చీలుస్తుంది ఎవరు?

ప్రాంతీయ పార్టీలు చీలిపోవడం సర్వ సాధారణమే. ఇదేమీ ఆశ్చర్యం కల్గించే విషయం కాదు. ప్రాంతీయ పార్టీలంటేనే కుటుంబ పార్టీలని వేరే చెప్పనక్కర లేదు. కేవలం లీడర్ ఇమేజ్ [more]

Update: 2019-11-27 18:29 GMT

ప్రాంతీయ పార్టీలు చీలిపోవడం సర్వ సాధారణమే. ఇదేమీ ఆశ్చర్యం కల్గించే విషయం కాదు. ప్రాంతీయ పార్టీలంటేనే కుటుంబ పార్టీలని వేరే చెప్పనక్కర లేదు. కేవలం లీడర్ ఇమేజ్ మీద ఆధారపడి ప్రజామోదం పొందిన ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నంత వరకూ బాగానే ఉంటుంది. అధికారానికి దూరమయిన తర్వాత చీలిక తప్పదు. కుటుంబ సభ్యులే చీలికకు కారణమవుతారు. దేశవ్యాప్తంగా ఇది జగమెరిగిన సత్యమే. మహారాష్ట్రలో తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చూస్తే మరొకసారి దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల మనుగడపై చర్చ జరుగుతోంది.

ఏ రాష్ట్రం నుంచి చూసినా….

ములాయం నుంచి కరుణానిధి వరకూ…. ఎన్టీరామారావు నుంచి మమత బెనర్జీ వరకూ అందరూ స్ధానిక సెంటిమెంట్, సామాజిక సమీకరణల ఆధారంగా ప్రాంతీయ పార్టీలను స్థాపించిన వారే. ముందుగా ములాయం సింగ్ ను తీసుకుంటే సమాజ్ వాదీ పార్టీ ఉత్తర్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్నంతవరకూ ఆ పార్టీలో చీలిక రాలేదు. అధికారం కోల్పోయిన వెంటనే అఖిలేష్ యాదవ్ తన తండ్రిని పార్టీ పదవి నుంచి తప్పించారు. బాబాయ్ శివపాల్ యాదవ్ ను పార్టీ నుంచి పంపించివేశారు. దీంతో శివపాల్ యాదవ్ మరొక పార్టీ పెట్టుకోవాల్సి వచ్చింది. ములాయం సింగ్ జీవించి ఉండగానే సమాజ్ వాదీ పార్టీలో చీలిక రావడం బాధాకరమే.

లాలూ కుటుంబంలో…..

ఇక లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్ ను 1997 లో స్థాపిించి బీహార్ లో ఒక వెలుగు వెలిగారు. ఆర్జేడీలో కూడా కుటుంబ పెత్తనం ఎక్కువ కావడం చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ కు ప్రాధాన్యత ఇవ్వడంతో పెద్దకుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మరొక పార్టీ పెట్టేశారు. కుటుంబంలో ఆధిపత్య పోరు పార్టీ చీలికకు కారణమయింది. ఇక తమిళనాడులో కరుణానిధి బతికుండగానే కుమారులు ఆళగిరి, స్టాలిన్ ల మధ్య విభేదాలు తలెత్తాయి. ఆళగిరిని పార్టీ నుంచి కరుణానిధి సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. కరుణానిధి మరణానంతరం పార్టీలో చీలిక రాకపోయినా కుటుంబంలో మాత్రం చీలిక వచ్చింది.

తాజాగా ఎన్సీపీలో….

ఇక మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లో సయితం చీలిక రావడానికి కుటుంబ విభేదాలే కారణమని చెప్పక తప్పదు. అజిత్ పవార్ శరద్ పవార్ సోదరుడు కుమారుడు. నిన్న మొన్నటి వరకూ అజిత్ పవార్ కు పార్టీలో ప్రాధాన్యత ఉండేది. అయితే శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే రాజకీయంగా ఎదిగిన తర్వాత అజిత్ పవర్ ను కొద్దికొద్దిగా శరద్ పవార్ పక్కన పెట్టేయడం ప్రారంభించారు. అరవై ఏళ్ల అజిత్ పవార్ తన కుమారుడు రాజీకీయ భవిష్యత్ కు సుప్రియ అడ్డుపడుతుందని భావిస్తు గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ టోటల్ గా నీతి ఏందంటే…? ప్రాంతీయ పార్టీల మనుగడ స్థాపించిన నేత బతికున్నంత వరకూ ఉంటుంది. తర్వాత ఆ పార్టీలు చీలికలు…పీలికలుగా మారి అధికారానికి అందనంత దూరంగా ఉంటాయన్నది వాస్తవం. అజిత్ పవార్ తిరిగి ఎన్సీపీలోకి వచ్చినా భవిష్యత్తులో ఆయన పార్టీలో నమ్మకంగా ఉంటారన్న గ్యారంటీ లేకపోవడమే.

Tags:    

Similar News