జ‌గ‌న్‌పై వైసీపీ లేడీ ఎమ్మెల్యే కినుక‌.. క‌థేంటి..!

రాజ‌కీయాల్లో నిన్నగాక మొన్న రాజ‌కీయాల్లోకి వ‌చ్చినవారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల అనంత‌రం పార్టీలు మారి వైసీపీలోకి వ‌చ్చిన వారు ప‌ద‌వులు కొల్లగొడుతున్నారు. జ‌గ‌న్‌ను మ‌చ్చిక చేసుకుంటున్నారు. పార్టీలోను, [more]

Update: 2020-09-18 02:00 GMT

రాజ‌కీయాల్లో నిన్నగాక మొన్న రాజ‌కీయాల్లోకి వ‌చ్చినవారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల అనంత‌రం పార్టీలు మారి వైసీపీలోకి వ‌చ్చిన వారు ప‌ద‌వులు కొల్లగొడుతున్నారు. జ‌గ‌న్‌ను మ‌చ్చిక చేసుకుంటున్నారు. పార్టీలోను, ప్రభుత్వంలోనూ పైచేయి సాధించేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. మ‌రి అలాంటిది వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉండి.. పార్టీ కోసం.. ప‌నిచేసి.. ఓట‌ములు ఎదుర్కొని.. ప్రత్యర్థుల నుంచి అనేక విమ‌ర్శలు చ‌విచూసినా.. పార్టీ కోసం కృషి చేసిన వారిలో అంతో ఇంతో బాధ ఉండ‌డం స‌హ‌జం. జ‌గ‌న్ అధికారంలోకి రావాల‌ని కోరుకున్నవారిలో రాష్ట్రంలో ఆ చివ‌రి నుంచి ఈ చివ‌రి వ‌ర‌కు ఎంతో మంది ఉన్నారు. ఈ లిస్టులో చాలా మందే ఉన్నారు. వారిలో ఇప్పుడు ఎమ్మెల్యేలుగా రెండు నుంచి ఐదు సార్లు గెలిచిన వారు ఎలాంటి ప్రయార్టీ లేక‌పో‌వ‌డంతో మామూలుగా రగిలిపోవ‌డం లేదు.

రెండు నియోజకవర్గాల్లో…..

ఇలాంటి వారిలో శ్రీకాకుళం జిల్లా పాత‌ప‌ట్నం ప్రస్తుత ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఒక‌రు. శ్రీకాకుళం జిల్లా ప‌రిష‌త్ మాజీ చైర్మన్‌ పాల‌వ‌ల‌స రాజ‌శేఖ‌రం కుమార్తె అయిన రెడ్డి శాంతి ఫ్యామిలీకి ఉన్నత చ‌రిత్ర ఉంది. ఈమె త‌మ్ముడు పాల‌వ‌ల‌స విక్రాంత్‌కుమార్ ప్రస్తుతం డీసీసీబీ చైర్మన్‌గా వ్యవ‌హ‌రిస్తున్నారు. శాంతి భ‌ర్త.. .. కేంద్ర స‌ర్వీసుల్లో చేశారు. ఇట‌వ‌లే అనారోగ్యంతో హ‌ఠాత్తుగా మృతి చెందారు. ఆమె కుమార్తె కూడా ఇటీవ‌లే అతి పిన్నవయ‌సులో 21 ఏళ్లకే ఐఏఎస్ అయ్యారు. ఇలాంటి శాంతి.. వైసీపీ ఆవిర్భావం నుంచి ప‌నిచేశారు. పార్టీని ముందుకు న‌డిపించ‌డంలో ఎదురైన అనేక వ్యతిరేక‌త‌ల‌ను కూడా త‌ట్టుకుని ముందుకు సాగారు. గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్న పాల‌వ‌ల‌స ఫ్యామిలీకి రాజాం, పాల‌కొండ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో మంచి ప‌ట్టు ఉంది. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల కాంగ్రెస్ రాజ‌కీయం పాల‌వ‌ల‌స ఫ్యామిలీ చుట్టూనే తిరిగేది.

తనను గుర్తించడం లేదని…..

2014లో శ్రీకాకుళం ఎంపీగా జ‌గ‌న్ అవ‌కాశం ఇచ్చిన‌ప్పుడు హోరా హోరీ త‌ల‌ప‌డ్డారు. అయితే, సొంత పార్టీలోనే నేత‌లు ఆమెకు క‌లిసి రాక‌పోవ‌డం, ధ‌ర్మాన వంటి సీనియ‌ర్లు కూడా ఆమెతో తెర‌చాటుగా విభేదించ‌డం వంటి కార‌ణాల‌తో ఆమె కింజ‌రాపు రామ్మోహ‌న్‌పై ఓట‌మిపాల‌య్యారు. ఆ ఎన్నిక‌ల్లో ఆమె జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా ఉండ‌డంతో పాటు జిల్లాలో చాలా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఖ‌ర్చంతా భ‌రించారు. పార్టీ అధ్యక్షురాలిగా ఆమె ఓట‌మిని దిగ‌మింగి మ‌రీ పార్టీని ముందుకు న‌డిపించారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో పాత‌ప‌ట్నం టికెట్ సంపాయించుకుని విజ‌యం సాధించారు. మ‌రి ఇంత చేసిన శాంతికి పార్టీ త‌ర‌ఫున ద‌క్కిన మ‌ర్యాద ఏంటి ? ఆమెను జ‌గ‌న్ ఏమ‌న్నా గుర్తించారా ? అంటే.. లేద‌నే చెప్పాలి.

పట్టించుకోక పోవడంతో…..

నిన్నగాక మొన్న పార్టీలోకి వ‌చ్చిన వారికి ప‌ద‌వులు క‌ట్టబెట్టిన జ‌గ‌న్ పార్టీకి వెన్నుద‌న్నుగా ఉన్న రెడ్డి శాంతిని మాత్రం ప‌ట్టించుకోలేదు. పైగా ఆమెకు ధ‌ర్మాన బ్రద‌ర్స్ నుంచి పెద్ద‌గా మ‌ద్దతు లేక‌పోయినా.. పార్టీని విజ‌య‌తీరాల వైపు న‌డిపించారు. ఈ క్రమంలోనే ఆమె తీవ్రస్థాయిలో ఫైర‌వుతున్నార‌ట‌. నేను పార్టీ కోసం ఎంతో చేశాను. కానీ, పార్టీ నాకోసం ఏం చేసింద‌నే ప్రశ్న ఆమె లేవ‌నెత్తుతున్నారు. మంత్రి ప‌ద‌వి ఆశించిన రెడ్డి శాంతికి క‌నీసం నామినేటెడ్ ప‌ద‌వి కూడా ఇవ్వలేదు. పార్టీ కోసం ఎంతో ఖ‌ర్చు చేసి.. అప్పుడున్న ప‌రిస్థితుల్లో ఎంపీగా పోటీ చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాక‌పోయినా తాను ఎంతో క‌ష్టప‌డ్డాన‌ని ఆమె వాపోతోన్న ప‌రిస్థితి. అయినా జ‌గ‌న్ ద‌గ్గర గుర్తింపు లేద‌ని.. కనీసం తాను ఆశించిన స్థాయిలో నియోజ‌క‌వ‌ర్గానికి నిధులు కూడా ఇవ్వడం లేద‌ని ఆమె అస‌హ‌నంతో ఉన్నార‌ని సిక్కోలులో పాలిటిక్స్‌లో చ‌ర్చలు న‌డుస్తున్నాయి.

Tags:    

Similar News