సర్దుకుపోవాల్సిందేనా?

ఆయనది దాదాపు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం. అయినా సరే జూనియర్ నేత డామినేషన్ చేయడం ఆయన తట్టుకోలేకపోతున్నారు. అధిష్టానం కూడా మొర వినకపోవడంతో ఛాన్స్ కోసం [more]

Update: 2019-11-16 11:00 GMT

ఆయనది దాదాపు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం. అయినా సరే జూనియర్ నేత డామినేషన్ చేయడం ఆయన తట్టుకోలేకపోతున్నారు. అధిష్టానం కూడా మొర వినకపోవడంతో ఛాన్స్ కోసం వేచిచూస్తున్నారు. ఆయనే సీనియర్ నేత రెడ్యానాయక్. రెడ్యానాయక్ గిరిజన నేత. ఇప్పటికి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. డోర్నకల్ నియోజకవర్గం నుంచి అత్యధిక సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీ రికార్డుల్లోకి ఎక్కారు.

కేసీఆర్ హవా సాగినా….

2014 ఎన్నికల్లో కేసీఆర్ హవా విపరీతంగా ఉన్నప్పటికీ రెడ్యానాయక్ విజయం సాధించారు. కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని భావించిన రెడ్యానాయక్ అప్పుడే టీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. కాంగ్రెస్ నుంచి రావడంతో అపట్లో రెడ్యానాయక్ కు మంత్రి పదవి దక్కలేదని భావించారు అంతా. కానీ 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ టిక్కెట్ మీద రెడ్యానాయక్ విజయం సాధించినా మంత్రి పదవి దక్కలేదు. వరంగల్ జిల్లా నుంచే ఆరుసార్లు విజయం సాధించిన ఎర్రబెల్లికి మాత్రం కేసీఆర్ స్థానం కల్పించారు.

ప్రత్యర్థిని అందలమెక్కించడంతో….

అయితే ఇక్కడ మరో విషయం ఉంది. రెడ్యానాయక్ కు ఎమ్మెల్యేసీటు, ఆయన కుమార్తె కవితకు మహబూబాబాద్ ఎంపీ టిక్కెట్లు ఇచ్చారు కేసీఆర్. ఒకే కుటుంబంలో రెండు పదవులు ఇవ్వడం వల్లనే మంత్రి పదవి రెడ్యానాయక్ కు దక్కలేదన్న అభిప్రాయం కొందరిలో ఉంది. రెడ్యానాయక్ తనకు మంత్రి పదవి దక్కకపోయినా బాధపడలేదు. అదే డోర్నకల్ నియోజకవర్గంలో తనకు ప్రత్యర్థిగా ఉన్న సత్యవతి రాథోడ్ కు మంత్రిపదవి దక్కడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

కక్కలేక…మింగలేక….

డోర్నకల్ నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా సత్యవతి రాథోడ్ ప్రయత్నించారని అధిష్టానికి నివేదికలు పంపినా కేసీఆర్ ఆమెను ఎమ్మెల్సీని చేసి మరీ మంత్రిని చేయడాన్ని పెద్దాయన తట్టుకోలేకపోతున్నారు. ఇక తనకు మంత్రి పదవి దక్కదని అర్థమయిందని భావించిన రెడ్యానాయక్ కక్కలేక మింగలేక పార్టీలోనే కొనసాగుతున్నారు. అందుకే ఆయన ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారంటున్నారు. తాను రెడ్లను,దొరలను ఎదుర్కొని నిలబడ్డానని అన్నారు. ఇది కేసీఆర్ ను ఉద్దేశించి చేసినవేనన్న అభిప్రాయం కలుగుతోంది.

Tags:    

Similar News