏప్రిల్ 10న ప్యారిస్ లో ప్రకటించడం గమనార్హం. హోలన్ ప్రకటన కాంగ్రెస్ తదితర విపక్షాలకు వరంగా మారింది. ప్రభుత్వాన్ని, భారతీయజనతా పార్టీని ఆత్మరక్షణ ధోరణిలోకి నెట్టింది. అధికారికంగా స్పందించడానికి తటపటాయిస్తోంది. కాంగ్రెస్ పై ఒంటికాలిపై వచ్చే ఆ పార్టీ ఎంపీ సుబ్రహ్యణ్య స్వామి స్పందన కూడా పేలవంగా ఉంది. ‘‘ఒక వేళ ఆ వార్త నిజమే అయితే తీవ్రమైన అంశం’’ అంటూ ట్వీట్ తో స్వామి సరిపెట్టారు.

మిత్రుడి కోసం......

రిలయన్స్ మిత్రుడి కంపెనీ కోసం ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఎఎల్ ను ఎలా పక్కన పెట్టిందీ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 1వ తేదీన పదవీ విరమణ చేసిన హెచ్ఎఎల్ మాజీ ఛైర్మన్ టి.సువర్ణరాజు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. పాత ప్రతిపాదనలకు అనుగుణంగానే కేంద్రం రాఫెల్ యుద్ధవిమానాలపై ఒప్పందం కుదుర్చుకుని ఉంటే వాటిని హెచ్ఎఎల్ తయారు చేయగలిగేదని సువర్ణరాజుస్పష్టం చేశారు. పనులు పంచుకునే కాంట్రాక్టుపై రాఫెల్ తయారీ సంస్థ డసో, హెచ్ఎఎల్ సంతకాలు కూడా చేశాయని ఆయన చెప్పడం గమనార్హం. అధునాతన యుద్ధ విమానాల తయారీ సామర్థ్యం తమ సంస్థకు ఉందని సువర్ణరాజు వెల్లడించారు. ఇరవై సంవత్సరాలుగా ‘‘డసో’’ తయారు చేసిన మిరాజ్-2000 విమానాలకు హెచ్ఎఎల్ మరమ్మత్తులు చేస్తుందని సువర్ణరాజు గుర్తు చేశారు. రాఫెల్ ఒప్పందం చుట్టూ రాజకీయాలు అల్లుకుంటున్న నేపథ్యంలో రాజు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వివాదానికి సంబంధించి ‘‘హెచ్ఎఎల్’’ వ్యక్తులు బహిరంగంగా మాట్లాడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. హెచ్ఎఎల్ వాదనను వాయుసేన మాజీ చీఫ్ ఎవై టిప్నిస్ పరోక్షంగా ఖండించారు. రాఫెల్ యుద్ధ విమానాల తయారీ హెచ్ఎఎల్ కు పెద్ద సవాల్ గా ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. యితే ఫ్రాన్స్ నుంచి సాంకేతిక పరిజ్ఞానం బదిలీతో అతి అసాధ్యమైన కార్యమైతే కాదని పేర్కొనడం గమనార్హం. ‘‘గతంలో ఉన్నట్లు హెచ్ఎఎల్ పనితీరు ఇప్పుడు లేదు. తాను చేయగలిగిన దాని కన్నా అది ఎక్కువ చెబుతోంది. చాలా సందర్భాల్లో పనుల నాణ్యత కూడా నాసిరకంగా ఉందని టిప్నిస్ పేర్కొన్నారు.

ఆఫ్ సెట్ కాంట్రాక్టు ప్రకారం.......

ఒప్పందంలో భాగంగా ‘‘ఆఫ్ సెట్ కాంట్రాక్టు’’ నిబంధనల మేరకు విమానంలోని కొన్ని భాగాలను భారత్ లో మాత్రమే తయారు చేయాల్సి ఉంటుంది. కనీసం 30 శాతం ఉత్పత్తులను భారత్ లో తయారు చేయడం గాని, లేదా భారత్ లో ఉత్పత్తి చేయడంగాని చేయాలి. ఇందుకోసం ఏదైనా భారత్ కంపెనీతో భాగస్వామ్యం చేసుకోవాలి. ఇందులో భాగంగానే రిలయన్స్ డిఫెన్స్ ను తాము ఎంపిక చేసుకున్నామని డసో ఏవియేషన్ వివరణ ఇస్తోంది. ‘‘రక్షణ ఉత్పత్తుల సేకరణ విధానం (defence procurement procedure) -2016 ప్రకారం ఈ ఆఫ్ సెట్ కాంట్రాక్టు ఇచ్చాం.దీంతో పాటు భారత్ లో తయారీ (make in india) లో భాగంగా రిలయన్స్ గ్రూపును భాగస్వామిగా ఎంపీక చేసుకోవాలని నిర్ణయించాం’’ అని డసో ఏవియేషన్ చెబుతోంది. ఇతర కంపెనీలతో కూడా భాగస్వామ్య ఒప్పందాలపై సంతకాలు చేశామంటోంది. బీటీఎస్ఎల్, డెఫ్ సిస్, కెనెటిక్ మహేంద్ర, మైని, శ్యాంటెల్ తదితర సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పింది. భాగస్వామ్యంకోసం మరో వంద కంపెనీలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని డసో ఏవిషేయన్ స్పష్టం చేసింది. డసో ఏవియేషన్ ఎన్ని వివరణలు ఇస్తున్నప్పటికీ ‘‘రిలయన్స్’’ ఎంపికపై సందేహాలు తొలగడం లేదు. ఒప్పంద సమయంలో అధ్యక్షుడిగా ఉన్న ఫ్రాంకోయిస్ హాలన్ మాటలకు, ఒప్పంద సంస్థ డసో ఏవియేషన్ వాదనకు పొంతన ఉండటం లేదు. మొత్తం మీద ఒప్పందంలో లొసుగులు ఉన్నాయన్న అనుమానాలకు కొదవలేదు. ఇతర భాగస్వామ్య సంస్థలకన్నా రిలయన్స్ ఎంపికే అన్ని అనుమానాలకు కారణం అవుతుంది. చివరికి రాఫెల్ మరో బోఫోర్స్ గా రూపాంతరం చెందడం ఖాయంగా కనపడుతోంది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News